ఫిబ్రవరి 12న జాతీయ సమ్మె : సీఐటీయూ జాతీయ అధ్యక్షులు సుదీప్ దత్త
కార్మిక, కర్షక హక్కులు హరిస్తూ.. కార్పొరేట్ల సేవలో తరిస్తున్న మోడీ
దేశానికి ప్రత్యామ్నాయం ఎర్రజెండానే
కార్మికుల ఏకైక ఆయుధం సమ్మె
సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక, కర్షక ఐక్యతాదినోత్సవం
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కన్నెర్ర
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సోమవారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యు పిలుపుతో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో కార్మికులు, రైతులు, గ్రామీణ కూలీలు, మహిళలు, యువత భారీసంఖ్యలో పాల్గొన్నారు. పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలు ప్రజాగ్రహాన్ని ప్రతిబింబించాయి. నిర్మాణ స్థలాలు, వ్యవసాయ క్షేత్రాలు, పారిశ్రామిక ప్రాంతాల నుంచి ప్రజలు రహదారులపైకి తరలివచ్చారు. చేతుల్లో ప్లకార్డులు, జెండాలు, గొంతుల్లో నినాదాలతో ర్యాలీలు సాగాయి. బస్టాండ్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు, చౌరస్తాలు నిరసన కేంద్రాలుగా మారాయి.
నవతెలంగాణ- మెదక్ ప్రాంతీయ ప్రతినిధి/విలేకరులు
కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు దేశ వ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని సీఐటీయూ జాతీయ అధ్యక్షులు సుదీప్ దత్త స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ.. కార్పొరేట్ల సేవలో తరిస్తున్నారని, వారి లాభాల కోసం కార్మికులు, రైతులు వ్యవసాయ కార్మికుల హక్కులపై దాడి చేస్తున్నారని విమర్శించారు. మోడీ కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చాయని, ఈ సమ్మెను కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక కర్షక ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ, ఏఐకేఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లు, వీబీ జీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు 2025ను, నూతన విత్తన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సంగారెడ్డిలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పీఎస్‌ఆర్ గార్డెన్‌లో జరిగిన సభలో సుదీప్ దత్త మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను తొలగించి లేబర్‌కోడ్స్‌ను తీసుకువచ్చా రని, దాంతో కార్మికులకు కనీస హక్కులు లేకుం డా చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఒక కంపెనీలో 100 మంది కార్మికులు ఉంటే వారికి లేబర్ చట్టాలు వర్తించేవని, కనీస వేతనాలు అందించడంతో పాటు సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేసే హక్కు ఉండేదని తెలిపారు. కొత్త లేబర్ కోడ్స్‌తో కంపెనీలో 500 మంది వర్కర్లు ఉంటేనే సేఫ్టీ ఆఫీసర్ ఉండాలని చట్టంలో మార్పు చేశారని, దాంతో తక్కువ కార్మికులు ఉన్న పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే యాజమాన్యం బాధ్యత నుంచి తప్పించుకునే వెసులుబాటును కేంద్రం కల్పించిందని తెలిపారు.
కార్మిక వ్యతిరేక విధానాలను వీడాలి : బి. వెంకట్
అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ కూలీల నోట్లో మట్టి కొట్టేందుకు వీబీజీ రామ్‌జీ పేరుతో కొత్త చట్టాన్ని తెచ్చిందని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నల్లాల బావి సెంటర్ నుంచి కొత్త బస్టాండ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. 200 రోజుల పని దినాలు కల్పించాలని రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుంటే.. కొత్త చట్టంలో 125 రోజుల పని నోటిఫైడ్ ఏరియాలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొందని తెలిపారు.
స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో ప్రతిఘటించండి : ఎం. సాయిబాబు
వరంగల్ జిల్లా కేంద్రంలోని పోచమ్మ మైదాన్‌లో నిర్వహించిన వరంగల్, హనుమకొండ జిల్లాల బహిరంగసభలో సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం సాయిబాబా మాట్లాడారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో మోడీ విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ మోడీ ప్రభుత్వం అధికారాలన్నీ తన గుప్పిట్లో పెట్టుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
ప్రజావ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలి : ఎస్.వీరయ్య
కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, వీబీజీరామ్‌జీ, విద్యుత్తు సవరణ, విత్తన బిల్లులను వెంటనే విరమించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు. భువనగిరిలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద జరిగిన బహిరంగ సభలో వీరయ్య ప్రసంగించారు. బీజేపీ ప్రభుత్వం దేశ కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను నేడు రద్దు చేసి, 8గంటల పనివిధానాన్ని 12 గంటలకు పెంచుతూ కార్పొరేట్‌లకు ఉపయోగపడే లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మికుల శ్రమతో కార్పొరేట్లకు కోట్ల రూపాయలు : జి.నాగయ్య
కార్మికుల శ్రమతో కార్పొరేట్లకు కోట్లు సంపాదించి పెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగయ్య విమర్శించారు. సోమవారం మహబూబాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కులపై దాడి : పోతినేని సుదర్శన్
ప్రధాని నరేంద్ర మోడీ కార్పొరేట్ల సేవలో తరిస్తున్నారని, వారి లాభాల కోసం కార్మికులు, రైతులు వ్యవసాయ కార్మికుల హక్కులపై దాడి చేస్తున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు విమర్శించారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లు, వీబీ జీ రామ్‌జీ చట్టం, విద్యుత్ సవరణ బిల్లు 2025ను, నూతన విత్తన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రికొత్తగూడెం కేంద్రంలో కార్మిక, కర్షక ర్యాలీ అనంతరం జరిగిన సభలో పోతినేని ప్రసంగించారు. రాష్ట్రాల హక్కులపై దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరల చట్టం కోసం దేశవ్యాప్తంగా రైతులు పోరాటం చేస్తుంటే.. నూతన విత్తన చట్టాన్ని తీసుకొచ్చి విత్తనాల ఉత్పత్తిని, ధరల నియంత్రణ నిర్ణయాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పుతోందని విమర్శించారు.
బిల్లులను రద్దు చేయకపోతే మహా ఉద్యమం : ఆర్.వెంకట్రాములు
లేబర్ కోడ్‌లు, విద్యుత్తు చట్ట సవరణ, జాతీయ విత్తన సవరణ బిల్లులను రద్దు చేయకపోతే మహా ఉద్యమం చేపడతామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు హెచ్చరించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో భారీ నిరసన చేపట్టారు. అదే విధంగా వనపర్తి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, కడ్తాల్‌లో, ఆదిలాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జోగులాంబ గద్వాల, నిర్మల్ తదితర జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు.
దేశం అంటే అదానీ, అంబానీ అనుకుంటున్న మోడీ..
దేశం అంటే అదానీ, అంబానీ, ఇంకా కొంతమంది కార్పొరేట్లే అని ప్రధాని మోడీ అనుకుంటున్నారని, కానీ దేశం అంటే కార్మికులు, రైతులు, రైతు కూలీలు, శ్రామిక మహిళ, ఇతర సామాన్య ప్రజానీకమంతా అనే విషయాన్ని మర్చిపోయారని సుదీప్ దత్త ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలకు జీవనోపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి 100 రోజుల పని విధానానికి ఎసరు తెచ్చారన్నారు. 125 రోజుల పని కల్పిస్తామంటూ అందులో 60 రోజులు వ్యవసాయ పనులు జరిగే సమయంలో పని నిలిపివేస్తే కేవలం 65 రోజులు మాత్రమే పని దక్కుతుందన్నారు.
దీని వల్ల ఉపాధి కూలీలకు పని లేకుండా చేయడంతో పాటు పూర్తిగా చట్టాన్ని రద్దు చేసేందుకు వీబీజీ రామ్ జీ చట్టాన్ని తీసుకు వచ్చారని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించకుండా కార్పొరేట్ కంపెనీల వద్ద విత్తనాలు కొనుగోలు చేసేలా విత్తన చట్టాన్ని తీసుకువచ్చారని, రైతులకు వ్యవసాయానికి అందిస్తున్న విద్యుత్‌ను ఎత్తివేసేందుకు, ఇండ్లలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి విద్యుత్ బిల్లులు వసూలు చేసేందుకు విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు. దేశ అభివృద్ధికి, సమాజ మార్పు కోసం కృషి చేసేది ఎర్రజెండా మాత్రమేనని తెలిపారు. చట్టాలు రద్దయ్యే వరకూ పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
కార్మిక-కర్షక మైత్రికే కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టే శక్తి : పాలడుగు భాస్కర్, టి. సాగర్
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టగల శక్తి కార్మిక-కర్షక మైత్రికే ఉందని సీఐటీయూ, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాలడుగు భాస్కర్, టి.సాగర్ అన్నారు. సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో అశోక్‌నగర్ చౌరస్తా నుంచి ఇందిరాపార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చేందుకే వీబీ జీ రామ్‌జీ చట్టాన్ని తీసుకొచ్చారని అన్నారు. అలాగే గాంధీ పేరును తొలగించడం దేశ స్వాతంత్య్ర పోరాటానికి అవమానకరమని తెలిపారు. విత్తన సవరణ చట్టం పేరుతో రైతుల కష్టాన్ని కార్పొరేట్, విదేశీ కంపెనీలకు దోచిపెట్టేందుకు కేంద్రం యత్నిస్తోందని విమర్శించారు. పంట నష్టం జరిగితే ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకోవడం ఈ చట్టం ఉద్దేశమన్నారు.
చట్టాల రద్దుకు ఐక్యతా పోరాటాలు నిర్వహించాలి : చుక్క రాములు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల రద్దుకు ఐక్యతా పోరాటాలు నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోరు యాత్రల ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. లేబర్‌కోడ్‌లతో కార్మికులు ఉద్యోగ భద్రత కోల్పోతారని, బోనస్ చట్టం వర్తించదని అన్నారు.
కార్మిక, కర్షక, ప్రజాహక్కుల కోసం ఉద్యమిద్దాం : జూలకంటి
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను.. కార్మికులు, కర్షకులు, ప్రజలు ప్రతిఘటనతో తిప్పికొట్టాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయం నుంచి గడియారం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతూ.. దేశ ఉత్పత్తిలో ప్రధాన భాగస్వామ్య రంగాలైన కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కులపై బీజేపీ ప్రభుత్వం తీవ్ర దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.



