నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీయేతర రాష్ట్రాల్లో మరోసారి గవర్నర్ల తీరు చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ రాష్ట్ర గవర్నర్ సభను వాకౌట్ చేయగా, మరొకరు గవర్నర్ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వ ప్రతికూల అంశాలను విస్మరిస్తూ ప్రంసగాన్ని పూర్తి చేశారు. వారి తీరుతో సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభమవుతుంది. ఆ ప్రసంగంలో ప్రస్తుతం సర్కార్ సాధించిన ఘనకార్యాలు, భవిష్యత్లో రాష్ట్ర పురోగతి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి, కేంద్రం నుంచి లభించే సహాయ సహకారాలపై సవివరంగా స్థాలిన్ ప్రభుత్వం రూపొందించింది.
అయితే ఆ రాష్ట్ర గవర్నర్ RN. రవీ స్టాలిన్ ప్రభుత్వం రూపొందించిన గవర్నర్ ప్రసంగం పత్రాన్ని చదవుకుండనే సభ మధ్యలోనే ఆయన బయటికి వచ్చారు. ఇదే మాదిరిగా గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆ రాష్ట్ర గవర్నర్ ప్రవర్తించారు. గవర్నర్ తీరుపై ఆ రాష్ట్ర అధికార పార్టీతో పాటు విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం పట్ల, అసెంబ్లీ నియమాల పట్ల గరవ్నర్ వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అదే విధంగా కేరళ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఇదే మాదిరిగా ప్రవర్తించారు. విజయన్ ప్రభుత్వం రూపొందించిన గవర్నర్ ప్రసంగంలోని కొన్ని అంశాలను తనకు తనుగా మార్పు చేస్తూ సభలో చదివారు. దీంతో గవర్నర్ తీరుపై ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వ హయాంలో కేరళ పురోగతి సాధించిందని పేర్కొన్న అంశాలను కావాలనే వదిలిపెట్టారని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై గవర్నర్ ప్రసంగంలో ప్రస్తవిస్తే…ఆయన కావాలనే అంశాలను విస్మరించారని మండిపడ్డారు. ఎలాంటి అధికారాలు లేకుండానే, తనుకు తానుగా గవర్నర్ ప్రసంగంలో పలు మార్పులు చేస్తూ సభను అవమానించారని తెలిపారు.



