నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని దోస్తుపల్లి గ్రామంలో పులి చనిపోయినట్టు మంగళవారం గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పులిని చంపేశారా? చనిపోయిందా? అనే విషయంలో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పులి ఎప్పుడు చనిపోయిందో అనే విషయం ఇప్పటికీ అంతుపటని రహస్య ప్రశ్నగా నెలకొని ఉంది. నాలుగైదు రోజుల క్రితం చనిపోయినట్టు అనుమానాలు ఉన్నాయని, ఇటీవల 15 రోజుల క్రితం 2 గొర్రెలను, పది రోజుల క్రితం రెండు మేక పిల్లలను, ఎనిమిది రోజుల క్రితం ఒక ఆవు దూడను చంపేసినట్టు గ్రామస్తులు తెలిపారు.
అప్పటికే గ్రామస్తులు పులి వచ్చినట్టు, తమ పశువులను చంపేస్తున్నట్టు తెలిపినా.. ఎవరు పట్టించుకోలేదని, పులి ఎక్కడి నుండీ ఇక్కడికి వస్తుందో, రాదో, అటవీశాఖ అధికారులు నిర్ధారించలేకపోయారు. పులి మృతదేహం మొత్తం కుళ్ళిపోయి దుర్వాసన రావడంతో దాని దగ్గరికి వెళ్లేందుకు ఫారెస్ట్ అధికారులు సైతం జంకుతున్నారని గ్రామస్తులు అన్నారు. ఇప్పటికే ఉదయం నుండి రెండు మూడు సార్లు ఫారెస్ట్ అధికారులు వచ్చి పోవడం జరిగిందని, ఇంకా ఎక్కడైనా పులి సంచారం జరుగుతుందోనని అటవీ ప్రాంతంలో తిరుగుతున్నారని తెలిపారు. ఇప్పటికీ అధికారిక సమాచారం ఎటువంటిది విడుదల చేయకపోవడంతో ప్రజలలో అసంతృప్తి నెలకుంది.



