Wednesday, January 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఇదేం.. పంచాయితీ?

ఇదేం.. పంచాయితీ?

- Advertisement -

రెండేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత పంచాయతీలకు విడుదలైన నిధుల కోసం పంచాయితీ మొదలైంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు రెండు వందల డెబ్బయి ఏడు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిధులు ఒకట్రెండు రోజుల్లో జీపీ ఖాతాల్లో జమ కానున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ మొత్తంపై ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న ఒక్కటే. ఈ నిధులు ఎవరికి చెందాలి? ఓవైపు అభివృద్ధి పనులకు అప్పులు చేసిన మాజీ సర్పంచులకా? మరోవైపు పాలన ముగిసిన తర్వాత భారాన్ని మోసిన ప్రత్యేకాధిరులకా? లేదంటే ఇప్పుడు కొత్తగా కొలువుదీరిన సర్పంచులకా? ఇంకా సందిగ్ధంగానే ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు. కానీ, గమనించాల్సిన మౌలికమైన అంశం, అసలు రావాల్సిన నిధులెన్ని? వచ్చిన వెన్ని? ఇప్పుడున్న పరిస్థితిలో ఈ రెండింటినీ విడదీసి చూడలేం. ఎందుకంటే, ఇక్కడ ఎవరి కోణం నుంచి చూసినా అందరిదీ న్యాయమైన అభ్యర్థనే. కానీ, ప్రభుత్వాల తీరే అన్యాయంగా ఉంది. రాష్ట్ర సర్కార్‌ అరకొర నిధుల్ని విడుదల చేసి వివాదానికి కారణమవుతున్నది. అలాగే చేసిన పనులకు కూడా నిధులివ్వకుండా గత ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించలేదనే సాకుతో కేంద్రం ఏకంగా నిధులే నిలిపివేసింది.

‘తిలా పాపం.. తలా పిడికెడు’ అన్నట్టు ఇందులో అందరి పాత్ర దాగున్నది.
పంచాయతీలంటేనే గ్రామీణ ప్రాంతాల తొలిస్థాయి ప్రజాపాలన వ్యవస్థకు ప్రతిబింబాలు. ప్రతి గ్రామంలో తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్‌, రోడ్లు, వీధిదీపాలు వంటి కనీస అవసరాలు ఉంటాయి. వీటిని పరిష్కరించాలంటే వేల కోట్ల రూపాయల స్థిర నిధులవసరం. కానీ, ప్రభుత్వాలు విసిరేసిన ఎంగిలి మెతుకుల్లాగా నిధులను విదులుస్తున్నాయి. వాస్తవంగా గ్రామపంచాయతీలు నడుస్తున్నది ప్రభుత్వాల నిధులతో కాదు. ప్రజల పన్నుల మీద, సర్పంచుల అప్పుల మీద, కార్మికుల శ్రమ మీద మాత్రమే. గత ప్రభుత్వం హయాంలో అప్పటి సర్పంచులు అప్పులు తెచ్చి మరీ అభివృద్ధి పనులు చేశారు. పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో శ్మశానవాటికలు, విలేజ్‌ పార్కులు, రైతు వేదికలు, సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణాలు చేపట్టారు. సుమారు రూ.ఐదు వందల కోట్ల దాకా ఆ బకాయిలే పెండింగ్‌లో ఉన్నాయి. అప్పులు తెచ్చిన వారికేమో వడ్డీలు పెరిగి తడిసి మోపెడయ్యాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురై పలువురు సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు వార్తలొచ్చాయి. పరిస్థితులు కొంతమందిని పట్టణాల్లో వాచ్‌మెన్‌లుగా, కూలీలుగా మారాల్సిన దుస్థితికి చేర్చాయి. చేసిన పనులకు బిల్లులు పెండింగ్‌లో పెట్టడం గత సర్కార్‌ తప్పిదం. తమకెందుకు ఈ భారమని కాలయాపన చేయడం ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యం!

చివరిసారి రెండేండ్ల కిందట ఆర్థిక సంఘం నిధులొచ్చాయి. తర్వాత మల్టీపర్పస్‌ వర్కర్లకు జీతాల కోసం తప్ప అభివృద్ధి పనులకు ఎలాంటి నిధులు రాలేదు. ఇప్పుడు కొత్తగా విడుదల చేసిన నిధులు కూడా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవే. అందుకే తమ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకే ఈ నిధులు వెచ్చించే హక్కుందని పాత సర్పంచుల వాదన. పల్లెల్లో పంచాయతీల గడువు ముగిసిన వెంటనే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లలేదు. సర్పంచుల స్థానంలో ప్రత్యేకాధికారుల నియమించింది. మొన్న ఎన్నికలు పూర్తయ్యేవరకు కూడా జీపీల్లో కార్యదర్శులే తమ జేబుల్లోంచి డబ్బులు పెట్టారు. అప్పులు తెచ్చి మరీ పారిశుధ్య పనులు నిర్వహించారు. డీజిల్‌కు, ట్రాక్టర్‌ ఈఎంఐలు పెద్ద మొత్తంలో కట్టారు.వారి జీతాలను సైతం అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించారు. ఈ నిధులు తమకే చెందాలనేది వారి అభిప్రాయం. ఇదిలా ఉంటే, తాము గెలవడానికి అనేక హామీలు ఇచ్చామని, గ్రామాల్లో కొత్తరోడ్లు, డ్రెయినేజీలు, అభివృద్ధి పనులకు ఈ నిధుల్ని ఖర్చుచేయాలని కొత్త సర్పంచుల ఆశ.

మూలాల్ని పరిశీలిస్తే ఈ సమస్య సర్పంచులు, మాజీ సర్పంచులు, కార్యదర్శులదే కాదు, ప్రజలందరిదీ. ఇక్కడ నిధులు ఎవరివని చర్చించడం కన్నా గ్రామాలకు రావాల్సిన నిధులు సకాలంలో ఎందుకు రావడం లేదు.చేసిన పనులకు బిల్లులు ఎందుకు చెల్లించడం లేదు. పంచాయతీలు అప్పుల పుట్టలుగా మారడానికి కారణమెవరు? పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలని ఉపన్యాసాలిచ్చే పాలకులు, వాటిని విస్మరించిన ఫలితాలివి. ఇకపోతే, పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం నిలిపివేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. విడుదల చేస్తామన్న ప్రకటనలు ఊరిస్తున్నప్పటికీ, వీటిని ఇప్పటికే విడుదల చేసుంటే ఈ గొడవే ఉండేది కాదు. అందుకే, పంచాయతీలు పాలకుల దయతో నడిచే సంస్థలను కుంటే పొరపాటు. అవి ప్రజాస్వామ్యానికి పునాదులు. నిధులు లేకుండా, అధికారాలు లేకుండా, ఎన్నికలు లేకుండా పంచాయతీలను నడపమంటే గ్రామ స్వయంపాలనను ఖాళీ కాగితంగా మార్చడమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -