Wednesday, January 21, 2026
E-PAPER
Homeజాతీయంహిందూత్వం పేరుతో ద్వేష రాజకీయం

హిందూత్వం పేరుతో ద్వేష రాజకీయం

- Advertisement -

– మతం పేరుతో ప్రజలకు మోసం
– హిందూత్వ శక్తులు, బీజేపీ నేతల విష ప్రసంగాలు
– ఒక వర్గం వారే టార్గెట్‌గా స్పీచ్‌లు
– మోడీ సర్కారు వైఫల్యాలు, అవినీతిపై కనిపించని చర్చ

న్యూఢిల్లీ : మోడీ పాలనలో దేశం హిందూత్వ రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తోంది. హిందూత్వం పేరుతో హింసను, ద్వేషాన్ని రాజకీయం చేయడం ద్వారా దేశ ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీస్తున్నది. ఖడ్గాలు పంచే మతగుంపుల నుంచి, విష ప్రచారం చేసే ప్రజా ప్రతినిధుల వరకు.. వారి నినాదాల వెనుక దాగిన అసలు చేదు నిజాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. స్కిల్‌ ఇండియా వేల కోట్ల రూపాయల అవినీతి వంటి విషయాలు మోడీ పాలనలోని బాధ్యతారామిత్యాన్ని, రాజ్యాంగ విలువల పతనాన్ని స్పష్టంగా చూపుతున్నాయని మేధావులు అంటున్నారు. ఇలాంటి అంశాలపై సరైన చర్చ జరగటం లేదనీ, ఇవి ప్రజల్లోకి వెళ్లాల్సిన అంశాలు అని వారు చెప్తున్నారు.

హిందూత్వ శక్తుల ఆధిపత్యం
దేశంలో హిందూత్వం పేరుతో కొన్ని సంఘవిద్రోహ శక్తులు చేస్తున్న ద్వేషపూరిత ఘటనలు ఇటీవల చాలా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇవి మరింత తీవ్రమయ్యాయి. ఇక శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, మైనారిటీలను భయాందోళనలోకి నెట్టేస్తున్న ఇలాంటి హిందూత్వ శక్తుల దుశ్చర్యలపై మాత్రం బీజేపీ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేవు. సాక్షాత్తూ పోలీసుల సమక్షంలోనే హిందూత్వ కార్యకర్తలు రెచ్చిపోయి మరీ క్రిస్మస్‌ వేడుకలకు అంతరాయం కలిగించిన విషయం విదితమే. ఇటీవల జైలు నుంచి బటయకకు వచ్చిన తర్వాత హిందూత్వ నాయకుడు ఒకరు ‘ధర్మం పని కొనసాగుతూనే ఉంటుంది’ అని ప్రకటించాడు. యూపీలోని ఘజియాబాద్‌లో ముస్లింల నుంచి ముప్పు ఉన్నదంటూ హిందువులకు రక్షణ పేరుతో ఖడ్గాలు పంపిణీ చేసినందుకు సదరు వ్యక్తి అరెస్టయ్యాడు. హిందూ రక్షాదళ్‌కు చెందిన ఈ వ్యక్తిపై ఇప్పటికే అనేక క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. అలాంటి వ్యక్తి పైన చెప్పినట్టుగా నినాదాలు ఇవ్వటం వెనుక ఒక వర్గం పట్ల ద్వేష భావన, మతన్మోదాన్ని అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు.

జై శ్రీ రామ్‌, గోరక్షణ పేరుతో దాడులు
‘జై శ్రీ రామ్‌’, ‘గో రక్షణ’ వంటి నినాదాలతో దేశంలో పేద ముస్లింలను మూక హత్యలు చేయటం మోడీ పాలనలో నిత్యకృత్యమయ్యాయి. ఢిల్లీలో జరిగిన వరల్డ్‌ బుక్‌ ఫెయిర్‌లో ప్రధాని మోడీ విద్య ప్రాముఖ్యతపై ఇచ్చిన సందేశాలతో హౌర్డింగ్‌లు దర్శనమిచ్చాయి. ”ప్రజలు చదివితే దేశం అభివృద్ధి చెందుతుంది” అన్నది ఆ సందేశం సారాంశం. అయితే, నోటిలో అశ్లీల దూషణలు, చేతుల్లో ఖడ్గాలతో తిరిగే యువకులే దేశ నిర్మాణానికి అవసరమని మోడీ ఎక్కడా చెప్పలేదు. నేటి భారత్‌లో నిజంగా హిందువులకు ముస్లింల నుంచి రక్షణ అవసరమైతే.. ప్రభుత్వం పుస్తక ప్రదర్శనలు రద్దు చేసి, ఖడ్గాలు, కత్తులు, త్రిశూలాలు అమ్మే స్టాళ్లను ఏర్పాటు చేయాల్సి వచ్చేదని విశ్లేషకులు చెప్తున్నారు.

ప్రజాప్రతినిధుల ద్వేషపూరిత ప్రసంగాలు
లౌకిక భారతదేశంలో మతం పేరిట రాజకీయాలు చేయటం ఒక తిరోగమన చర్యకు నిదర్శనం. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీ… కేంద్రంలో, రాష్ట్రాల్లో చేస్తున్న రాజకీయాలు మాత్రం మతం ఆధారంగానే జరుగుతున్నాయని మేధావులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ నాయకులు చేసే ప్రసంగాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తూ ప్రధాని మోడీ గత లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లింలను పరోక్షంగా టార్గెట్‌ చేసుకుంటూ ప్రసంగించారు. మోడీ వ్యాఖ్యలపై ఆ సమయంలో అన్ని వర్గాల నుంచి వ్యతిరేకతనే వచ్చింది. కానీ బీజేపీ నాయకులు, ఆ పార్టీ నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారు మాత్రం మోడీ బాటలోనే పయనిస్తున్నారు. ద్వేషపూరిత ప్రసంగాలను చేస్తూ ప్రశాంతంగా ఉంటున్న సమాజంలో చిచ్చు రేపుతున్నారు.

స్కిల్‌ ఇండియా స్కాం సంగతేంటీ?
దేశంలో మోడీ సర్కారు వైఫల్యాల గురించి ఆశించినంత, తగినంత చర్చ జరగటం లేదు. గతేడాది హర్యానా ఓటర్ల జాబితాలో బ్రెజిలియన్‌ మోడల్‌ ఫొటో కనిపించిన విషయం అంతలోనే కనుమరుగైంది. ఇక కరోనా సమయంలో యూపీ నదీ తీరాల్లో బయపపడిన మృతదేహాలు, వందల కిలోమీటర్ల దూరం నడిచిన వలస కార్మికుల బాధలు, అమెరికా నుంచి గొలుసుతో వెనక్కి పంపబడిన భారతీయుల అవమానం.. ఇవన్నీ ఎలాంటి చర్చా లేకుండానే ముగిసిన అంకాలుగా మారుతున్నాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరీ ముఖ్యంగా కేంద్రంలోని మోడీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కిల్‌ ఇండియా పథకంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌).. మోడీ ప్రభుత్వంలోని భారీ దోపిడీని బహిర్గం చేసింది. ”నేను తినను, తిననివ్వను” అంటూ అవినీతిపై మోడీ చెప్పే మాటలకు అసలైన అర్థం ఇదేనా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ‘స్కిల్‌ ఇండియా’లో భాగంగా మధ్యప్రదేశ్‌లోని కట్నీ, కేరళలోని కొల్లం, మహారాష్ట్రలోని ముంబయితో పాటు వేర్వేరు రాష్ట్రాల్లో జరిగిన శిక్షణ కార్యక్రమాలకు ఒకే ఫొటోను ఆధారంగా చూపారు. ఫొటోలను జూమ్‌ చేసి, క్రాప్‌ చేసి మోసం చేశారు. నకిలీ బ్యాంకు ఖాతాలు, చిరునామాలు, వేలాది లబ్దిదారుల పేర్లతో రూ.10వేల కోట్లకు పైగా నిధులను దోచుకున్నారు. రెండు నుంచి పది మంది ఉద్యోగులున్న సంస్థలు 30-40 వేల మందికి సర్టిఫికెట్టు ఇచ్చినట్టు చూపించారు. ఒకే అధికారి ఒకే రోజు ఏడు రాష్ట్రాల్లో తనిఖీ చేసినట్టు రికార్డులు చూపుతుండటం గమనార్హం.

బీజేపీ ఎమ్మెల్యే వీడియో వైరల్‌
ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియోలో ఒక బీజేపీ ఎమ్మెల్యే.. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సల్మాన్‌ ఖాన్‌ను ఉద్దేశిస్తూ దొంగ, దోపిడీదారు, దేశద్రోహి అంటూ తీవ్రంగా దూషించాడు. ముస్లింలను, పాకిస్తాన్‌ను మాత్రమే ప్రేమిస్తాడనీ, ఆయనకు ఉరిశిక్ష వేయాలని సదరు బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించాడు. అయితే సల్మాన్‌ ఖాన్‌.. ప్రధాని మోడీకి సన్నిహితుడని అక్కడ ఎవరో గుర్తు చేయగానే సదరు బీజేపీ ఎమ్మెల్యే తన టార్గెట్‌ను బాలీవుడ్‌కు చెందిన మరో ప్రముఖ నటుడు షారుఖ్‌ ఖాన్‌కు మార్చాడు. సల్మాన్‌ కాకపోతే షారుఖ్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌, మహ్మద్‌ సిరాజ్‌.. ఇలా నాయకుల ద్వేషపూరిత ప్రసంగాల టార్గెట్‌ మారుతుందే తప్పితే ‘ఒక వర్గం’ మీద వారి చూపు, ఆలోచన మాత్రం మారదని మేధావులు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -