Tuesday, January 20, 2026
E-PAPER
Homeజాతీయంఫిరాయింపుల కేసులో స్పీకర్‌కు సుప్రీం నోటీసులు

ఫిరాయింపుల కేసులో స్పీకర్‌కు సుప్రీం నోటీసులు

- Advertisement -

బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్లతో బీజేపీ పిటిషన్‌ జత
మార్చి 9న విచారణ

న్యూఢిల్లీ : పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ పై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, పాడి కౌశిక్‌ రెడ్డితో సహా పలువురు గతేడాది
జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తరువాత వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(సివిల్‌) దాఖలు చేశారు. ఇందులో దానం నాగేందర్‌ ని ప్రతివాదిగా చేర్చారు. ఈ అన్నీ పిటిషన్లపై గతంలో సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి గత జులై 31 వరకు ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ కార్యాలయాన్ని ఆదేశించారు. అయితే… స్పీకర్‌ కార్యాలయం ఈ మూడు నెలల కాలం ముగించే సమయానికి మరింత సమయం కావాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

మరోవైపు బీఆర్‌ఎస్‌ నేతలు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్‌ సుప్రీం ధర్మాసనం విచారణ జరిపి నాలుగు వారాల సమయం ఇస్తూ, రెండు వారాల్లో ఫిరాయింపులపై పురోగతిపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇదిలా ఉండగా… గత సీజేఐ బెంచ్‌ ఆదేశాలను పాటించని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని ఆలేటి ఈనెల 11న సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వివరాలను పొందుపరిచారు. తాజాగా దానం నాగేందర్‌ మీడియాలో చేసిన వ్యాఖ్యలను ఈ పిటిషన్‌లో ప్రస్తావించారు.

తాను ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నానని దానం నాగేందర్‌ చేసిన వ్యాఖ్యలను ఇందులో జోడించారు. ఈ పిటిషన్‌ను సోమవారం జస్టిస్‌ సంజయ్ కరోల్‌, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మసీహ్‌ ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఆలేటి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సుప్రీం ఆదేశాలు పాటించని స్పీకర్‌ పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై జస్టిస్‌ ఏజీ మసీహ్‌ స్పందిస్తూ ఇతరులు (బీఆర్‌ఎస్‌) దాఖలు చేసిన పిటిషన్లతో ఈ ధిక్కరణ పిటిషన్‌ ను ట్యాగ్‌(జత) చేస్తున్నట్లు తెలిపారు. అలాగే స్పీకర్‌ కు నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ పిటిషన్‌ పై మరోసారి మార్చి 9న విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కేసుల జాబితాలో చేర్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -