ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్
23 వరకు జిల్లా ఎన్నికల
అధికారులతో వరుస సమావేశాలు
నేడు ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ
ఎన్నికలకు సిద్ధంగా ఉండండి : అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈ నెల 24 లేదా 27న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు జరగబోయే రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై ఆమె మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్‌లోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో గుర్తించిన పోలింగ్ స్టేషన్ల వారీగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ బాక్స్‌ల తరలింపునకు సంబంధించి రవాణా తదితర అంశాలపై వారికి పలు సూచనలు చేశారు. టీ పోల్ యాప్‌లో పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్లను మ్యాపింగ్ చేయడంపై దిశానిర్దేశం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించనున్నారు. గురువారం ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్లతో, ఈనెల 23న రంగారెడ్డి, మేడ్చల్, ఉమ్మడి మెదక్ జిల్లాల కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై చర్చించనున్నారు.
ఈసీకి లేఖ రాసిన సర్కార్
మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం శనివారమే లేఖ రాసింది. రిజర్వేషన్ల ప్రక్రియ వివరాలను సమర్పించిన నేపథ్యంలో ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఎన్‌ఈసీకి తెలిపింది. అన్ని జిల్లాల కలెక్టర్లు సమర్పించిన కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మెన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ సభ్యుల గెజిట్‌లను ప్రభుత్వం ఎస్‌ఈసీకి పంపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. దీనికి సంబంధించి తీవ్ర కసరత్తు చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు లాటరీ విధానంలో రిజర్వేషన్లను పూర్తి చేసింది. ప్రభుత్వ అభ్యర్థన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాల్టీలు, 2,996 వార్డులకు రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహిం చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.
ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాల పరిధిలోని జోనల్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు(ఆర్వోలు) అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు (ఏఆర్వోలు), కౌంటింగ్ సిబ్బందికి బుధవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఏసీ గార్డ్స్‌లో గల సీడీఎంఏ కార్యాలయంలో టీవోటీలు శిక్షణ ఇస్తారు. వీరికి ఈ నెల 19న ఎంవోటీలు (మాస్టర్స్ ఆఫ్ ట్రైనర్స్) శిక్షణ నిర్వహించిన విషయం విదితమే.
27న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



