మల్లు స్వరాజ్యం... అంటే కేవలం ఓ పేరు మాత్రమే కాదు. నిత్యం కణకణ మండే అగ్ని కణం. ఆనాడు తెలంగాణ ప్రజలను పట్టి పీడించిన రజాకార్లకు సింహస్వప్నం. ప్రజాసమస్యల పరిష్కారానికై పాలకులను నిలదీసే ధీరత్వం. ఉద్యమకారిణిగా, రాజకీయ నాయకురాలి గా, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలిగా అందరికీ సుపరిచితం. నేటి యువతకు ఆమె జీవితం స్ఫూర్తిదాయకం. తెలుగు నేలపై మహిళా ఉద్యమాన్ని నిర్మించడంలో ఆమె పాత్ర అమోఘం. ఈనెల 25 నుండి 28 వరకు ఐద్వా అఖిల భారత మహాసభలు జరగబోతున్న నేపథ్యంలో ఆ వీరవనిత పరిచయం నేటి మానవిలో…
1931లో సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో జన్మించారు మల్లు స్వరాజ్యం. తండ్రి భీమిరెడ్డి రామిరెడ్డి, తల్లి చొక్కమ్మ. స్వరాజ్యం చదివింది ఐదో తరగతి వరకే. కానీ అన్న భీమిరెడ్డి నర్సింహారెడ్డి ప్రోత్సాహంతో సమాజాన్ని అధ్యయనం చేశారు. అలాగే గుర్రపుస్వారి, ఈత, వ్యాయామ శిక్షణ వంటివి నేర్చుకున్నారు. స్వరాజ్యం తండ్రి చనిపోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ సమయంలో కుటుంబాన్ని నిలబెట్టడంలో ఆమె తల్లి ధైర్యంగా ముందుకొచ్చారు. భూములు, ఇతర కుటుంబ వ్యవహారాలు చూసుకోవడం మొదలుపెట్టారు. స్వతహాగా చొక్కమ్మ చాలా ధైర్యస్థురాలు. అలాగే కరుణామయి. పిల్లల వ్యక్తిత్వం మీద ఆమె ప్రభావం ఎంతో ఉన్నది. అలాంటి వాతావరణంలో పెరిగిన స్వరాజ్యం చిన్న తనంలోనే మాగ్జిం గోర్కీ ‘అమ్మ’ నవల ప్రేరణతో సామాజిక దురాచారాలపై పిడికిలి బిగించారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా వెట్టిచాకిరి అనుభవిస్తున్న పేదల పక్షం నిలిచారు.
పీడితులకు మద్దతుగా
స్వరాజ్యం ఆనాటి ఆర్థిక, సామాజిక అసమానతల్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు. బాల్యం నుండే ఆమెకు అన్ని విషయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. అలాగే ప్రతిదాన్ని ప్రశ్నించే స్వభావం చిన్నప్పటి నుండే అలవడింది. తండ్రి చనిపోయిన తర్వాత ఆమె గడిని దాటి బయటకు వెళ్లటం మొదలు పెట్టారు. జమిందారీ ఆధిపత్యపు పోకడలు, వ్యవసాయ సంబంధాల గురించి స్పష్టమైన అవగాహనపొందారు. అనంతరం కమ్యూనిస్టుగా తన బాధ్యత ఏమిటో స్పష్టంగా తెలుసుకున్నారు. 1940లలో తెలంగాణ ప్రాంతం నిజాం వ్యతిరేక ఉద్యమంతో అట్టుడికిపోతున్నది. నిజాం పాలనలో దొరలకు, రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో ఆమె కీలక పాత్ర పోషించారు. గెరిల్లా దళాలకు నాయకత్వం వహించారు. 1941లో తొలిసారిగా ఆంధ్రమహాసభ పిలుపుతో తన కుటుంబానికి చెందిన భూముల్లోని ధాన్యం నిరుపేద కుటుంబాలకు పంచిపెట్టారు. ఆనాటి సామాజిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా పీడిత ప్రజలకు మద్దతుగా నిలిచే విషయంలో తన తల్లి స్వరాజ్యంకు అండగా నిలబడ్డారు.
పట్టిస్తే జరిమానా..
ఆంధ్రమహాసభ మహిళా విభాగం 1930లో ప్రారంభమైంది. 1942లో తన పన్నెండ్ల వయసులో స్వరాజ్యం అందులో సభ్యురాలయ్యారు. అప్పటికే సాయుధ పోరాటంలో పని చేస్తున్న ఆరుట్ల కమలాదేవి ఇంట్లో ఈ సభలు జరిగాయి. అక్కడ జరిగిన చర్చలు స్వరాజ్యంని మరింత ఆలోచింప చేశాయి. చదువు మానేసి పూర్తిగా ఉద్యమంతో మమేకమయ్యారు. 1946లో సూర్యాపేట తాలూకా పోరాట కమిటీ నాయకురాలిగా స్వరాజ్యం నియమించబడ్డారు. స్త్రీ,పురుషులకు ఈ కమిటీ శిక్షణ ఇస్తుంది. ఈ కమిటీల్లో మహిళలకు కూడా వివిధ రకాల బాధ్యతల్ని అప్పగించారు. ఒకపక్క రజాకార్లతో పోరాడుతూనే ఇళ్లలో మహిళలపై జరుగుతున్న గృహహింసపై కూడా ఉద్యమించారు. అలాగే మగవారిని తాగుడు మాన్పించేందుకు పూనుకున్నారు. వీటన్నింటిలో స్వరాజ్యం కీలకపాత్ర పోషించారు. అలాగే తెలంగాణ పల్లె ప్రాంతాల్లో అన్ని వర్గాల స్త్రీలూ పాడుకునే ఉయ్యాల పాటల్ని స్వరాజ్యం రాజకీయాలకు మిళితం చేశారు. ఈ పాటల బాణీల్ని ఉద్యమానికి అనుగుణంగా అల్లేవారు. భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకు ఇవి ప్రేరణనిచ్చాయి.
అన్నింటినీ తట్టుకొని
స్వరాజ్యం రాజకీయ దళ కమాండరుగా నియమితులయ్యారు. గెరిల్లా పోరాట యోధులందరిలోకీ ప్రతిష్టాత్మకమైన, అత్యంత బాధ్యతాయతమైన పదవి ఇది. తుపాకీ పేల్చటం, పరిగెత్తడం, ఈత తదితర అంశాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకే పార్టీ ఈ బాధ్యతను అప్పగిస్తుంది. అనేక మంది మహిళలు తెలంగాణ సాయుధపోరాటంలో ఈ బాధ్యతల్ని సమర్ధవంతంగా నిర్వహించేవారు. అడవుల్లో తిండీ తిప్పలు వుండవు. దొరికింది తింటూ ఉన్నవాటితో సరిపెట్టుకుంటూ అడవుల్లో తిరిగేవారు. స్త్రీలకు ఇది మరింత క్లిష్టమైన పరిస్థితి. వీటన్నింటినీ తట్టుకొని స్వరాజ్యం సాయుధ పోరాటంలో తనవంతు పాత్ర పోషించారు. నిజాం పాలనకు, ఫ్యూడల్ దొరతనానికి పక్కలో బల్లెంలా ఉన్న మల్లు స్వరాజ్యం, భీమిరెడ్డి నర్సింహారెడ్డిలపై ఆగ్రహంతో రజాకార్ మూకలు 1947లో మల్లు స్వరాజ్యం ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆమె ఇల్లు పూర్తిగా తగలబడిపోయింది. అదే సమయంలో అజ్ఞాతంలో ఉన్న స్వరాజ్యాన్ని పట్టిస్తే రూ.10వేలు నజరానాను నిజాం ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికి ఆమె వయసు 18 ఏండ్లు మాత్రమే.
సాయుధ పోరాట విరమణ తర్వాత
1951లో తెలంగాణ సాయుధ పోరాటం విరమించారు. అప్పటికి స్వరాజ్యం వయసు 21. గెరిల్లా యుద్ధం ముగియటంతో ఆమె జీవితంలో ఒక ప్రధాన అధ్యాయం ముగిసింది. విప్లవ యోధురాలిగా ఎనిమిదేండ్లు సాహసాలు, సవాళ్లతో గడిచింది. ఈ అనుభవాలు ఆమెకు రాజకీయ పరిణితిని పెంచాయి. సాయుధ పోరాటం విరమణ తర్వాత కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆమెకు దొరలతో పోరాటం తప్పలేదు. సూర్యాపేటలో పార్టీ పని చేయడం ప్రారంభించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మిలటరీ కమాండరుగా పని చేసిన మల్లు వెంకట నరసింహారెడ్డిని 1954లో ఆమె వివాహం చేసుకున్నారు. 1950 వరకు రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తర్వాత పిల్లల బాధ్యతతో కొంత చురుగ్గా పని చేయలేకపోయపారు. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిపోయిన తర్వాత స్వరాజ్యం సీపీఐ(ఎం)లో చేరారు.
పిస్టోల్ గురిపెట్టినా…
నాగారంలో ఆనాటి ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రత్యర్థి పార్టీ వారు ఓటర్లలో భయాందోళనలు సృష్టిస్తుంటే తను అక్కడికి చేరుకున్నారు. ఆమెతో ఆనాటి అధికార పార్టీకి చెందిన ఓ నేత వాగ్వాదానికి దిగారు. తన పిస్టల్ గురిపెట్టి బెదిరించబోయారు. ఈ హఠాత్పరిణామానికి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కానీ ఆమె ఏ మాత్రం భయపడకుండా ‘కాల్చుతావా, కాల్చు’ అంటూ ఎదురు నిలిచారు. దీంతో ఆ నేత వెనక్కి తగ్గక తప్పలేదు. పేద రైతులు, కూలీల పక్షాన నల్లగొండ జిల్లాలోని భూస్వామ్య శక్తులు, దొరల రాజకీయాలకు అరాచకాలకు ఎదురొడ్డి నిరంతరం పోరాడారు. పీడిత ప్రజల మీద ఏ ప్రాంతంలో దాడులు దౌర్జన్యాలు జరిగినా, ప్రత్యక్షంగా రంగంలోకి దిగి బాధితుల పక్షాన నిలబడ్డారు.
నిరంతరం ప్రజల కోసమే..
పదహారేండ్ల ప్రాయంలోనే సాయుధ పోరాట పంథాలో అడుగుపెట్టినప్పట్నుంచి 91ఏండ్ల వయోభారంలోనూ నిరంతరం ఆమె ప్రజల కోసమే పనిచేశారు. పార్టీ సభలు, సమావేశాల్లో వాడీ వేడిగా సాగే ఆమె ప్రసంగాలను అందరూ ఆసక్తిగా ఆలకించేవారు.స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978 నుండి 83 వరకు మొదటి దఫా, రెండవ దఫా 1983 నుండి 84 వరకు రెండోసారి ఎమ్మెల్యేగా సీపీఎం పార్టీ తరఫున పనిచేశారు. గెరిల్లా దళంలో ఎలాంటి స్ఫూర్తితో అయితే ఆమె పని చేశారో అదే స్ఫూర్తితో ప్రజాప్రతినిధిగా కొనసాగారు. తన నియోజవర్గ సమస్యలను పరిష్కరించేందుకు ఎంతో కృషి చేశారు. మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
అలుపెరుగని పోరాటాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా ఉద్యమ నిర్మాణం కూడా ఇదే సమయాన ఊపందుకుంది. నిజాం వ్యతిరేక పోరాటం నాడే మహిళా ఉద్యమానికి బీజాలు పడ్డాయి. బాల్య వివాహాలను వ్యతిరేకించారు. ఆస్తిలో మహిళలకు కూడా సమాన భాగం ఉండాలని డిమాండు చేశారు. వీటన్నింటిలో మల్లు స్వరాజ్యం పాత్ర ఎంతో గొప్పది. 1981-2001 వరకు ఆమె ఉమ్మడి రాష్ట్రానికి ఐద్వా అధ్యక్షురాలిగా పని చేశారు. ఈ కాలంలో స్త్రీలకు సంబంధించిన పది సమస్యలపై ఆమె నాయకత్వంలో అనేక పోరాటాలు జరిగాయి. అలాగే ఆనాడు జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. ఇతర మహిళా సంఘాల్ని కలుపుకొని విస్తృత వేదికకు రూపకల్పన చేశారు. ఇలా ప్రజా తంత్ర, వామపక్ష ఉద్యమాల అభివృద్ధి కోసం జీవితకాలమంతా అంకితమై పని చేసిన స్వరాజ్యం ఊపిరితిత్తుల సమస్యతో 2022 మార్చి 19న మరణించారు. చనిపోయిన తర్వాత కూడా తాను సమాజానికి ఉపయోగపడాలని నల్గొండ మెడికల్ కాలేజీకి ఆమె శరీరం దానం చేశారు.
– సలీమ



