మొన్న 30 ఏప్రిల్ నాడు వియత్నాం జాతి దక్షిణ వియత్నాం విముక్తి దినోత్సవం మరియు జాతీయ పునరేకికరణ జరిగి 50 సంవత్సరాలైన సందర్భంగా ఉత్సవాలను జరుపుకుంది. అమెరికా సామ్రాజ్యవాదం ఓటమి వల్ల వారి సైన్యం తోక ముడిచి అధికారం అప్పగించి తిరిగి వెళ్ళిపోయిన రోజే 30 ఏప్రిల్ 1975. అది 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితం. నిరంతర నిర్విరామ పునరుత్తేజిత శక్తుల స్వేచ్ఛ స్వాతంత్య్రం ఇంకా వియత్నాం పునరేకీకరణ కోసం జరిపిన పోరాటానికి ఒక చెరగని గుర్తు. అది ఒక శతాబ్దానికి పైగా ఉన్న వలసవాదానికి ముగింపు పలికి దేశాన్ని ఒక నూతన యుగం జాతీయ స్వాతంత్రం మరియు సామ్యవాదం దిశగా ఉరకలెత్తించింది.
సైగాన్ యొక్క పతనం కేవలం అమెరికా దేశపు సైనిక ఓటమే కాదు, వారి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిపిన జాతీయ విముక్తి పోరాటపు చారిత్రాత్మక విజయంగా అభివర్ణించాలి. ఈ పోరాటం అమెరికా మద్దతుతో ఉన్న కీలుబొమ్మ ప్రభుత్వ పాలనను పాలనకు చరమగీతం పాడింది. దీన్ని ఒక విప్లవాత్మకమైన యుద్ధంగా చెప్పుకోవాలి. ఇది వియత్నాం కార్మిక కర్షక లోకం భూస్వామ్య పెట్టుబడిదారీ దోపిడీకి విదేశీ శక్తుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిపిన యుద్ధం. ఇక్కడే అమెరికా సామ్రాజ్యవాదానికి కోలుకోలేని దెబ్బతీసి సామ్యవాద పాలన కింద వియత్నాం పునరేకీకరణకు దారితీసింది.
చారిత్రక నేపథ్యం
1887-1954 మధ్యన ఫ్రెంచ్ వలసవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా వియత్నాం పోరాటం ప్రారంభమైంది. స్థానిక భూస్వాముల మద్దతు సహాయంతో ఫ్రెంచ్ వలసవాదులు వియత్నాం పంటలైన రబ్బర్, బియ్యం, ఖనిజాలు రైతుల నుండి లాక్కొని ఎగుమతి చేయసాగారు. వీరి దోపిడీకి వ్యతిరేకంగా హోచిమిన్ నాయకత్వంలో వియత్ మిన్ (వియత్నాం స్వాతంత్రం కొరకు కూటమిగా) ఏర్పడి కర్షక లోకం ౖ పోరాడింది. ఈ వియత్ మిన్ శక్తులు డైన్‌బీన ఫూ వద్ద లెజెండరీ జనరల్ వోగియన్ గ్యాప్ నేతృత్వంలో సాధించిన నిర్ణయాత్మక విజయంతో ఫ్రెంచ్ ఓటమి ఇంకా వారు వియత్నాం నుండి పారిపోవాల్సిన పరిస్థి తులకు దారితీసాయి.వియత్ మిన్ విజయం పరిణామానంతరం కమ్యూనిస్టు శక్తుల ప్రాబల్యం ప్రజల్లో పెరగడం చూసిన అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తన నిజస్వరూపాన్ని బయటపెట్టి వద్ద కుతంత్రానికి తెరలేపింది. ఈ కుటీల ప్రయత్నం పర్యవసానంగా కమ్యూనిస్టుల పరిపాలనలో ఉత్తర వియత్నాం- అమెరికా ఆధిపత్యం కింద దక్షిణ వియత్నాం – (రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం) అనే రెండు దేశాలుగా విడిపోవడం జరిగింది. 1956లో రెండు దేశాలను తిరిగి ఏకీకృతం చేస్తానన్న వాగ్దానాన్ని భంగపరచిన అమెరికా తన కీలుబొమ్మ గో డిన్ డైమ్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని నడుపుతూ వచ్చింది. ఈ ప్రభుత్వం రైతులను అణగదొక్కుతూ భూస్వామ్య శక్తులకు మద్దతుగా నిలిచింది. శ్రామికవర్గంపై నిర్బంధంతో పాశవికంగా ప్రవర్తించసాగింది.
మరోపక్క హోచిమిన్ నేతృత్వంలో వియత్ మిన్ జాతి పునరేకీకరణ కోసం కృషి చేస్తూ అమెరికా కనీసం సామ్రాజ్యవాద కనుసన్నల్లో కొనసాగుతున్న భూస్వామ్య పెట్టుబడిదారీ నిర్బంధానికి చరమగీతం పాడే ప్రయత్నం జరిగింది. హోచిమిన్ నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ రెండు రకాల వ్యూహాలతో తన పథకాన్ని రచించింది – ఉత్తర వియత్నాంలో సామ్యవాద విప్లవం, దక్షిణ వియత్నాంలో విదేశీ శక్తులను తరిమికొడుతూ జాతీయ ప్రజావిప్లవాన్ని సాధించడం. ఈ రెండు ఉన్నతమైన లక్ష్యాలతో పార్టీ ముందుకు నడిచింది. ఆ నేపథ్యంలోనే మరొక వ్యూహానికి తెరలేపింది. రెండు శాతం భూస్వాముల చేతిలో యాభై శాతం భూముంది. వీరు రైతాంగాన్ని పీల్చి పిప్పిచేసేవారు. వారికి వ్యతిరేకంగా ఉ్యమించింది తదనుగుణంగా జాతీయ విముక్తి సంఘటన (నేషనల్ లిబరేషన్ ఫ్రంట్) ను కమ్యూనిస్టు పార్టీ ఏర్పరచుకుని దక్షిణ వియత్నాంలో పాలకవర్గాల అరాచకానికి సామ్రాజ్యవాద శక్తులు దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించడం ప్రారంభించింది. భూస్వామ్య శక్తుల అంతం, దున్నేవాడికి భూమి, సామ్రాజ్యవాద శక్తుల తరిమివేత నినాదాలుగా రైతులను ఉద్యమం వైపు నడిపించింది.
గ్రామీణ ప్రాంతాల్లో కర్షకవర్గంతో ఉద్యమాలు నడుపుతూనే కమ్యూనిస్టు పార్టీ అప్పుడే ఆవిర్భవిస్తున్న, అభివృద్ధి చెందుతున్న శ్రామిక తరగతిని కూడా ఉద్యమాలలోకి నడిపిం చింది. సైగాన్‌తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న కార్మికులను మధ్యతరగతి వర్గాన్ని ఉద్యమ భాగస్వా ములను చేయడంతో పట్టణ ప్రాంతాల్లోనూ కమ్యూ నిస్టు పార్టీ తన ప్రాబల్యాన్ని విస్తరించి కట్టుదిట్టం చేసుకుంది. వారు అనేక నిరసనల్లో ఉద్య మాల్లో చురుగ్గా పాల్గొనేవారు.1968లో జరిగిన టెట్ మిలటరీ దాడి గ్రామీణ సైగాన్‌లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కు చి టన్నెల్స్ కేంద్రంగా జరిపిన గెరిల్లా దాడులతో సామ్రాజ్యవాద, భూస్వామ్య శక్తులను తీవ్రమైన కోలుకోలేని దెబ్బతీశాయి.
అమెరికన్ సామ్రాజ్యవాదం ఓటమిలో వియత్నాం పోరాటానికి అంతర్జాతీయ మద్దతు మరియు సంఘీభావం కూడా ప్రముఖ పాత్ర వహిం చాయి. అమెరికాలోని ప్రగతిశీలవాదులు సైతం వియత్నాం విజ యాన్ని కాంక్షిస్తూ దాని పోరాటానికి సంఘీభావం తెలపటమే కాక తమ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు. ప్రపంచంలోని అనేక దేశాలతో పాటుగా మన దేశంలో కూడా తెలిపిన సంఘీభావం వియత్నాం ప్రజల వీరోచిత పోరాటాలను మరింత బలపరిచి తీవ్రతరం చేయడంలో సహకరించాయి.ఇదే సమయంలో సోషలిస్టు దేశాలైన రష్యా, చైనాలు వియత్నాం పోరాటానికి అందించిన సహాయ సహకారాలు కూడా గుర్తుచేసుకోవాలి. ఇవన్నీ అంశాలు కలిసి అమెరికన్ సామ్రాజ్యవాదం ఓటమికి తమ వంతు పాత్ర పోషించడంతో దాని కీలుబొమ్మ ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో కుప్పకూలింది. అమెరికన్ రాయబార కార్యాలయం పై హెలికాప్టర్ల దాడితో సైగాన్ పతనం జరిగింది. పర్యవసానంగా చివరగా ఉన్న దళాలు సైతం ఖాళీ చేయక తప్పలేదు.
సోషలిస్టు వియత్నాం
కమ్యూనిస్టు ప్రభుత్వ సారథ్యంలో వియత్నాం తిరిగి ఏకమైంది. దురదృష్టవశాత్తు అంత గొప్ప సంఘటనను చూసే అవకాశం హోచిమిన్‌కు దక్కలేదు. ఆయన ప్రజల్లో ఎంతో విశ్వాసం ఉన్న గొప్ప నాయకుడు. ”ఎంత కష్టమైన పనైనా మన ప్రజలు గెలుస్తారు. చీలిపోయిన మన రెండు దేశాలు ఏకమవుతాయి. ఉత్తర దక్షిణ వియత్నాం దేశభక్తులంతా చివరకు ఒకే గొడుగు కింద ఏకమవుతారని నడుస్తారనే”ది నిజమైంది.దేశీయ పునరేకీరణతో సోషలిస్ట్ గణతంత్ర వియత్నాం ఏర్పడింది. శతాబ్దాల వలసవాద నిర్బంధం, దోపిడీ,ఇంకా ఆర్థిక వెనుకబాటుతనం ఈ సమస్యలు అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వం ఎదుర్కోవలసి వచ్చింది. వాటిని పరిష్కరించడం దాని ప్రథమ కర్తవ్యం. అమెరికా దేశం వియత్నాంపై ఆర్థిక నిషేధం విధించింది. వెనుకబాటుతనాన్ని అధికమించడానికి ఆ దేశం పొందే అంతర్జాతీయ సహాయాన్ని అన్ని రకాల సహకారాన్ని అడ్డుకుంది. ఇలాంటి క్లిష్ట సమయంలో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, సోషలిస్ట్ క్యాంపుతో వియత్నాంను ఆదుకుంది.వియత్నాం ఐక్యంగా ఉండడం, అది ఒక ధనవంతమైన దేశంగా పరిఢవిల్లడమే హోచిమిన్ చివరి కోరిక.
50 ఏళ్ల పునరేకీకరణ తరువాత వియత్నాం ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైంది.నిరుపేద వెనుకబడిన దేశం యుద్ధంతో వినాశనానికి గురై, ఆర్థిక నిర్భంధాలను అధిగ మించి గణనీయమైన ప్రగతిని సాధించింది. వియత్నాం కమ్యూ నిస్టు పార్టీ పాలనలో ఆ దేశం ఏ రకంగా త్వరితగతిన అభివృద్ధి చెందిందో కొన్ని గణాంకాలు తెలుపుతాయి. 1993లో యాభై ఎని మిది శాతం ప్రజలు పేదరికంలో మగ్గుతుండగా 2024 నాటికి అది 1.93 శాతానికి పడిపోయింది. నేడు అభివృద్ధి చెందు తున్న మొదటి 15దేశాల్లో వియత్నాం ఒకటిగా నిలుస్తున్నది. ఎక్కువ మంది ఎగువ మధ్యతరగతి వారి ఆదాయంతో వియత్నాం నేడు ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా రూపాంతరం చెందడం విశేషం.
వియత్నాంను నిరంతరం అభివృద్ధి పధాన నడిపించిన ఘనత ఆ దేశ కమ్యూనిస్టు పార్టీదే. దేశాభివృద్ధికి దేశ సంపదకు బాటలు వేసింది ఆ పార్టీయే. జనరల్ సెక్రెటరీ టో లామ్ చెప్పినట్లుగా నేటి వియత్నాం కన్నా పది రెట్లు అభివృద్ధి చెందిన వియత్నాం నిర్మా ణానికి ఆ కలల సాకారానికి అందరూ ఉత్పాదక శక్తులను విముక్తి చేయాలి, అన్ని వనరులను వెతికి సద్వినియోగం చేసుకోవాలి, అన్ని రకాల బలాలను సామర్థ్యాలను వినియోగించి సామాజిక ఆర్థిక ప్రగతికి కంకణం కట్టుకోవాలి. 2025లో ఆ దేశం ఎనిమిది శాతం ఆర్థిక ప్రగతి సాధిస్తామని విశ్వసిస్తూ 2026-30 మధ్యన రెండంకెల ప్రగతి సాధించుతామని నమ్మకంతో ఉన్నారు. 2030 నాటికి అన్ని వ్యూహాలను పథకాలను రచించి ఎగువ మధ్య ఆదాయం ఇంకా ఆధునిక పరిశ్రమల ద్వారా తమ లక్ష్యాన్ని సాధి స్తామని కృత నిశ్చయంతో ఉన్నారు. అదేవిధంగా 2004 నాటికి ఒక అభివృద్ధి చెందిన ఎక్కువ ఆదాయం గల సామ్యవాద దేశంగా అవతరిస్తామని చెప్పడం వారి ఆత్మ విశ్వాసాన్ని ప్రస్ఫుటం చేస్తుంది.
ఈ లక్ష్య సాధనలో హోచిమిన్ వేసిన మార్గాన్ని అనుసరించ డానికి వియత్నం పార్టీ ప్రజలు సిద్ధపడుతున్నారు. అవినీతి నిర్మూలన, వివక్షలు విభేదాలు లేకుండా చూడడం, అసమానతలు లేని వృద్ధి వంటి వాటిని తమ ప్రాధాన్యతలుగా చేసుకున్నారు. ఈ మధ్యనే పార్టీ అధికారుల అలసత్వాన్ని తగ్గించి సమర్థతకు తగిన స్థానం కల్పించాలని నిర్ణయించింది. రాష్ట్రాల సంఖ్యను కూడా 63 నుండి 34కు కుదిం చింది. పథకాల అమలులో ఆటంకంగా ఉన్న జిల్లా స్థాయి ప్రభుత్వాలను రద్దు చేశారు. చిన్న స్థాయి తక్కువ స్థాయి అధికారులను ప్రజలకు చేరువలో ఉంచారు. ప్రభుత్వంలోని చివరి స్థాయి యూనిట్లు గ్రూపులను సంస్కరించి అవి మరింతగా ప్రజలకు సేవలు అందించే విధంగా తీర్చిదిద్దారు.
ఇవన్నీ చర్యల లక్ష్యం ఏమంటే ప్రజలకు ఉపయోగపడటానికి డబ్బు మరింత అందుబాటులో ఉంచడమే! తద్వారా పన్నెండో తరగతి వరకు ఉచిత విద్య, పౌరులందరికీ ఉచిత ఆరోగ్య రక్షణ కలిగించడమే. హోచిమిన్ ప్రవచించినట్లుగా పార్టీ ఎప్పుడూ ఒక నిర్దిష్ట పథకంతో ఆర్థిక స్థితిని సంస్కృతిని మెరుగుపరుచుకుని ప్రజల జీవితాలను నిరంతరం మరింత మెరుగ్గా తీర్చిదిద్దే దిశగా సాగాలి. వియత్నాం కమ్యూనిస్టు పార్టీ కూడా ప్రజల ఆశయాలను సాధించే దిశగా, మారుతున్న కాలాలకు అనుగుణంగా విధానాలను ఎప్పటికప్పుడు తయారు చేస్తున్నది. ‘ప్రజలే మాకు మూలం’అనే సూత్రం ఆధారంగా వియత్నాం కమ్యూనిస్టు పార్టీ అందరికీ లబ్ధి చేకూరే విధంగా సృజనాత్మకమైన నిర్మాణాత్మకమైన ఆధునికమైన అభివృద్ధి ధ్యేయంగా బాటలు వేస్తున్నది. వారు 2021-25 కాలానికి ఐదేళ్ల సామాజిక ఆర్థిక అభివృద్ధి పథకం విజయవంతంగా పూర్తి చేసుకోబోతున్నారు.అదేవిధంగా 2026లో జరిగే 14వ పార్టీ కాంగ్రెస్ కోసం అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు.ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని భవిష్యత్తులో కమ్యూనిస్టు పార్టీ , వియత్నాం ప్రజల విజయాన్ని ఆకాంక్షిస్తూ సామ్యవాద నిర్మాణంలో వారి ప్రయత్నాలు ఫలించాలని కోరుకుందాం.
యాభై వసంతాల పునరేకీకరణ – నేటి వియత్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES