24 వరకు అక్కడే..ఆ తర్వాత అమెరికాకు-ఫిబ్రవరి 2న తిరిగి హైదరాబాద్‌కు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం దావోస్‌కు బయల్దేరి వెళ్లారు. ఆదివారం మేడారం పర్యటనలో పాల్గొన్న సీఎం.. సోమవారం ఉదయమే హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. అనంతరం నేరుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దావోస్‌కు బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు జయేశ్ రంజన్, సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పలువురు అధికారులతో కూడిన బృందం ఈ పర్యటనకు వెళ్లింది. సోమవారం నుంచి ఈనెల 23 వరకు డబ్ల్యూఈఎఫ్ సదస్సు కొనసాగనుంది. ఈనెల 24న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి అమెరికాకు బయల్దేరి వెళ్లనున్నారు. ఈనెల 31 వరకు యూఎస్‌లో ఆయన పర్యటిస్తారు. ఫిబ్రవరి రెండున సీఎం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. కాగా డబ్ల్యూఈఎఫ్ సదస్సులో తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047 గురించి సీఎం ప్రత్యేక ప్రస్తావించనున్నారు.
తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందనే విషయాన్ని ఆయన ఆ సందర్భంగా మరోసారి గుర్తు చేయనున్నారు. గ్లోబల్ ఫార్మాసిటీగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న విషయాన్ని, దాంతోపాటు నగరంలోని మౌలిక వసతుల గురించి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు ఆయన వివరించనున్నారు. పరిశ్రమలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక విధానాలను ఆయన ఏకరువు పెట్టనున్నారు. దావోస్ గత పర్యటనలో కేవలం ఒప్పందాలకే పరిమితమైన ప్రభుత్వం, ఈసారి వాటికి సంబంధించిన కార్యాచరణపై ప్రత్యేక దృష్టి సారించనుంది. దావోస్ పర్యటన తర్వాత ఎమ్‌ఓయూల పురోగతిపై టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. తెలంగాణను శరవేగంగా అభివృద్ధి చెందించేందుకు వీలుగా రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు భాగాలుగా విభజించిన వైనాన్ని కూడా దావోస్ సదస్సులో సీఎం విశదీకరించనున్నారు. తద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తామని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. మరోవైపు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి వరస భేటీలు నిర్వహించనున్నారని ఆయా వర్గాలు పేర్కొన్నాయి.
మంత్రులతో కలిసి దావోస్‌కు సీఎం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



