ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్‌లోని సివిల్ సప్లై భవన్ మొత్తం జూన్ 1 నుంచి తెలంగాణకే చెందనున్నది. శుక్రవారం హైదరాబాద్‌లోని పౌరసరఫరాల భవన్‌లో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో భేటీ అయ్యారు. ఆస్తుల పంపకాన్ని దశల వారీగా చేసుకోవాలని వారు నిర్ణయించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల పౌరసరఫరా విధానాలు, ఉపయోగించే టెక్నాలజీ గురించి చర్చించినట్టు తెలిపారు. అంతర్రాష్ట్రాల మధ్య ధాన్యం అక్రమ రవాణా కట్టడి, ఆస్తుల బదిలీపై కూడా చర్చించినట్టు చెప్పారు. రాష్ట్ర విభజనలో సివిల్ సప్లై బిల్డింగ్‌లో సగం ఏపీకి వెళ్లగా, జూన్ 1 నుంచి భవనం మొత్తం తెలంగాణకు అప్పగించనున్నట్టు వెల్లడించారు. ఇకపై ఆహార, అనుబంధ శాఖలన్నీ ఈ కార్యాలయంలోనే ఉండనున్నాయని ప్రకటించారు. శాంతి శిఖర అపార్ట్‌మెంట్‌లో ఉన్న 16 ఫ్లాట్స్ కూడా తెలంగాణకే రాబోతున్నట్టు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. నాదెండ్ల ఆధ్వర్యంలోనే ఉమ్మడి ఏపీలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని ఉత్తమ్ గుర్తు చేశారు. ఆ క్రెడిట్ నాడు స్పీకర్‌గా ఉన్న నాదెండ్లకే దక్కుతుందన్నారు.
రెండు రాష్ట్రాల రైతులకు మేలు చేయాలనేదే మా ఉద్దేశం : ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
వినియోగదారులకు మేలు రకమైన బియ్యం అందుబాటు ధరలో ఉండాలనేదే తమ ఉద్దేశమని నాదెండ్ల మనోహర్ చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏపీలో జూన్ 12 నుంచి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కింద సన్న బియ్యం అందించనున్నట్టు తెలిపారు. 25 వేల చ.అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఏపీ సివిల్ సప్లై భవన్‌ను పూర్తిగా తెలంగాణకు అప్పగిస్తున్నట్టు స్పష్టం చేశారు. తెలంగాణలో టెక్నాలజీలో జరుగుతోన్న మార్పులను తామూ అందుకుంటామనీ, కాకినాడ నుంచి ఫిలిప్పిన్స్‌కు బియ్యం ఎగుమతి చేస్తున్నట్టు తెలిపారు. దానికి అవసరమైన అన్ని సౌకర్యాలపై చర్చించినట్టు చెప్పారు. ఈ సమావేశంలో పౌరసరఫరాలశాఖ ముఖ్య కార్యదర్శి డి.ఎస్.చౌహాన్, ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాలశాఖ ముఖ్య కార్యదర్శి సురభ్ గౌర్ పాల్గొన్నారు.
జూన్ 1 నుంచితెలంగాణకే సివిల్ సప్లై భవన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES