Tuesday, January 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనాగోబాకు మహా జలాభిషేకం

నాగోబాకు మహా జలాభిషేకం

- Advertisement -

– మట్టి కుండల్లోనే మహాప్రసాదం
నవతెలంగాణ- ఇంద్రవెల్లి

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన ఆలయం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా జాతర ప్రారంభమైంది. ఆదివాసీ తెగకు చెందిన మెస్రం వంశీయుల ఆరాధ్యదైవం.. అమావాస్య రోజు అర్ధరాత్రి మహా జలాభిషేకంతో జాతర ప్రారంభమైంది. నాగోబాకు మహాజలాభిశేకంతో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. వారి ఆచార సంప్రదాయ వాయిద్యాలైన కాలికోమ్‌, తుడుమ్‌, సన్నాయిలను వాయిస్తూ.. కాగడాలను వెలిగిస్తూ.. ఆలయంలోకి ప్రవేశించారు. నాగోబాకు మహాపూజ హారతినిచ్చారు. ఖటోడ (హన్మంతు), కోసేరావ్‌తోపాటు మెస్రం వంశీయులు ఈ పూజను నిర్వహించారు. పూజ అనంతరం నాగోబాను దర్శించుకున్నారు. పూజ రోజున మెస్రం వంశీయులు కఠిన ఉపవాస దీక్ష చేపట్టారు. రాత్రి సుమారు మూడు గంటలకు మెస్రం కోడళ్లను నాగోబా సన్నిధిలో భేటింగ్‌ నిర్వహించారు. నాగోబా జాతరకు కలెక్టర్‌ రాజర్షిషా, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ యువరాజ్‌ మర్మాట్‌, ఉట్నూర్‌ ఏఎస్పీ కాజల్‌సింగ్‌, ఆదిలాబాద్‌ ఏఎస్పీ మౌనిక, ఎంపీ గోడం నగేష్‌, ఖానాపూర్‌, బోథ్‌ ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్‌, అనిల్‌ జాదవ్‌, ఆలయ కమిటీ చైర్మెన్‌ మెస్రం ఆనంద్‌రావ్‌, పీఠాధిపతి వెంకట్‌రావ్‌, సర్పంచ్‌ మెస్రం తుకారాం హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు వారి ఆచార సంప్రదాయ ప్రకారం తెల్లటి తల పాగాను ధరింపజేశారు.

కొత్త కుండల్లో ప్రసాదం
గోవాడ్‌లో బస చేసిన మెస్రం ఆడపడుచులు సోమవారం కొత్త కుండల్లో జొన్న గటకతో ప్రసాదాన్ని చేశారు. వంటకాలకు ముందు కొత్త కుండల వద్ద నవధాన్యాలను సమర్పించారు. జొన్న గటకతో వండిన లడ్డూల రూపంలో తయారు చేసి 22 కీతాల వారీగా పంచుకున్నారు. ఈ వంటకంతోనే పవిత్ర ఉపవాస దీక్షను విరమించారు. నాగోబా జాతరకు వచ్చిన సందర్శకులకు ఎలాంటి అసౌకర్యమూ కలుగకుండా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ జాతరకు రాష్ట్ర ప్రజలేగాక మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -