Wednesday, January 21, 2026
E-PAPER
Homeఆటలుధనాధన్‌కు వేళాయే!

ధనాధన్‌కు వేళాయే!

- Advertisement -

– భారత్‌, న్యూజిలాండ్‌ తొలి టీ20 నేడు
– చారిత్రక సిరీస్‌ విజయంపై కివీస్‌ గురి
– ప్రపంచకప్‌ సన్నద్ధతపై సూర్యసేన దృష్టి
– రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో…

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్‌ ఆరంభం కాగా.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సమర సన్నద్ధతకు టీమ్‌ ఇండియా రంగం సిద్ధం చేసుకుంది. ప్రపంచకప్‌ జట్టులో మార్పులు చేర్పులు, తుది జట్టు ప్రణాళికలు పట్టాలెక్కించేందుకు డిఫెండింగ్‌ చాంపియన్‌కు ఈ సిరీస్‌ ఉపయుక్తంగా ఉండనుంది.
న్యూజిలాండ్‌ భారత్‌లో వరుస రికార్డులు సృష్టిస్తోంది. ఏడాది కాలంలో చారిత్రక టెస్టు, వన్డే సిరీస్‌ విజయాలు సాధించిన కివీస్‌ తాజాగా టీ20 సిరీస్‌పైనా కన్నేసింది. భారత్‌లో న్యూజిలాండ్‌ ఇప్పటివరకు పొట్టి సిరీస్‌లో నెగ్గలేదు. అగ్రశ్రేణి ఆటగాళ్ల రాకతో కదనోత్సాహంతో కనిపిస్తోన్న కివీస్‌ సిరీస్‌ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

నవతెలంగాణ-నాగ్‌పూర్‌

2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫిబ్రవరి 7 నుంచి ఆరంభం కానుండగా.. డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ తుది సన్నాహానికి సిద్ధమైంది. ప్రపంచకప్‌ జట్టును ఎంపిక చేసే వరకు కుర్చీలాట ఆడిన టీమ్‌ ఇండియా.. ఇప్పుడు గెలుపు గుర్రాలను న్యూజిలాండ్‌తో సిరీస్‌లో పరీక్షించనుంది. భారత జట్టులో ఇప్పటికే 7-8 స్థానాలు తుది జట్టులో ఖరారు కాగా.. మిగిలిన 3-4 స్థానాల్లో ఎవరిని ఆడించాలనే స్పష్టత ఈ సిరీస్‌తో రానుంది. 2017, 2023లో భారత్‌లో టీ20 సిరీస్‌ కోసం విఫల యత్నం చేసిన న్యూజిలాండ్‌.. ముచ్చటగా మూడోసారి ప్రయత్నం చేయనుంది. గతంలో రెండు సార్లు సిరీస్‌ వేట ఆఖరు మ్యాచ్‌ వరకు వెళ్లగా.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ సైతం ఉత్కంఠ రేపనుంది. భారత్‌, న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌ నేడు నాగ్‌పూర్‌ పోరుతో షురూ కానుంది.

కూర్పు కుదరాలి!
2024 టీ20 ప్రపంచకప్‌ విజయం తర్వాత భారత్‌ ఈ ఫార్మాట్‌లో గెలుపోటముల రికార్డు 29-5తో గొప్పగా కొనసాగించింది. ఆతిథ్య జట్టు బలోపేతంగా ఉన్నప్పటికీ డిఫెండింగ్‌ చాంపియన్‌కు కొన్ని సమస్యలు లేకపోలేదు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఫామ్‌ ఆందోళనకరంగా మారింది. గత ఏడాదిగా సూర్య గణాంకాలు పేలవం. మైదానంలో అతడి ప్రభావం ప్రతికూలం. కివీస్‌తో సిరీస్‌లో సూర్య మెరిస్తే బ్యాటింగ్‌ లైనప్‌లో సమస్యలకు చెక్‌ పడుతుంది. సంజు శాంసన్‌ తిరిగి ఓపెనర్‌గా రానున్నాడు. ఓపెనర్‌గా సంజు శాంసన్‌ 18 ఇన్నింగ్స్‌ల్లోనే 3 సెంచరీలు సాధించాడు. స్ట్రయిక్‌రేట్‌లో అభిషేక్‌ శర్మ తర్వాత సంజు శాంసనే అత్యుత్తమం. గాయంతో సిరీస్‌లో తొలి 3 మ్యాచ్‌లకు దూరమైన తిలక్‌ వర్మ స్థానం కోసం శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ పోటీపడుతున్నారు. టీ20 ప్రపంచకప్‌ జట్టులో శ్రేయస్‌ లేడు. దీంతో మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కోసం ఇషాన్‌ కిషన్‌కు ఈ సిరీస్‌లో ఆడే అవకాశం దక్కవచ్చు. జశ్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌ సహా వరుణ్‌ చక్రవర్తి ఈ ఫార్మాట్‌లో భారత్‌కు కీలకం. హర్షిత్‌ రానా, శివమ్‌ దూబెలు ఎనిమిదో స్థానం కోసం పోటీపడుతుండగా.. రెండో స్పిన్నర్‌, రెండో పేసర్‌ కోసం అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ రేసులో నిలిచారు.

జోరుమీదున్న కివీస్‌
న్యూజిలాండ్‌ శిబిరం ఉత్సాహంగా కనిపిస్తోంది. ఏడాదిలో టెస్టు, వన్డే సిరీస్‌ విజయాలు ఆ జట్టులో ఆత్మవిశ్వాసం నింపాయి. రెగ్యులర్‌ ఆటగాళ్లు రచిన్‌ రవీంద్ర, మార్క్‌ చాప్‌మన్‌, జేమ్స్‌ నీషమ్‌ సహా మిచెల్‌ శాంట్నర్‌, మాట్‌ హెన్రీ రాకతో జోష్‌ రెండింతలు అయ్యింది. డెవాన్‌ కాన్వే, డార్లీ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ భీకర ఫామ్‌లో ఉన్నారు. టిమ్‌ రాబిన్సన్‌, రచిన్‌ రవీంద్రలు ప్రపంచకప్‌ ముంగిట సత్తా చాటాలని ఎదురుచూస్తున్నారు. గాయంతో మైకల్‌ బ్రాస్‌వెల్‌ దూరమైనా.. కివీస్‌లో మ్యాచ్‌ విన్నర్లకు కొదవ లేదు. ఇశ్‌ సోధి, జాకబ్‌ డఫ్ఫీలు భారత బ్యాటర్లకు సవాల్‌ విసిరేందుకు ఎదురుచూస్తున్నారు.

పిచ్‌, వాతావరణం
అతిపెద్ద అవుట్‌ఫీల్డ్‌ కలిగిన గ్రౌండ్స్‌లో నాగ్‌పూర్‌ ఒకటి. స్పిన్నర్లకు అనుకూలించే స్టేడియాల్లో నాగ్‌పూర్‌ ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ స్పిన్నర్ల సగటు 20.82. మంచు ప్రభావం ఇరు జట్లు విస్మరిస్తున్నాయి. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది. ఇరు జట్ల స్పిన్నర్లు మ్యాచ్‌లో విజయావకాశాలను శాసించనున్నారు. నేడు టీ20 మ్యాచ్‌కు వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది.

తుది జట్లు (అంచనా)
భారత్‌ : అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌/ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, రింకు సింగ్‌, శివమ్‌ దూబె, అర్ష్‌దీప్‌ సింగ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి.
న్యూజిలాండ్‌ : టిమ్‌ రాబిన్సన్‌, డెవాన్‌ కాన్వే (వికెట్‌ కీపర్‌), రచిన్‌ రవీంద్ర, డార్లీ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మార్క్‌ చాప్‌మాన్‌, జేమ్స్‌ నీషమ్‌, మిచెల్‌ శాంట్నర్‌ (కెప్టెన్‌), మాట్‌ హెన్రీ, ఇశ్‌ సోధి, జాకబ్‌ డఫ్ఫీ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -