నవతెలంగాణ – పరకాల
కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం చేస్తున్న రాజకీయ ప్రతీకార చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పాలకులకు ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. అబద్ధాల కోటలు కూలిపోవడం ఖాయం..”మీ ఉడత ఊపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తి హరీష్ రావు కాదు. అక్రమ కేసులు, నిర్బంధాలతో ఆయన్ని లొంగదీసుకోవాలనుకోవడం మీ అజ్ఞానమే” అని ధర్మారెడ్డి విమర్శించారు. అబద్ధపు పునాదుల మీద కట్టిన కాంగ్రెస్ రాజకీయ కోటను రాబోయే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ నేలమట్టం చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
హరీష్ రావు చట్టాన్ని గౌరవించే నాయకుడని, విచారణకు ఎన్నిసార్లు పిలిచినా హాజరయ్యే దమ్ము ఆయనకు ఉందని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. అయితే, కేసుల పేరుతో కుట్రలు పన్నుతూ ప్రజల దృష్టిని మళ్లించాలని చూడటం ప్రభుత్వానికి సాధ్యం కాదని హితవు పలికారు. హరీష్ రావు వెనుక కోట్లాది తెలంగాణ గొంతుకలు ఉన్నాయని గుర్తు చేశారు. కక్ష్య రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను ఎప్పుడు అమలు చేస్తారు?,ప్రజలకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? పాలన అంటే కేసుల వేట కాదు, ప్రజా సంక్షేమమని గ్రహించాలి. చివరగా, “బిఆర్‌ఎస్ నాయకత్వాన్ని భయపెట్టాలని చూడటం మానుకోండి. రాబోయే కాలంలో ప్రజలే మీకు అసలైన రిమాండ్ విధిస్తారు” అని ఆయన హెచ్చరించారు.



