స్టైఫండ్ ఎగవేస్తున్న ప్రయివేటు కళాశాలలు
తమకు పట్టదంటున్న డీఎమ్‌ఈ
చేతులెత్తేసిన కాళోజీ యూనివర్సిటీ
ఇష్టారాజ్యంగా ప్రయివేటు మెడికల్ కళాశాలల దోపిడీ
విచారణ కమిటీ వేయాలి : ప్రభుత్వానికి హైదరాబాద్ సిటిజన్ ఫోరం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వారు కాబోయే డాక్టర్లు. వారు ఆ ఆస్పత్రుల్లో ఎంత మేరకైతే శిక్షణ పొందుతున్నారో దానికి రెట్టింపు స్థాయిలో సేవలందిస్తున్నారు. ఇంత చేస్తున్నా వారు స్టైఫండ్‌కు కూడా నోచుకోలేకపోతున్నారు. ఫై అధికారులకు ఫిర్యాదు చేస్తే యాజమాన్య వేధింపులతో ఎక్కడ వైద్య విద్య మధ్యలో ఆగిపోతుందో అన్న భయంతో ధైర్యం చేయట్లేదు. హైదరాబాద్ సిటిజన్ ఫోరం వాళ్లు డీఎమ్‌ఈ దృష్టికి తీసుకెళ్తే తన పరిధిలోనిది కాదని తేల్చిచెప్పారు. కాళోజి యూనివర్సిటీ దృష్టికి తీసుకెళ్లినా ఇదే తీరు. రాజకీయ అండదండలున్న ప్రయివేటు మెడికల్ కాలేజీలు తమను ఎవ్వరూ ఏమీ చేయలేరన్న ధీమాతో వైద్య విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వకుండా వారితో పనిచేయించుకుంటూ తమ ఆస్పత్రులను నడిపిస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై విచారణ చేపట్టాలని హైదరాబాద్ సిటిజన్ ఫోరం డిమాండ్ చేసింది.
రాష్ట్రంలో దాదాపు 8 వేల మంది ఎమ్‌బీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులున్నారు. అందులో 4,100 మంది ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలల్లో చదువుతున్నారు. మిగతా వారంతా ప్రయివేటు కళాశాలలకు చెందిన వారే. అదే సమయంలో మూడేండ్లకు సంబంధించి (ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్) పీజీ విద్యార్థులు మరో 9 వేల మంది వరకు ఉంటారు. వీరిలో సగానికిపైగా ప్రయివేటు విద్యవైద్య కళాశాల్లోనే విద్యనభ్యసిస్తూ ప్రాక్టీస్ చేస్తున్నారు. మెడికల్ విద్యార్థుల స్టైఫండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం 2025 జూన్‌లో గతంలో ఇస్తున్న దాని కంటే 15 శాతం పెంచింది. దీంతో హౌస్ సర్జన్స్(యూజీ)లకు రూ.29,792కు పెరిగింది. పీజీ విద్యార్థులకు మొదటి సంవత్సరం ఇచ్చే రూ.58,289 కాస్తా రూ.67,032కు చేరింది. రెండో సంవత్సరం విద్యార్థులకు 70,757, మూడో సంవత్సరం విద్యార్థులకు 64,767 ఇవ్వాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది.
అదే సమయంలో సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు మొదటి సంవత్సరం రూ.1,06,461, రెండో సంవత్సరం విద్యార్థులకు రూ.1,11,785, మూడో సంవత్సరం విద్యార్థులకు రూ. 1,17,103 ఇవ్వాల్సి ఉంది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి జాతీయ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ)కి అందిన నివేదికల ప్రకారం తెలంగాణలోని అనేక ప్రయివేటు కళాశాలలు హౌస్ సర్జన్లకు స్టైఫండ్ చెల్లించడం లేదనీ, అతి స్వల్పంగా చెల్లిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హౌస్ సర్జన్ల(యూజీ)కు నెలకు రూ.25,906 చెల్లించాలి. కానీ, చాలా ప్రయివేటు మెడికల్ కాలేజీలు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి. మరికొన్ని కళాశాలలు పూర్తిగా చెల్లించడం లేదు. కొన్ని కాలేజీలు మాత్రం లెక్కల్లో చూపడానికి విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో వేసినట్టే వేసి తిరిగి నగదు రూపంలో వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అదే విధంగా పీజీ విద్యార్థులకు నెలకు రూ.58,289 స్టైఫండ్ చెల్లించాల్సి ఉండగా సగానికిపైగా ప్రయివేటు మెడికల్ కళాశాలలు చెల్లించడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
స్టైఫండ్ చెల్లించని కళాశాలలపై విచారణ జరిపించాలి : హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం
వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు స్టైఫండ్ ఎగవేస్తున్న కళాశాలలపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం (హెచ్‌సీఎఫ్) కన్వీనర్ ఎం.శ్రీనివాస్, అధ్యక్షులు ఎం.శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య, ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. స్టైఫండ్ చెల్లింపులపై పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఎవరిదనే విషయంపై స్పష్టత లేకపోవడం దుర్మార్గమన్నారు.
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు తమది బాధ్యత కాదంటూ చేతులు దులుపుకోవడం సరిగాదని తెలిపారు. ఉన్నతాధికారులు తమ బాధ్యతలను మరిచి.. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోండి..ప్రయివేటు కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను నిలదీయండి అంటూ ఉచిత సలహాలు ఇవ్వడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇటీవల ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో ఫీజుల అక్రమ వసూళ్లపై విచారణ కోసం వేసిన కమిటీతోనే స్టైఫండ్ చెల్లించని కళాశాలలపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.




