Saturday, May 24, 2025
Homeఎడిట్ పేజిఅగ్నికీలలు మింగేస్తున్నా పాఠాలు నేర్వరా?

అగ్నికీలలు మింగేస్తున్నా పాఠాలు నేర్వరా?

- Advertisement -

హైదరాబాద్‌ నగరంలోని గుల్జార్‌హౌస్‌లో ఇటీవల సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం, ఎనిమిది మంది చిన్నారులతో సహా పదిహేడు నిండు ప్రాణాలను బలిగొంది. వేగంగా విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాలు అగ్ని ప్రమాదాలకు కేంద్రాలుగా ఎలా మారుతున్నాయో ఈ దుర్ఘటన మరోసారి స్పష్టం చేసింది. వ్యవస్థాపక లోపాలు, మౌలిక సదుపాయాల కొరత, సమిష్టి బాధ్యతలో ఉన్న వైఫల్యాల కారణంగా పదే పదే సంభవిస్తున్న దుస్థితికి ఇది నిదర్శనం. ఇలాంటి ప్రమాదాలు యాదృచ్ఛికంగా జరుగుతాయనుకుంటే పొరపాటే. తరచుగా ఇవి నిబంధనల ఉల్లంఘనలు, మౌలిక లోపాలు, భద్రత పట్ల నిర్లక్ష్యం వంటి పలు అంశాల పర్యవసానమే. ఈ విపత్తుల విష వలయం నుండి బయటపడాలంటే, మన నగరాలు ఎందుకు అగ్నికి ఆహుతవుతున్నాయో సమగ్రంగా విశ్లేషించి, భవనాలను నిర్మించే, నియంత్రించే, నివసించే విధానంలో సమూల మార్పులు తీసుకురావాలి.
నిర్లక్ష్యపు నిప్పురవ్వలు మంటలు చెలరేగడానికి ముఖ్య కారణాలు చూస్తే, భవనాల్లో ఎక్కువగా దారితీసేవి విద్యుత్‌ సంబంధిత లోపాలే. నాసిరకం విద్యుత్‌ వైరింగ్‌, నిర్వహణ సరిగా లేని పాత వ్యవస్థలు, అధిక లోడు మోస్తున్న సర్క్యూట్లు, అర్హత లేనివారితో చేయించిన తాత్కాలిక మరమ్మతులు షార్ట్‌ సర్క్యూట్లు, వైరింగ్‌ కాలిపోవడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తాయి. ముఖ్యంగా పురాతన భవనాల్లో నిబంధనలకు విరుద్ధంగా విస్తరించిన నిర్మాణాలలో ఈ సమస్య తీవ్రం. ఇది నివాస, వాణిజ్య స్థలాలను క్షణంలో అంటుకునే పదార్థాలుగా మారుస్తుంది. వంట గ్యాస్‌ సిలిండర్ల లీకేజీలు, లోపభూయిష్టమైన రెగ్యులేటర్లు, గ్యాస్‌ పైప్‌లైన్లు కూడా ప్రమాదకరమే. సులభంగా మంటలు అంటుకునే పెయింట్లు, రసాయనాలు, ప్లాస్టిక్‌ వంటి వాటిని అజాగ్రత్తగా నిల్వ చేయడం, మానవ నిర్లక్ష్యం కూడా ఇటువంటి ప్రమాదాలకు తోడవుతున్నాయి. అజాగ్రత్తగా వదిలేసిన సిగరెట్లు, వంట చేసేటప్పుడు శ్రద్ధ వహించకపోవడం, సరిగా పర్యవేక్షించకుండా హీటింగ్‌ పరికరాలు వాడటం వంటివి చిన్నగా మొదలై పెద్ద విపత్తులుగా రూపాంతరం చెందుతాయి. కనీస భద్రతా వ్యవస్థలు లేని ప్రదేశాల్లో ఈ లోపాలు ప్రాణాంతకమవుతాయి.
ప్రణాళికాబద్ధం కాని వేగవంతమైన పట్టణీకరణ అధిక జనసాంద్రతకు దారితీసింది. వాణిజ్య, నివాస స్థలాలు పక్కపక్కనే ఉండటం, ఒకే భవనాన్ని వివిధ అవసరాలకు వినియోగించడం అగ్ని ప్రమాదాల తీవ్రతను పెంచుతుంది. అనేక నగర చారిత్రక కేంద్రాలు ఇరుకైన వీధులు, ఒకదానికొకటి ఆనుకుని ఉండే భవనాలతో నిండి ఉంటాయి. ఇవి ఆధునిక అగ్నిమాపక వాహనాలు, రెస్క్యూ పరికరాలు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి, పనిచేయడానికి తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయి. చిన్న మంటలు కూడా నియంత్రణకు అందని మహా విషాదాలుగా మారతాయి. అక్రమ నిర్మాణా లతో పాటు ఆక్రమణలు అత్యవసర మార్గాలను మూసి వేస్తాయి. ప్రాణాలను కాపాడే అవకాశాలను తగ్గిస్తాయి. సరైన నిష్క్రమణ మార్గాలు లేకపోవడం వల్ల మంటలు చెలరేగిన ప్పుడు భవనం నుండి బయటపడటం కష్టమవుతుంది.మరో కీలక కోణం ఏమిటంటే, మన దేశంలో అగ్ని భద్రతా నియమాలు ఉన్నప్పటికీ, వాటి అమలులో తీవ్ర లోపాలున్నాయి. నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌, వివిధ రాష్ట్రాల అగ్నిమాపక సేవల చట్టాలు భవన నిర్మాణంలో భద్రతా ప్రమాణాలైన ఫైర్‌-రెసిస్టెంట్‌ మెటీరియల్‌ వాడకం, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, ఫైర్‌ డిటెక్షన్‌, అణచివేత వ్యవస్థలు, తప్పనిసరి ఆడిట్‌లు, నిరభ్యంతర ధృవీకరణ పత్రం తప్పనిసరి చేస్తాయి. అయినప్పటికీ వీటి ఆచరణలో అనేక లోపాలున్నాయి. తగినంత మంది శిక్షణ పొందిన ఇన్‌స్పెక్టర్లు లేకపోవడం, నియంత్రణ సంస్థలలో వనరుల కొరత, తనిఖీ అనుమతి ప్రక్రియలో జాప్యం, అవినీతి, భద్రతా నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం, బాధ్యులను న్యాయస్థానాలకు అప్పగించే ప్రక్రియలో లోపం నిర్లక్ష్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అనేక భవనాలు, ముఖ్యంగా పెద్ద నివాస, వాణిజ్య సముదాయాలు కూడా, సరైన అగ్నిమాపక అనుమతులు లేకుండా లేదా కాలం చెల్లిన భద్రతా వ్యవస్థలతో పనిచేస్తున్నాయి. అంతేకాకుండా, అగ్ని భద్రత పట్ల విస్తృతమైన ప్రజా అవగాహన లేకపోవడం, సౌలభ్యం ఖర్చులకు ప్రాధాన్యత ఇచ్చే సంస్కృతి కూడా ఈ సమస్య తీవ్రతరం చేస్తున్నాయి. భవనాల్లో నివసించే వారికి, పనిచేసే వారికి ప్రాథమిక అగ్ని భద్రతా పద్ధతులు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు.
అగ్నిమాపక పరికరాలు ఎలా వాడాలో అవగాహన ఉండదు. ప్రయివేటు భవనాల్లో అగ్నిమాపక డ్రిల్స్‌ నిర్వహించడం చాలా అరుదు. ఓవర్‌లోడ్‌ అయిన ఎలక్ట్రికల్‌ సాకెట్లు, అడ్డంగా ఉన్న మెట్ల మార్గాలు వంటి చిన్న చిన్న భద్రతా లోపాలను ఒక పెద్ద ప్రమాదం జరిగే వరకు పట్టించుకోని ధోరణి ఎక్కువగా ఉంటుంది.ఈ బహుముఖ సమస్యను పరిష్కరించడానికి పటిష్టమైన, సమగ్ర వ్యూహం అవసరం. దీనికి ప్రభుత్వ నిబద్ధత, కఠినమైన అమలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా భాగస్వామ్యం తప్పనిసరి. కేవలం చట్టాలు ఉండటం కాదు. వాటిని అమలు చేసే యంత్రాంగం బలంగా ఉండాలి. వాణిజ్య, నివాస, పారిశ్రామిక, ప్రభుత్వ భవనాలకు తప్పనిసరిగా నిర్ణీత కాల వ్యవధిలో అగ్ని భద్రతా ఆడిట్‌లు నిర్వహించాలి. వీటిని స్వతంత్ర, అర్హత కలిగిన థర్డ్‌ పార్టీల ద్వారా చేయించాలి. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ప్రాంగణాలను సీల్‌ చేయాలి. ప్రమాదం జరిగితే క్రిమినల్‌ బాధ్యత వహించేలా చట్టాలు బలంగా ఉండాలి. అనుమతి ప్రక్రియను పారదర్శకంగా, అవినీతి రహితంగా, సాంకేతిక ఆధారితంగా మార్చాలి. రెండవది, అగ్నిమాపక విభాగాన్ని బలోపేతం చేయడానికి గణనీయమైన పెట్టుబడి పెట్టాలి. పట్టణ సవాళ్లకు అనుగుణంగా ఆధునిక పరికరాలు, శిక్షణ పొందిన సిబ్బంది సంఖ్యను పెంచడం, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు మెరుగు పరచడం, నీటి వనరుల లభ్యత (ఫైర్‌ హైడ్రెంట్లు) వంటివి వారికి తప్పనిసరిగా అందించాలి. పట్టణ ప్రణాళికలోనే అగ్ని భద్రతను ఒక భాగంగా చూడాలి. పాత భవనాలకు ఆధునిక భద్రతా సదుపాయాలను కల్పించడానికి ప్రోత్సాహకాలు ఇచ్చి, క్రమంగా వాటిని తప్పనిసరి చేయాలి. మూడవది, భవనాల యజమానులు, ఆపరేటర్లు, నిర్వాహకులు తమ ప్రాంగణాలలో అగ్ని భద్రతా ప్రమాణాలను పాటించే బాధ్యతను చట్టపరంగా వహించాలి. విద్యుత్‌ వ్యవస్థలు, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలను క్రమం తప్పకుండా తనిఖీ నిర్వహణ చేయడం విధిగా మారాలి. చివరగా, విస్తృతమైన అవగాహనా కార్యక్రమాలు ప్రాథమిక శిక్షణ ద్వారా పౌరులను అగ్ని భద్రతపై చైతన్యపరచాలి. ప్రమాదకర పరిస్థితులను ఎలా గుర్తించాలి. అగ్నిమాపక పరికరాలను ఎలా ఉపయోగించాలి, సురక్షితంగా ఎలా బయటపడాలి వంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. నిబంధనలు పాటించని వారిపై ఫిర్యాదు చేయడానికి సులభ మార్గాలను అందుబాటులో ఉంచడం కూడా పౌర పర్యవేక్షణను పెంచుతుంది. అగ్ని భద్రతకు సంబంధించిన నియమాలు, నిబంధనలు, నిపుణుల సూచనలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. కావలసింది ఏమిటంటే, ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిల నుండి సాధారణ పౌరుల వరకు అందరిలో నిబద్ధత, చట్టాలను పటిష్టంగా అమలు చేసే సంకల్పం, మౌలిక సదుపాయాలలో పెట్టుబడి, భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే సంస్కృతిని పెంపొందించడం, బాధ్యతాయుతమైన వారిపై చర్యలు తీసుకోవడం. అప్పుడే మనం ఇలాంటి విషాదాలు పునరావృతం కాని సురక్షితమైన నగరాలను నిర్మించుకోగలం.
దుంగ జనక మోహనరావు
8247045230

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -