సుల్తాన్పూర్ : తనపై నమోదైన పరువు నష్టం కేసుకు సంబంధించి సుల్తాన్‌పూర్‌లోని ఎంపి, ఎమ్మెల్యేల కోర్టులో సోమవారం జరిగిన విచారణకు కాంగ్రెస్ నాయకులు రాహుల్‌గాంధీ గైర్హాజరయ్యారు. దీంతో కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 20కు కోర్టు వాయిదా వేసింది. రారు బరేలీ ఎంపి కూడా అయిన రాహుల్‌గాంధీ కోర్టు ముందు తన వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉంది. అయితే రాహుల్‌గాంధీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కేరళలో ఉన్నందున సోమవారం విచారణకు హాజరుకాలేకపోయారని ఆయన తరపు న్యాయవాది కాశీ ప్రసాద్ శుక్లా కోర్టుకు విన్నవించారు. ఈ విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న జడ్జి శుభం వర్మ రాహుల్‌గాంధీకి స్వయంగా హాజరుకావడానికి చివరి అవకాశాన్ని కల్పించారని, తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి నిర్ణయించారని కాశీ ప్రసాద్ తెలిపారు. సుల్తాన్పూర్ జిల్లాలోని హనుమాన్‌గంజ్ నివాసి అయిన బిజెపి కార్యకర్త విజరు మిశ్రా ఈ పరువు నష్టం కేసు దాఖలు చేశారు.



