Tuesday, January 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌తో ఢీ అంటే ఢీ

ట్రంప్‌తో ఢీ అంటే ఢీ

- Advertisement -

యూఎస్‌ ఉత్పత్తులపై రూ.10 లక్షల కోట్ల టారిఫ్‌లు
యూఎస్‌కు యూరప్‌ ప్రతీకార దెబ్బ..!
ఒక్క తాటిపైకి 27 దేశాలు

న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ ఉన్మాదాన్ని ఎదుర్కోవడానికి యూరోపియన్‌ దేశాలు ముల్లును ముల్లుతోనే తీయాలనే పద్దతిని ఎంచుకున్నాయి. యూరప్‌ దేశాల (ఈయూ)పై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10 శాతం పన్ను విధిస్తానన్న డోనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికలను గనుక అమలు చేస్తే అగ్రరాజ్యంపై ప్రతీకార సుంకాలకు సిద్దం అవుతోన్నాయి. యూఎస్‌పై 93 బిలియన్‌ పౌండ్ల (108 బిలియన్‌ డాలర్లు) విలువైన అమెరికా వస్తువులపై టారిఫ్‌లు విధించేందుకు ఈయూ సంప్రదింపులు జరుపుతోంది.

ఇది భారత కరెన్సీలో రూ.10 లక్షల కోట్లకు సమానం కావడం విశేషం. ప్రధానంగా బోయింగ్‌ విమానాలు, అమెరికా తయారీ కార్లు, బోర్బన్‌ (వైన్‌) వంటి పారిశ్రామిక వస్తువులపై భారీగా సుంకాలు వేయాలని ఇయు లక్ష్యంగా చేసుకుంది.అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అమెరికాపై టారిఫ్‌లతో పాటు అదనపు ఎదురుదాడి చర్యలను కూడా ఈయూ పరిశీలిస్తోంది. అయితే ముందుగా దౌత్యపరమైన పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ట్రంప్‌ను వాణిజ్యంగా ఎదుర్కోవడానికి వీలుగా ఇయులోని 27 దేశాల ప్రతినిధులు ఆదివారం సమావేశమయ్యారు.

డెన్మార్క్‌కు మద్దతు
అమెరికాపై సాధ్యమైనంత వరకు ప్రతీకార చర్యలను తీసుకోవడానికి ఈ వారం చివరలో మరోమారు బ్రస్సెల్స్‌లో ఈయూ నేతలు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇయు కూటమిలోని దేశాలన్నీ డెన్మార్క్‌ గ్రీన్‌ల్యాండ్‌కు మద్దతుగా ఐక్యంగా ఉన్నాయని యూరోపియన్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ ఆంటోని యో కోస్టా ఆదివారం ఒక సోషల్‌ మీడియా పోస్ట్‌లో స్పష్టం చేశారు. ”ఏ రకమైన ఒత్తిడి నుంచైనా తమని తాము రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం” అని ఆంటోనియా కోస్టా పేర్కొన్నారు.

డానిష్‌ స్వయంప్రతిపత్తి భూభాగ మైన గ్రీన్‌ల్యాండ్‌లో నాటో సైనిక విన్యాసాలను ప్రారంభిస్తామని ఇయులోని ఎనిమిది దేశాలు ప్రకటించడంతో ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికాకు విక్రయించేలా ఈయూ అంగీకరించాలని లేదంటే ఫిబ్రవరి 1 నుంచి ఎనిమిది యూరోపియన్‌ దేశాల వస్తువులపై 10 శాతం టారిఫ్‌ విధిస్తానని, జూన్‌ నాటికి అది 25 శాతానికి పెరుగుతుందని ట్రంప్‌ శనివారం మరింత కవ్వింపు ప్రకటనను చేశారు. దీనిని ఇయు మరింత సవాల్‌గా తీసుకుందని తెలుస్తోంది.

బ్రిటన్‌ ప్రధాని ఫైర్‌..
ట్రంప్‌ వ్యాఖ్యలపై బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ వ్యాఖ్యలు పూర్తిగా తప్పని పేర్కొన్నారు. యూఎస్‌ సుంకాల చర్యలను ఎట్టిపరిస్థితు ల్లోనూ అనుమతించలేమని స్పష్టం చేశారు. తమ దేశం ఎవరి బ్లాకమెయిళ్లకు బయపడదని స్వీడన్‌ ప్రధాని ఉల్ఫ్‌ క్రిస్టర్సన్‌ మరింత ముందుకు వెళ్లి వ్యాఖ్యానించారు. ట్రంప్‌ బెదిరింపు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఫ్రెంచ్‌ ప్రధాని ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇయు తన అత్యంత శక్తివంతమైన వాణిజ్య ప్రతీకార సాధనం ‘యాంటీ-కోయర్షన్‌ ఇన్‌స్ట్రుమెంట్‌’ను యాక్టివేట్‌ చేయాల్సి వస్తుందన్నారు. ఇది ఇయు దేశాలను ఎవరైనా బెదిరించిన లేదా బ్లాక్‌మెయిల్‌ చేసిన వాటిని అడ్డుకోవడానికి వీలుగా రూపొందించుకున్న ఒక ప్రత్యేక చట్టం. దీనితో ఒక విధంగా అమెరికాపై ఎదురుదాడి చేయాల్సి ఉంటుందని మాక్రాన్‌ పరోక్షంగా హెచ్చరించారు.

యూఎస్‌తో ఒప్పందం నిలిపివేత
ట్రంప్‌ చర్యలకు నిరసనగా అమెరికాతో జులైలో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేయాలని ఈయూ నిర్ణయించింది. అయితే దీనికి యూరోపియన్‌ పార్లమెంట్‌ ఆమోదం అవసరం ఉంటుంది. ”దశాబ్దాల కాలపు అట్లాంటిక్‌ సంబంధాలను నాశనం చేసేలా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రేరేపించారు” అని యూరోపియన్‌ సోషలిస్టుల పార్టీ అధ్యక్షుడు స్టీఫన్‌ లోఫెన్‌ తెలిపారు. యూఎస్‌తో వాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేయడానికి ఆ పార్టీ మద్దతును ఇస్తుంది. అదే విధంగా అమెరికాపై యాంటీ కోయర్షన్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ను ఉపయోగించాలని కోరింది.

యూఎస్‌ కుతంత్రం
గతంలో ఈయూతో కుదిరిన వాణిజ్య ఒప్పందం వాషింగ్టన్‌కే ఎక్కువగా అనుకూలంగా ఉందని, ఇది చాలా కుతంత్రంతో కూడిందని యూరప్‌లో చాలామంది విమర్శించారు. ఆ ఒప్పందం ప్రకారం అమెరికా ఉత్పత్తులపై దాదాపు అన్ని టారిఫ్‌లను తొలగించడానికి ఇయు అంగీకరించింది. ప్రతిగా.. అమెరికాకు చేసే ఎగుమతులపై 15 శాతం డ్యూటీని, ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం డ్యూటీని ఇయు అంగీకరించింది. అయితే అమెరికా ఆ 50 శాతం పన్ను పరిధిలోకి వందలాది అదనపు ఉత్పత్తులను చేర్చి జాబితాను విస్తరించడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -