బారికేడింగ్, బందోబస్తు, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి
జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్
నవతెలంగాణ – ముధోల్
జనవరి 23న బాసరలో జరగనున్న వసంత పంచమి వేడుకల నేపద్యంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్, ఆలయ పరిసర ప్రాంతాలను మంగళవారం సందర్శించి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా బారికేడింగ్, ప్రత్యేక క్యూలైన్ వ్యవస్థ, భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు విధులు పకడ్బందీగా అమలు చేయాలని పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే, వాహనాలరద్దీకారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక సిబ్బందిని నియమించి, రూట్ మ్యాపింగ్ చేసి వాహనాలను దారి మళ్లించే విధంగా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ అంజనీ దేవి తో మాట్లాడిన జిల్లా ఎస్పీ, క్యూ లైన్ల నిర్వహణ, లడ్డు కౌంటర్ల వద్ద రద్దీ నియంత్రణ, వంటి అంశాలపై చర్చించారు. వసంత పంచమి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, శాంతి భద్రతల పరిరక్షణకు తగిన బలగాలతో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ, భక్తులకు సురక్షిత వాతావరణంలో దర్శనం కల్పించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎస్పీ వెంట భైంసా ఏఎస్పీ రాజేష్ మీన ఉన్నారు.



