తగ్గిన వేతనాలు
భగ్గుమంటున్న ఆహార ధరలు
కొంపముంచిన అమెరికా డాలర్
కారకాస్ : అమెరికా సైన్యం వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను అపహరించిన తర్వాత అక్కడ రాజకీయ, ఆర్థిక అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో వెనిజులా ప్రజలు ఆహార కొరతను ఎదుర్కోవాల్సి వస్తోంది. మరోవైపు కార్మికుల వేతనాలు తగ్గిపోతుండడంతో పరిస్థితి దుర్భరంగా మారింది.
అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల కారణంగా వెనిజులాలో 70 శాతానికి పైగా ప్రజలు చాలా కాలంగా పేదరికంలో మగ్గిపోతున్నారు. అనేక ప్రాంతాలలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. తాజాగా అమెరికా జరిపిన దాడితో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. అమెరికా డాలర్‌పై వెనిజులా ఆధారపడుతుండడంతో ఆహార ధరలు బాగా పెరిగిపోయాయి. వెనిజులాలో రోజువారీ లావాదేవీలలో ఎక్కువగా అమెరికా డాలర్‌నే ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే దానికి వెనిజులా కరెన్సీ బొలివర్ కంటే స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది.
అంతా డాలర్లలోనే…
ఒకప్పుడు లాటిన్ అమెరికాలో సంపన్న దేశంగా నిలిచిన వెనిజులా 2019లో అమెరికా ఆంక్షల కారణంగా పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. మెజారిటీ ప్రజలు అమెరికా డాలర్లలోనే పొదుపు చేయడం, ఖర్చు చేయడం, వసూలు చేయడం జరుగుతోంది. దీంతో నేడు వెనిజులా ప్రజలు తమ రోజువారీ ఖర్చుల కోసం అమెరికా డాలర్ పైనే ఆధారపడాల్సి వస్తోంది. వ్యాపారులు డాలర్లలోనే సరఫరాదారుల నుంచి వస్తువులు కొంటుంటారు. కొనుగోలుదారులు వెనిజులా కరెన్సీలో చెల్లింపులు జరపాలని అనుకుంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు.
ఆంక్షలతో తగ్గిన డాలర్ల చెలామణి
గత సంవత్సర కాలంగా అమెరికా విధిస్తున్న ఆంక్షల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో వెనిజులా పెద్దగా చమురును విక్రయించలేకపోతోంది. దీంతో దాని ఆర్థిక వ్యవస్థలో డాలర్ల చెలామణి తగ్గిపోయింది. ఫలితంగా కరెన్సీకి విలువ పెరిగింది. వెనిజులా ఆర్థిక భవితవ్యంపై వ్యక్తమవుతున్న ఆందోళన కారణంగా డాలర్ విలువ పెరిగింది. మాంసం, జున్ను, పాలు వంటి ఆహార పదార్థాల స్థానిక ధరలు రెట్టింపయ్యాయి. వెనిజులా కేంద్ర బ్యాంక్ అధికారిక మార్పిడి రేటును నిర్ణయించినప్పటికీ ప్రజలు అనధికారిక ‘సమాంతర డాలర్’ రేటు పైనే ఆధారపడుతున్నారు. గత వారంలో అనధికారిక డాలర్ రేటు అధికారిక రేటు కంటే రెండు రెట్లు పెరిగింది. ఆ తర్వాత కొంత స్థిరపడినప్పటికీ అధికారిక రేటు కంటే ఎక్కువగానే ఉంది.
పడిపోతున్న కొనుగోలు శక్తి
ధరల పెరుగుదల కారణంగా నెలవారీ సరుకుల పరిమాణంలో కోత విధించుకోవాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. అయినప్పటికీ కనీస అవసరాలు కూడా తీరడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కారకాస్‌లోని ఒక ప్రముఖ మున్సిపల్ మార్కెట్‌లో వ్యాపారులు కొనుగోలుదారులకు డాలర్లలో ధరలను చెబుతూ తీరా కొనుగోలు చేసిన తర్వాత బొలివర్ల రూపంలో తీసుకుంటున్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి రానురానూ పడిపోతోంది. ప్రజలు ఇప్పుడు కేవలం నిత్యావసరాల పైనే ఖర్చు చేస్తున్నారు. గతంలో కిలో జున్ను కొనుగోలు చేసిన వారు ఇప్పుడు అర కిలోతో సరిపెట్టుకుంటున్నారు.
వెనిజులాలో అదుపు తప్పిన ద్రవ్యోల్బణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



