నవతెలంగాణ – మల్హర్ రావు
ఈనెల 24, 25 తేదీల్లో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే విప్లవ రచయితల సంఘం 30వ రాష్ట్ర మహా సభలను విజయవంతం చేయాలని విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య కోరారు. మంగళవారం మండలం కొయ్యుర్ గ్రామంలో అమరుడు కొమరం బీమ్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల నాయకులతో కలిసి మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. విరసం, నేత మాట్లాడుతూ.. గత మూడు దశాబ్దాలుగా విప్లవోద్యమ దశలన్నింట్లో విరసం చురుగ్గా పని చేస్తోందన్నారు. నక్సల్బరీ, శ్రీకాకుళం రైతాంగ పోరాటాలు వసంత మేఘగర్జన వెలుగులో పుట్టిన విరసం భావజాల సాంస్కృతిక రంగాల్లో వర్గ పోరాట రాజకీయాలను కొనసాగిస్తోందని అన్నారు.
సమాజంలో నెలకొన్న సామాజిక అసమానతలు, కులం, మత పీడనలకు వ్యతిరేకంగా వివిధ కళారూపాలు, కథలు,కవిత్వం, నవలలు, సాహిత్యం ద్వారా దీర్ఘకాల ప్రజాపంథా, వర్గ పోరాట ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్, అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి అయితే బాపు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాసి పార్వతి, తుడుందెబ్బ జిల్లా నాయకుడు గుంటిబాపు ముదిరాజు, మహాసభ జిల్లా నాయకులు అక్కినివేని సమ్మయ్య, ముదిరాజు యాదవ్ మహాసభ జిల్లా నాయకుడు పంచిక మల్లేష్, యాదవ్ ఆదివాసి మహిళా నాయకురాలు గడ్డం సమ్మక్క పాల్గొన్నారు.



