ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. ఫలితాలు మే నాలుగున ప్రకటించారు. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలలో బీజేపీ గెలిచింది. కేరళలో యూడీఎఫ్ విజయం సాధించింది. తమిళనాడులో ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాలేదు. ఇదంతా సాధారణ వార్త. ఎవరెవరు ఎలా గెలిచారు. ‘సర్’ ప్రభావమేమిటి? ఓటు చోరీ స్టోరీలోకి వెళ్లడంలేదు. ఓటర్ చోరీ గురించి, ఎన్నికలలో డబ్బు, కేంద్ర బలగాలు, ఈ.డి, సి.బి.ఐ. ఎలక్షన్ కమిషన్ పాత్రలే కాక, మతతత్వ విద్వేష పాత్రనూ ఇప్పుడు ప్రస్తావించడంలేదు. వీటన్నింటి ఫలితంగా వచ్చిన రాజకీయ మార్పులు, ఏరకమైన అనాగరికతకు, విధ్వంసానికి, ఫాసిస్టు ఆచరణకు దారితీస్తాయో ఒక్కసారి దేశ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత, పశ్చిమ బెంగాల్‌లో మాత్రం బీభత్సకాండ మొదలయింది. ఇక్కడ మొదటిసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. బెంగాల్‌లో ఇంకా కొత్త ప్రభుత్వం పీఠమెక్కనేలేదు. లూటీలు, దహనాలు, దాడులు, విగ్రహాల కూల్చివేతలు, బెదిరింపులు,మూకుమ్మడి దాడులు, కాషాయ జెండాల నీడలో బుల్డోజర్ విధ్వంసాలు రాష్ట్రాన్ని చుట్టుముట్టాయి.
బెంగాల్ అనగానే మనకు భారతీయ పునర్వికాస ఉద్యమం మెదలుతుంది. రాచరిక పరిపాలనలు, నియంతృత్వాల తర్వాత ఆధునిక భారతదేశానికి దిశానిర్దేశనం చేసిన, అందుకు బాటలు వేసిన ప్రాంతం బెంగాలు. భక్తికి నూతన నిర్వచనం ఇస్తూ క్రమశిక్షణ, సేవ బోధించిన రామకృష్ణ పరమహంస ఆ నేలనే! అతని శిష్యుడిగా ఎదిగిన ప్రపంచ తాత్వికుడు స్వామి వివేకానంద సామాన్యుని ఆకలి తీర్చని మతాలు నిరర్థకమని సెలవిచ్చింది అక్కడే. అనాదిగా సనాతన హిందూ సంప్రదాయపు అమానవీయ ఆచారం ‘సతీసహగమనం’ను నిర్మూలించడం కోసం తీవ్ర కృషి చేసి చట్టం చేయించిన సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్‌రాయ్ జన్మస్థలమది. మహిళా విద్యావ్యాప్తికి, విధవా వివాహ చట్టం కోసం కృషిచేసిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్, విప్లవకారుడు, స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన ఖుదీరాం బోస్, సేవకు ప్రతిరూపం మదర్ థెరిస్సా, సాంస్కృతిక రంగ మేధావి, ప్రసిద్ధ రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్, నజ్రుల్ ఇస్లాం, బంకిం చంద్ర ఛటర్జీ, సుభాష్ చంద్రబోస్ ఇలా ఎన్నో పేర్లు సంస్కర్తల, సాంస్కృతిక కార్యకర్తల పేర్లు పేర్కొనవచ్చు. వాళ్ల ఫొటోలకి కాషాయ కుంకుమ నద్దుతూ జై శ్రీరామ్ అంటూ సంఘపరివార్, బీజేపీ ఆ మహనీయులకు రాజకీయ నినాదాల్ని అంటకడుతున్నది. మతపరమైన గుర్తింపునిచ్చే ప్రయత్నం చేస్తున్నది.
ఎన్నికల ఫలితం వస్తుండగానే బీజేపీ కార్యకర్తలు ప్రపంచ ప్రజా నాయకుడు లెనిన్ విగ్రహాన్ని కూల్చేశారు. కలకత్తాలోని చిన్న చిన్న వ్యాపారాలు నడుపుకుంటున్న ముస్లింల షెడ్లను బుల్డోజర్‌తో కూల్చేశారు. కూరగాయలు అమ్ముకునే వారి వద్దకు వెళ్లి ‘నీ పేరేమిటని’ అడిగి, ముస్లిం అయితే విధ్వంసమేనన్నారు. ఒక పిల్లోడు తెల్ల టోపీ పెట్టుకుని బెలూన్లు అమ్ముకుంటుంటే, వాడు ముస్లిం అని బెలూన్లను పగలగొట్టారు. ఆజాద్ హింద్ కాలేజీ బయట బీజేపీ గుంపు విద్యార్థులను బెదిరిస్తూ ఇది మద్రాస్ కాదు, బుర్ఖా కుదరదని వీరంగం సృష్టించింది. భారతీయతకు ప్రతీకగా ఉన్న బెంగాల్ సమాజంలో ఒక కొత్త విధ్వంస ఫాసిస్టు సంస్కృతీ ఆచరణ ఆరంభమవడాన్ని ఈ సంఘటనలన్నీ రుజువు చేస్తున్నాయి. ఇది ఆనాటి దేశ విభజన బీభత్సాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈ విధ్వంసమంతా పోలీసుల సమక్షంలోనే జరగడం మనం వీక్షిస్తూనే ఉన్నాము. అంతకుముందు మమతా బెనర్జీ నాయకత్వం టీఎంసీ ఆధ్వర్యాన ఒక గుండా రాజ్యంలా సాగింది. అక్కడ సీపీఐ(ఎం) కార్యాలయాలనే ఆక్రమించుకుని, వందలాది కార్యకర్తలను హతమార్చారు. ఇప్పుడు మరింత అరాచక మతోన్మాద శక్తులు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతున్న సువేందు అధికారి మాట్లాడుతూ “నేను హిందువుల కోసమే పనిచేస్తాను” అని రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన నాయకుడు మాట్లాడటం, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే కదా! బెంగాల్ ఇప్పుడు అనాగరికుల ప్రయోగశాల అయింది! ఈ అనాగరిక విధ్వంసాలను అడ్డుకోవడానికి ప్రజా ఉద్యమమే శరణ్యం.
అనాగరికతారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



