Tuesday, January 20, 2026
E-PAPER
Homeమానవిఉదయం ఉద్యమం

ఉదయం ఉద్యమం

- Advertisement -

తెలుగు నేలపై మహిళా ఉద్యమ నిర్మాతలలో స్ఫూర్తిదాయకమైన నాయకురాలు మోటూరు ఉదయం. ఆమె కేవలం మహిళా ఉద్యమానికే పరిమితమవ్వలేదు. దోపిడీ లేని సమాజం కోసం అహర్నిశలూ శ్రమించారు. ఉద్యమ నిర్వహణ, ప్రేరణ, పోరాట కార్యకర్త, నిధుల సేకరణ.. ఇలా విభిన్న బాధ్యతలను అలవోకగా చేయించగల నేర్పు ఆమె సొంతం. అంతేకాదు ప్రజాకళాకారిణిగా సాంస్కృతిక కళారూపాల్ని రాజకీయ పోరాటాల్లో చక్కగా ఉపయోగించారు.

మొదటి మహిళా బుర్రకథ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యమ నిర్మాణ క్రమంలో అనేక నిర్బంధాలు ఎదుర్కొన్నారు. జైలు జీవితం గడిపారు. పసిపిల్లలతో అజ్ఞాతంలో ఉన్నారు. కఠినమైన పేదరికం అనుభవించారు. ఈనెల 25 నుండి 28 వరకు ఐద్వా అఖిల భారత మహాసభలు మన హైదరాబాద్‌లో జరగబోతున్న సందర్భంగా అటువంటి గొప్పనేతను మననం చేసుకోవడం మన కర్తవ్యం…

గుంటూరు జిల్లా కమ్మవారి పాలంలో సంపన్న రైతు కుటుంబంలో 1924 అక్టోబర్‌ 13న ఉదయం జన్మించారు. కృష్ణాజిల్లా చల్లపల్లి జమిందారీలో దివాన్‌గా పని చేస్తున్న మేనమామ వద్ద పెరిగారు. ఉదయం తండ్రి పర్వతనేని వెంకయ్య. ఈయన ప్రగతిశీలవాది. ఉదయం అన్నయ్య ఆరోజుల్లోనే వితంతు వివాహం చేసుకున్నారు. అటువంటి గొప్ప కుటుంబంలో పుట్టిన ఉదయం చిన్నతనం నుండే అన్నింట్లో చురుగ్గా ఉండేవారు.

మహిళా బుర్రకథ బృందం
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఉదయం గుంటూరు జిల్లా ఉద్యమంలో పని చేస్తున్నారు. ప్రజా సమస్యలపై జనాన్ని సమీకరించేందుకు బుర్రకథను ఆమె మంచి సాధనంగా ఉపయోగిం చుకునేవారు. యుద్ధకాలంలో నిత్యావసర సరుకులను అధికధరకలు అమ్ముకుంటున్న వ్యాపారుల ఆట కట్టించేందుకు మహిళా బుర్రకథ బృందాన్ని రూపొందించి వారి ఆగడాలను ప్రజల ముందు పెట్టారు. ప్రజలందరికీ సక్రమంగా సరుకులు అందించడంలో కృషి చేశారు. వీరి బృందంలో ఉదయంతో సి.హెచ్‌.కోటేశ్వరమ్మ, ఎం.పార్వతి వంటి ప్రతిభావంతులైన కళాకారులు ఉండేవారు. వీరి బుర్రకథను చూసేందుకు పొరుగు గ్రామాల నుండి కూడా ఎండ్ల బండ్లు కట్టుకొని మరీ వచ్చేవారు.

ఎన్ని నిర్బంధాలు ఎదురైనా…
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉదయం జంట ఎంతో శ్రమించేది. అనేక నిర్బంధాలు సైతం ఎదుర్కొన్నారు. అజ్ఞాత జీవితంలో ఆర్థికంగా ఎంతో గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నారు. వీరికి 1938లో ఒక పాప, 1940లో బాబు పుట్టి చనిపోయారు. తర్వాత టాన్యా జన్మించారు. వీరు చేసిన ప్రచార కార్యక్రమాల ద్వారా మహిళా ఉద్యమానికి పునాదులు వేశారు. మొదట గుంటూరు జిల్లా మహిళా కార్యకర్తల కోసం పాఠశాల నిర్వహించారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి స్కూలును కూడా ఏర్పాటు చేశారు.

ఇందులో స్త్రీలకు ప్రథమ చికిత్సా విధానాన్ని బోధించారు. ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఎం.హెచ్‌ను ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు తరలించింది. అప్పుడే ఆమెకు ఉష పుట్టారు. ఆ సమయంలో తమ్ముడు ఆమెకు అండగా నిలిచాడు. ఎన్ని నిర్బంధాలు ఎదురైన్నా ఉద్యమాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. చాలా ఏండ్ల పాటు మహిళా సంఘం మహాసభలు జరపకుండా ప్రభుత్వాలు అడ్డంకులు, నిషేధాలు కొనసాగించాయి. అయినప్పటికీ మహిళలను ఉద్యమాల్లోకి తీసుకొచ్చేందుకు ఆమె అహర్నిశలూ కృషి చేస్తూనే ఉన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా…
అడ్డంకులన్నీ తొలగించుకొని 1974లో ఆంధ్రప్రదేశ్‌ మహిళా సంఘం రెండవ మహాసభలు జరిగాయి. వీటిలో ఉదయం ప్రధానకార్యదర్శిగా ఎన్నికయ్యారు. అనంతరం మానికొండ సూర్యావతి, మల్లు స్వరాజ్యంతో కలిసి ఉదయం రాష్ట్రంలోని ప్రధాన జిల్లాలలో పర్యటించి మహిళల్ని సంఘటితం చేసేందుకు కృషి చేశారు. దీంతో రాష్ట్రంలో మహిళా ఉద్యమం బాగా విస్తరించింది. ఉదయం నాయకత్వాన మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం సంఘం పని చేసింది. అన్ని రంగాల స్త్రీలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఆమె ఉద్యమాలను రూపొందించేవారు. ఇటు ఉద్యమాన్ని నడిపించడంతో పాటు కుటుంబ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. బిడ్డలు టాన్యా, ఉషలను బాగా చదివించి సమాజానికి ఉపయోగపడే డాక్టర్లుగా వారిని తీర్చిదిద్దారు.

ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా…
1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జన్సీ విధించడంతో ఉదయంలోని కళాకారురాలు మళ్లీ మేల్కొంది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో పలు కళారూపాలను ఆమె రూపొందించారు. ఉదయం బృందం అనేక కొత్త రూపకాల్ని రూపొందించి బుర్రకథలుగా ప్రదర్శించారు. 1980లో మహిళా ఉద్యమం రాష్ట్రంలో స్త్రీలు ఎదుర్కొంటున్న అనేక అంశాలపై ఆందోళనలు నిర్వహించింది. 1978లో రమిజాబి అనే 45 ఏండ్ల మహిళపై హైదరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఖాకీలు లైంగిక దాడికి పాల్పడ్డారు. అలాగే యాదగిరి గుట్టలో షకీలా అనే మహిళపై మరో ఘోరం జరిగింది. ఈ రెండు ఘటనలపై బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, నిందితులను శిక్షించాలని పోరాటం చేశారు. అలాగే వరకట్నం, కుటుంబహింస, పనిప్రదేశాలలో లైంగిక దాడులు వంటి సమస్యలపై ఉదయం అలుపెరుగని ఉద్యమాలు నిర్వహించారు. ఆడపిల్లలకు కరాటే, కుటుంబ న్యాయసలహా కేంద్రం వంటివి ప్రారంభించారు.

అనేక డిమాండ్లతో…
రాష్ట్రంలో మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ఉదయం ప్రత్యక్షమయ్యేవారు. ఆరోజుల్లో కొన్ని తెలుగు సినిమాల్లో దర్శకులు ఉదయాన్ని స్ఫూర్తిగా తీసుకొని పాత్రల్ని సృష్టించేవారంటే ఆమెకు ఎంతటి పేరుప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1983లో వంశపారంపర్యంగా వచ్చే ఆస్థిలో మహిళలకు సమానభాగం, వ్యవసాయ కార్మికులకు ప్రసూతి ప్రయోజనాలు, గ్రామ-పట్టణ మహిళలకు మరుగుదొడ్లు, యువతులకు ప్రత్యేక పాలిటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్లు, అనాథ స్త్రీలకు శరణాలయాల నిర్మాణం వంటి డిమాండ్లతో ఆ నాడు లక్షలాది మందితో సంతకాలు చేయించి అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావుకు అందించారు. ఆ సమయంలో సాధించిన హక్కే మహిళలకు ఆస్తిలో వాటా. దీంతోపాటు అనేక డిమాండ్లను సాధించుకున్నారు.

రచయిత కూడా…
ఉదయం ఉద్యమకారిణి మాత్రమే కాదు రచయిత, కవయిత్రి కూడా. 1950లో ‘ఆంధ్రవనిత’ అనే పరిత్రకు సంపాదకవర్గ సభ్యులుగా ఉన్నారు. సాహిత్య, నాటక, సినిమా రంగాల్లో ఆమెకు పెద్ద సంఖ్యలో మిత్రులుండే వారు. రాజకీయాలు, మహిళారంగాలపై ఆమె అనేక పుస్తకాలు రచించారు. భారత్‌, సోషలిస్టు దేశాల పిల్లల స్థితిగతుల్ని పోలుస్తూ ‘బాలభారతం’ అనే గ్రంథాన్ని రాశారు. సోషలిస్టు నాయకురాలు, సినిమా నటి స్నేహలతరెడ్డిని ఎమర్జెన్సీ సమయాన ప్రభుత్వం అరెస్టు చేసింది. జైలు నుండి విడుదలైన తర్వాత ఆమె మరణించారు. స్నేహలత అత్మస్థైయిర్యాన్ని అభినందిస్తూ ఉదయం పుస్తకాన్ని తెచ్చారు. కృష్ణాజిల్లా దివితాలుక ఉప్పెన సృష్టించిన బీభత్సంపై ఒక పుస్తకాన్ని ప్రచురించారు.

అందరితో అప్యాయంగా…
ఉదయం తన భారీ కాయన్ని కూడా లెక్క చేయకుండా ఎప్పుడూ తీరికలేకుండా ప్రయాణిస్తూ ఉండేవారు. చొక్కా ధరించి దానిపై చీర కట్టుకొని ప్రత్యేక ఆకర్షణగా కనిపించేవారు. ఉద్యమాల్లో ఎంత తీరికలేకున్నా బంధుమిత్రులను కలుస్తుండే వారు. కార్యకర్తలు, స్నేహితులు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే అప్యాయంగా పలకరించే వారు. ఆనాడు ప్రజాశక్తి పత్రికలో అడ్వటేజ్‌మెంట్‌ మేనేజర్‌గా కూడా పని చేశారు. 1981 ఐద్వా వ్యవస్థాపక మహాసభల్లో ఉదయం పాల్గొన్నారు. ఐద్వా తొలి కోశాధికారిగా ఎన్నికయ్యారు. 1994 కోయంబత్తూరు మహాసభ అమెను ఐద్వా ఉపాధ్య క్షురాలిగా ఎన్నుకుంది. 1993లో విజయవాడలో జరిగిన రాష్ట్ర మహిళా సంఘం స్వర్ణోత్సవ సభల వరకూ ఆమె ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

కళలంటే ఆసక్తి…
బాల్యం నుండి ఉదయానికి నటించటమన్నా, పాటలు పాడటమన్నా అమితాసక్తి. 1938లో అప్పటికే కమ్యూనిస్టు పార్టీలో పని చేస్తున్న మోటూరు హనుమంతరావు(ఎం.హెచ్‌)తో ఆమె వివాహం జరిగింది. అప్పుడు ఆమెకు 14 ఏండ్లు. కళారూపాలను ఇష్టపడే ఉదయాన్ని ఎం.హెచ్‌ మొదట్నుండీ కళారంగాన మెరుగైన తర్ఫీదు పొందమని ప్రోత్సహించారు. బుర్రకథ సామ్రాట్‌ నాజర్‌ వద్ద ఆమె శిక్షణ పొందారు. బుర్రకథ చెప్పడంలో ప్రావీణ్యత సంపాదించారు. ఎం.హెచ్‌ ప్రోత్సాహంతో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు.

మొక్కవోని పోరాటపటిమ
1998 బెంగుళూరు ఐద్వా మహాసభలకు ముందు ఆమె అస్వస్థులయ్యారు. నరాల బలహీనతతో మంచానికి పరిమితమయ్యారు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు ఉద్యమ విషయాలను తెలుసుకుంటూ ఉండేవారు. 2001లో ఎం.హెచ్‌ మరణం ఆమెకు పెద్ద ఎదురుదెబ్బ. 2002 మార్చి 31న కూతురు ఉష ఇంట్లో ఉదయం తుదిశ్వాస వదిలారు. మొక్కవోని పోరాటపటిమ, ధైర్యసాహసాలకు మారుపేరైన ఆమె కేవలం మహిళా ఉద్యమాలకే కాకుండా అభ్యుదయ పోరాటాలలో సైతం ధృవతారగా నిలిచారు. ఎందరికో స్ఫూర్తిదాయకమయ్యారు.

‘ధిక్కారస్వరాలు’ నుండి సేకరణ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -