Tuesday, January 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమాంజాతో మరో దారుణం

మాంజాతో మరో దారుణం

- Advertisement -

నాగోల్ ఫ్లైఓవర్ వద్ద సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ముఖానికి చుట్టుకుని తీవ్ర గాయం
నిషేధం ఉన్నా కొనసాగుతున్న మాంజా మృత్యుపాశం
నవతెలంగాణ – నాగోల్

హైదరాబాద్ నగరంలో నిషేధిత మాంజా దారం వల్ల ప్రమాదాలు తగ్గడం లేదు. తాజాగా నాగోల్ ఫ్లైఓవర్ వద్ద జరిగిన ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గాలిపటాల మాంజా దారం తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మరో వ్యక్తి ప్రాణాలకు ముప్పు తెచ్చినట్లుగా మారింది. హస్తినాపురం వందనపురి కాలనీకి చెందిన చీల రాజశేఖర్ (37) మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తున్న సమయంలో నాగోల్ ఫ్లైఓవర్ వద్ద రోడ్డుపై తెగిపడి ఉన్న గాలిపటాల మాంజా దారం గాలికి ఎగిరి నేరుగా ఆయన ముఖానికి చుట్టుకుంది. కత్తిలా పదునైన మాంజా ఒక్కసారిగా ముఖాన్ని చీల్చడంతో రాజశేఖర్ ముక్కుపై లోతుగా కోసుకుపోయి పెద్ద గాయం ఏర్పడింది. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆయన తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.

అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో రాజశేఖర్ కొంతసేపు బైక్‌పై నియంత్రణ కోల్పోయినప్పటికీ, అప్రమత్తంగా వాహనాన్ని పక్కకు ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది.

నగరంలో ఇప్పటికే  మాంజా కారణంగా పలువురు గాయపడటంతో పాటు ప్రాణనష్టాలు కూడా సంభవించిన నేపథ్యంలో.. ఈ తాజా ఘటన ప్రజల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. నిషేధం అమలులో ఉన్నప్పటికీ  మాంజా అక్రమంగా విక్రయించబడుతూ, వినియోగంలో ఉండటం పట్ల అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఫ్లైఓవర్లు, ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాల్లో తెగిపడి ఉన్న మాంజాలు ద్విచక్ర వాహనదారులు, పాదచారులకు ప్రాణాంతకంగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాంజా విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -