పట్టు పరిశ్రమ శాఖ జిల్లా సహాయ సంచాలకులు ఇంద్రసేనారెడ్డి
నవతెలంగాణ – చిన్న కోడూరు
పట్టు సాగు చేస్తున్న రైతులకు బ్యాంకు అధికారులు పెట్టుబడి కోసం రుణాలు అందజేయాలని పట్టు పరిశ్రమ శాఖ జిల్లా సహాయ సంచాలకులు ఇంద్రసేనారెడ్డి అన్నారు. సిద్దిపేట తో పాటు వివిధ జిల్లాల నుండి వచ్చిన యూనియన్ బ్యాంక్ అధికారులు, రైతులకు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా చిన్న కోడూరు మండల చంద్లాపూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
ఇతర పంటలతో పోలిస్తే పట్టు సాగు చాలా లాభదాయకమని సూచించారు. నెలలోనే పంటకాలం ముగుస్తుందని వస్తుందని ఏడాదికి సుమారు 8 నుండి 10 పంటలు తీయవచ్చునని చెప్పారు. పట్టు సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు మెలకువలు వివరించారు. రైతులకు మొదటగా షెడ్ నిర్మాణం, పంట సాగు, పనిముట్లు ఇతర పరికరాల కోసం పెట్టుబడి భారమవుతున్నందున బ్యాంక్ అధికారులు సహకరించి రుణాలు అందజేస్తే కొత్త రైతులు ఈ పంట సాగు చేయడానికి ఎక్కువ సంఖ్యలో ముందుకు వస్తారని చెప్పారు. బ్యాంకు అధికారులు మాట్లాడుతూ రైతులకు రుణాలు ఇచ్చే విషయంలో అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఐలయ్య, యూనియన్ బ్యాంక్ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ హరిబాబు, నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి నిఖిల్ రెడ్డి, పట్టు రైతుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పెద్దోళ్ల నర్సింలు, జిల్లా అధ్యక్షులు పెద్దోళ్ల ఐలయ్య, రైతులు డి. సత్తయ్య, పద్మ, డి.రవి, లక్ష్మి, బొగ్గుల నరసింహులు, జి. రంగదాసు, డి.రాకేష్ తదితరులు పాల్గొన్నారు.



