తులం రూ.3,000 పైనే
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3.18 లక్షలు
న్యూఢిల్లీ: వెండి ధరలు రాకెట్‌కంటే వేగంగా దూసుకుపోతున్నాయి. సామాన్యులు కూడా కొనలేని స్థాయికి ఎగిశాయి. 10 గ్రాముల ధర తొలిసారి రూ.3,000 పైగా పలకడంతో పేదలకు వెండి కొనుగోలు బంగారమయిపోయింది. సోమవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండిపై రూ.10,000 పెరిగి రూ.3 లక్షల మార్క్‌ను దాటింది. అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లలో అధిక డిమాండ్ నెలకొనడమే ఇందుకు ప్రధాన కారణమని బులియన్ వర్తకులు పేర్కొంటున్నారు. ఈ తెల్ల లోహం కిలో ధర రూ.3,02,600కు చేరింది. ఇంతక్రితం సెషన్లో రూ.2,92,600గా పలికింది. ఈ ఒక్క జనవరిలోనే రూ.60వేలు పైగా పెరగడం గమనార్హం. అదే విధంగా 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.1,900 పెరిగి పన్నులతో కలుపుకుని రూ.1,48,100కు చేరింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ.2,460 ఎగిసి రూ.1,46,240గా పలికింది. 22 క్యారెట్లపై రూ.2,250 పెరిగి రూ.1,34,050గా నమోదయ్యింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3.18 లక్షలుగా పలికింది.



