కోపం ఎంత ఎక్కువగా వస్తే మనిషి అన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని దానర్థం. బంధాలు బీటలు వారడంతోపాటు సమాజంలో పలుచనవుతారు. అయితే, కోపం ద్వారా సామాజిక సంబంధాలతోపాటు ఆరోగ్యం కూడా తీవ్రంగా దెబ్బ తింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండా కోపం వచ్చే వారికి గుండె సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కోపం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం...
మానసిక ఆరోగ్యంపై ప్రభావం: సాధారణంగా కోపం అనేది మానవ భావోద్వేగం. ఏదైనా విషయంలో నిరాశ చెందడం, పరిస్థితులపై నియంత్రణ కోల్పోవడం లేదా తప్పు చేసినట్లు భావించడం లాంటి సందర్భాల్లో కోపం వస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించే శరీర యంత్రాంగంలో భాగమని కూడా చాలా మంది భావిస్తారు. అయితే కోపం అనేది నియంత్రణలో ఉన్నంత వరకు మంచిదే అంటున్నారు నిపుణులు. అంతకు మించి హద్దులు దాటితేనే అది శారీరక, మానసిక ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తుందని చెబుతున్నారు.
గుండె ఆరోగ్యంపై ప్రభావం: అధిక కోపం గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అనేక పరిశోధనలు నిరూపించాయి. తరచూ అనవసరంగా కోపం రావడం అనేది రక్తపోటును గణనీయంగా పెంచే పరిస్థితి కావచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు అధిక రక్తపోటు అనేది గుండె ఆరోగ్యంపై ఒత్తిడిని పెంచడం వల్ల గుండె పోటు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అనవసరంగా కోపం వచ్చే వాళ్లుకు కరోనరీ హార్ట్ డిసీజ్ (జనణ) ప్రమాదం ఎక్కువగా ఉంటుందని National Library of Medicine కూడా పేర్కొంది.
ఒత్తిడి హార్మోన్లు: కోపంగా ఉన్నప్పుడు అడ్రినలిన్, కార్టిసాల్ లాంటి ఒత్తిడి హార్మోన్లు చాలా వేగంగా విడుదలవడం వల్ల రక్తపోటు, హృదయ స్పందన రేటు అసాధారణంగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడూ కోపంగా ఉండే వారిలో ధమనులు గట్టిపడే అవకాశం ఉందని Columbia University Irving Medical Center పేర్కొంది. ఈ సమస్య వల్ల గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే దినచర్యలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు. కోపం వచ్చిన సందర్భంలో మనసును శాంతింపజేసేందుకు దీర్ఘ శ్వాస తీసుకుంటూ 10 అంకెలను లెక్కపెట్టాలి. లేకపోతే కాసేపు ఆరుబయట ప్రశాంతంగా నడవాలి. అంతే కాకుండా బాగా ఇష్టమైన, ప్రశాంతమైన సంగీతం వినటం వల్ల మెదడుపై ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం, యోగా లాంటివి అలవాటు చేసుకోవడం వల్ల కోపాన్ని నియంత్రికోవచ్చనని నిపుణులు అంటున్నారు.
అంత కోపమా..!
- Advertisement -
- Advertisement -