జయలక్ష్మి తన కెరీర్ అత్యున్నత దశలో ఉన్నప్పుడు పెండ్లి చేసుకోవాలనుకుంది. మంచి కెరీర్‌ను వదులుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకోవడంతో పరిశ్రమంతా ఆశ్చర్యపోయింది. జయలక్ష్మి తమిళంలో సుప్రసిద్ధ నటుడైన ఎం.జి.ఆర్ సోదరుని కొడుకు సుకుమారన్‌ని ప్రేమించింది. అయితే వారికి వివాహం కూడా అయిందని అంటారు. కేవలం వివాహం కుదిరిందని ఇంకొందరంటారు. సుకుమార్ తమిళ సినీ పరిశ్రమలో కేవలం తన సొంత బ్యానర్ సినిమాలలో మాత్రమే నటించే హీరో. ఆయన సరసన ఆమె రెండు సినిమాల్లో మాత్రం నటించింది. రెండవ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతున్నప్పుడు సుకుమారన్ స్వయంగా తాను త్వరలో జయలక్ష్మిని పెళ్లాడబోతున్నట్టు ప్రకటించాడు. అయితే సుకుమారన్ పరిశ్రమలోని చాలామంది మహిళలతో సంబంధాలు కలిగి ఉన్నాడని, అతన్ని పెళ్లి చేసుకోవద్దని తండ్రి ఎంత చెప్పినా వినలేదు.
జయలక్ష్మి ఒక దశలో సుకుమారన్ కోసం తల్లిదండ్రులను సైతం వదిలివేయడానికి సిద్ధపడింది. దాంతో విధి లేక తండ్రి ఆమె పెళ్ళికి అంగీకరించాడు. ఈ విషయాన్ని ఫటాఫట్ జయలక్ష్మి ఆనందంగా వెళ్లి సుకుమారానికి చెప్పింది కూడా. అయితే సుకుమారన్ పెళ్లికి ముందే ఆమెను సినిమాలకు దూరం కావాలని నిబంధన పెట్టాడు. అతనిపై ఉన్న ప్రేమతో క్రమంగా సినిమాలకు కూడా దూరమైంది. అయితే సుకుమారన్ జయలక్ష్మితో పెళ్లికి క్రమంగా విముఖత చూపించడం ప్రారంభించాడు. రకరకాల వేధింపులతో ఆమెను మానసిక క్షోభకు గురి చేసేవాడు. మొదట 1980 ఏప్రిల్ 15న పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. కానీ ఈ ముహూర్తాన్ని సుకుమారన్ ఉద్దేశపూర్వకంగా వాయిదా వేయించాడు. ఈ పరిస్థితులలో మానసికంగా కరిగిపోతున్న జయలక్ష్మిని తండ్రి స్థల మార్పు కోసం నెల్లూరుకు తీసుకెళ్లాడు. అక్కడ రెండు నెలలు ఉన్న తర్వాత తిరిగి మద్రాస్‌కు జూన్ 13న తిరిగి వచ్చింది.
ఈ రెండు నెలల కాలంలో సుకుమారన్ జయలక్ష్మితో ఎలాంటి సంబంధాలు లేకుండా మరో కొత్త సినీ నటితో తన ప్రేమాయణాన్ని మొదలుపెట్టాడు. ఇది తెలుసుకున్న జయలక్ష్మి తన ఇంటి మీద ఉన్న వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. అయితే తల్లిదండ్రులు చూడటం వల్ల వారు ఆమెను కాపాడగలిగారు. ఈ పరిణామాలు జరిగిన కొన్నాళ్ళకే సుకుమారన్ పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ఈ బంధం కోసం తన కెరీర్ మొత్తాన్ని పణంగా పెట్టిన జయలక్ష్మికి ఆశలన్నీ ఒక్కసారిగా కూలిపోవడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఆ మనోవేదన భరించలేక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. అయితే మరికొందరు ఉరిపోసుకుని చనిపోయిందని కూడా చెబుతారు. జూన్ 14న నిద్ర మాత్రలు మింగిన జయలక్ష్మి జూన్ (1980) 19న ఆసుపత్రిలో కన్ను మూసింది. అయితే ఒక మరాఠీ పత్రిక ”జయలక్ష్మి తన గది లోపలే ఉంది, కానీ చాలా సేపటి వరకు ఆమె బయటకు రాలేదు. ఆమె కుటుంబ సభ్యులు తలుపును పదే పదే తట్టారు; చివరకు వారు తలుపును బద్దలు కొట్టి లోపలికి వెళ్ళినప్పుడు జయలక్ష్మి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంది” అని తన కథనంలో రాసింది.
ఫటాఫట్ జయలక్ష్మి మరణానికి కారణం సుకుమారన్ అన్నది అందరికీ బహిరంగ రహస్యమే. అయినా అప్పటి ఎంజీఆర్ అధికారంలో ఉండటంవల్ల ఎవ్వరు కూడా ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడలేదు. చివరికి సుకుమారన్ జయలక్ష్మి ఆఖరి చూపుకు కూడా రాలేదు.
ఒక ప్రేమ… ఒక మోసం… ఒక ఆత్మహత్య…
- Advertisement -
- Advertisement -



