Saturday, May 24, 2025
Homeప్రధాన వార్తలు'మనబడి'ని కాపాడుకుందాం

‘మనబడి’ని కాపాడుకుందాం

- Advertisement -

– ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించాలి నవతెలంగాణతో టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి
– పిల్లల నమోదును పెంచేందుకు రేపటినుంచి ప్రచారజాతా
– సర్కారు స్కూళ్ల ఔన్నత్యాన్ని ప్రజలకు వివరిస్తాం
– ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలి
– హక్కుల కోసం పోరాటమే కాదు సామాజిక బాధ్యతనూ నిర్వర్తించాలి
– ప్రభుత్వ పాఠశాలలను సెమీ గురుకులాలుగా మార్చాలి

మన (ప్రభుత్వ) బడిని కాపాడుకుందామని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షులు చావ రవి పిలుపునిచ్చారు. ప్రభుత్వ బడులను పరిరక్షించుకుంటేనే విద్యార్థులందరికీ నాణ్యమైన, సమానమైన విద్య అందుతుందని చెప్పారు. ఉపాధ్యాయులు హక్కులు, వేతనాలు, డీఏల కోసం పోరాటాలు చేయడమే కాకుండా సామాజిక బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదును పెంచడం కోసమే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ప్రచార జాతాను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరా రు. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రభుత్వ విద్యారంగాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పాఠశాలలను సెమీగురుకులాలుగా మార్చాలని కోరారు. సర్కారు బడుల్లో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. విద్యారంగానికి బడ్జెట్‌ను పెంచి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చాలనీ, నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సూచించారు. ఈనెల 25 (ఆదివారం) నుంచి టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రచారజాతా సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు చావ రవి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు…
ఒక ఉపాధ్యాయ సంఘంగా ప్రచార జాతా ఎందుకు చేపడుతున్నారు? దాని ఉద్దేశమేంటీ?
సామాజిక బాధ్యత కలిగిన ఉపాధ్యాయ సంఘంగా విద్యార్థులకు చదువు చెప్పడం వరకే పరిమితం కాకుండా ప్రభుత్వ బడిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది. విద్యార్థుల నమోదును పెంచే బాధ్యతను కూడా తీసుకుంటున్నది. సామాజిక బాధ్యతను నిర్వర్తించడంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఏటా విద్యార్థుల నమోదుకు ప్రయత్నం చేస్తున్నాం. ఈనెల 25 నుంచి ప్రచారజాతా చేపడుతున్నాం. అందులో ఉపాధ్యాయులు కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. జిల్లాల్లో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ పాఠశాలల ఔన్నత్యాన్ని గ్రామాల్లోని ప్రజలు, తల్లిదండ్రులకు వివరిస్తున్నాం. సర్కారు బడి, వసతులు, ఉపాధ్యాయుల ప్రత్యేకత గురించి రాసిన పాటలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా కృషి చేస్తాం.
ఈ ప్రచారజాతా ఎలా కొనసాగుతుంది. ప్రజలను ఎలా కలుస్తారు? మీ ప్రణాళిక ఏంటీ?
జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈ ప్రచార జాతా జరుగుతుంది. రెండు, మూడు మండలాలకు కలిపి ఒక వాహనం ఉంటుంది. కార్యకర్తలు ఊరూరా వెళ్లి ప్రజలను కలుస్తారు. ప్రభుత్వ బడుల ఔన్నత్యాన్ని తెలిపే పాటల క్యాసెట్‌ ఉంటుంది. స్థానిక ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి పిల్లలు, తల్లిదండ్రులను కలుస్తారు. యూటీఎఫ్‌ కార్యకర్తలు ఊరూరా తిరిగి ప్రచారం చేస్తారు. నాణ్యమైన విద్య, ప్రభుత్వ స్కూళ్ల గొప్పతనం గురించి అవగాహన కల్పిస్తారు. పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని కోరతాం. మాకు ఒక సక్సెస్‌ స్టోరీ ఉన్నది. 2016లో మేం విద్యాయాత్ర చేపట్టాం. 18 రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో నిర్వహించాం. ఇంగ్లీష్‌ మాధ్యమం ప్రవేశ పెట్టాలనీ, ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించాలనీ, తరగతి గదికో టీచర్‌ ఉండాలని కోరాం. ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇంగ్లీష్‌ మాధ్యమం పెట్టేందుకు ఉపాధ్యాయులు ముందుకొచ్చారు. 2016-17 విద్యాసంవత్సరంలో ఐదు వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మాధ్యమం ప్రారంభమైంది. ఇప్పుడు అదే పద్ధతిలో ప్రచారజాతా జరుగుతుంది. సంఘం ప్రధాన బాధ్యులు జిల్లాల్లో పాల్గొంటారు.
ప్రభుత్వ బడుల్లో పిల్లల సంఖ్య ఏటా తగ్గడానికి కారణమేంటీ?
మూడేండ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతున్నది. విద్యార్థుల్లేక ప్రభుత్వ బడులు మూతపడుతున్నాయి. ప్రయివేటు స్కూళ్లలో మూడేండ్లు నిండిన పిల్లలు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చదువుతున్నారు. కానీ ప్రభుత్వ బడుల్లో ఐదేండ్లు నిండితేనే ఒకటో తరగతిలో చేర్పించాలి. తల్లిదండ్రులు మూడేండ్లు నిండిన పిల్లలను బడిలో చేర్పించాలని భావిస్తున్నారు. ప్రయివేటు స్కూళ్లలోనే ఆ అవకాశం ఉన్నది. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ప్రయివేటులో చదివిన తర్వాత ఒకటో తరగతి కూడా అక్కడే చదువుతున్నారు. తిరిగి ప్రభుత్వ బడిలో చేరడానికి ఆసక్తి చూపడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాలున్నా వాటిని ప్రీస్కూల్‌, ప్లేస్కూల్‌గా తల్లిదండ్రులు భావించడం లేదు. అంగన్‌వాడీల్లో పేర్లు నమోదు చేసుకున్నా పిల్లలు మాత్రం ప్రయివేటు స్కూళ్లలో ఉంటారు. 2024-25 విద్యాసంవత్సరంలో 1.27 లక్షల మంది ఒకటో తరగతిలో చేరారు. ఇందులో ప్రయివేటు స్కూళ్లలో లక్ష మంది చేరితే ప్రభుత్వ బడుల్లో 27 వేల మంది చేరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించాలి. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి.
ప్రభుత్వ విద్యారంగం బలహీనం కావడానికి ప్రభుత్వ విధానాలు ఎలా ప్రభావం చూపుతున్నాయి?
పదేండ్లపాటు బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రభుత్వ విద్యారంగాన్ని గాలికొదిలేసింది. గురుకులాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది. ఉపాధ్యాయ నియామకాలను సకాలంలో చేపట్టలేదు. టీచర్ల కొరతతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. పర్యవేక్షణ అధికారుల్లేక ఇబ్బందులు వచ్చాయి. మౌలిక వసతుల కొరత ఉన్నది. కొంతమంది టీచర్లలో జవాబుదారీతనం లోపించింది. ఇంకోవైపు విద్యారంగానికి బడ్జెట్‌ ఏటా తగ్గుతున్నది. ఉమ్మడి ఏపీలో చివరి బడ్జెట్‌లో విద్యకు 14 శాతం కేటాయిస్తే ఇప్పుడు 7.5 శాతానికి వచ్చింది. కాంగ్రెస్‌ వచ్చాక ఉపాధ్యాయ నియామకాలను చేపట్టింది. జీహెచ్‌ఎంలకు ఇన్‌చార్జీ ఎంఈవోలుగా బాధ్యతలు అప్పగించింది. మౌలిక వసతుల కల్పన కోసం ప్రయత్నం జరిగింది. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలతోపాటు యూనిఫారాలను ఇస్తున్నారు. ఇది పేద పిల్లల కోసం ఉన్న బడి అని కాకుండా ప్రజలందరి కోసం ఉన్న బడి అని భావించాలి. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నది. విద్యార్థులందరికీ నాణ్యమైన, సమానమైన విద్య అందుతుంది. సామాజిక బాధ్యత కలిగిన ఉపాధ్యాయ సంఘం టీఎస్‌యూటీఎఫ్‌ కార్యకర్తలకు అదే పిలుపునిస్తున్నాం. విద్యార్థుల నమోదును పెంచడం కోసం ఈ ప్రచార జాతాలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరుతున్నాం.
ప్రభుత్వ స్కూళ్ల పట్ల తల్లిదండ్రుల్లో విశ్వాసం లేదు కదా? ఎందుకంటారు?
రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కొరత, ఇతర సమస్యల కారణంగా తల్లిదండ్రుల్లో విశ్వాసం లేదు. అందుకే ప్రయివేటు స్కూళ్లలో పిల్లలను చేర్పించాలని భావిస్తున్నారు. దాన్ని ఆసరాగా తీసుకుని ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టమొచ్చినట్టు ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ లేదు. ఫీజుల దోపిడీ కొనసాగుతున్నది. తల్లిదండ్రుల సంపాదనలో 60 శాతం ఫీజుల కోసం ఖర్చు చేస్తున్నారు. పిల్లలందరికీ నాణ్యమైన, సమానమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలను ప్రభుత్వం నియంత్రించడం లేదు. ఇంకోవైపు ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల్లో విశ్వాసం కల్పించడం లేదు. పిల్లలే లేనపుడు ఉపాధ్యాయులెందుకు అని ప్రభుత్వం అంటున్నది. బడి, అందులో ఉపాధ్యాయుడు ఉంటే పిల్లలు వస్తారని సంఘాలుగా మేం చెప్తున్నాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే బాధ్యత మాది అని కొందరు ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వ బడులను కాపాడుకోవాలన్న అబి óప్రాయం టీచర్లలో ఉన్నది. ఇది మనబడి. కొందరు ఉపాధ్యాయులు ఎన్‌రోల్‌ క్యాంపెయిన్‌ చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టే బడిబాట యాంత్రికంగా జరుగుతుంది. టీఎస్‌యూటీఫ్‌గా చేపట్టే ఈ ప్రచారజాతాలో వేలాది మంది ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా భాగస్వాములై విద్యార్థుల నమోదును పెంచేందుకు కృషి చేయాలి. బడిబాట వచ్చేనెల 6న ప్రారంభమవుతుంది. ఈ ప్రచారజాతా ఈనెల 25 నుంచి వచ్చేనెల ఐదో తేదీ వరకు నిర్వహిస్తాం.
ఉపాధ్యాయుల పిల్లలు కూడా ప్రభుత్వ బడుల్లో చేర్పించాలన్న అభిప్రాయంపై ఏమంటారు?
ఉపాధ్యాయుల పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదివితే బాగుంటుంది. అయితే ఉపాధ్యాయులు కూడా సమాజంలో భాగమే. మిగిలిన వారి పిల్లలను వారి స్థాయిని బట్టి ప్రయివేటు, కార్పొరేట్‌, అంతర్జాతీయ స్కూళ్లలో చదివిస్తున్నారు. ఉపాధ్యాయులు మాత్రమే వారి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించాలన్న అభిప్రాయం సరైంది కాదు. అందరి పిల్లలు ప్రభుత్వ బడిలో చదివి ఉపాధ్యాయులు వారి పిల్లలను చదివించకపోతే తప్పవుతుంది. కానీ ఇతరులంతా వారి పిల్లలను ఎక్కడెక్కడో చదివించుకుని టీచర్లు మాత్రమే వారి పిల్లలను చదివించాలనడం అన్యాయం అవుతుంది. ఉపాధ్యాయులతో పాటు గ్రామాల్లోని వార్డు మెంబర్‌ నుంచి మంత్రి, ఐఏఎస్‌ అధికారి వరకు ప్రభుత్వ బడిలో వారి పిల్లలను చదివించాలి. అందులో ఉపాధ్యాయుల పిల్లలు కూడా ఉంటారు. గతంలో ప్రయివేటు స్కూళ్లు లేనపుడు గ్రామంలో ఉండేవారంతా ప్రభుత్వ బడుల్లోనే చదివించే వారు.
ప్రచార జాతా సందర్భంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మీరిచ్చే సందేశమేంటీ?
సమాజంలోని ప్రజలంతా ప్రభుత్వ పాఠశాలలను వినియోగించుకోవాలి. వాటిని కాపాడుకోవాలి. ప్రీప్రైమరీ తరగతులను ప్రభుత్వం ప్రారంభించాలి. ప్రభుత్వ పాఠశాలలను సెమీ గురుకులాలుగా మార్చాలి. మౌలిక వసతులను మెరుగుపర్చాలి. ఈ బడి మనది, బాధ్యత మనది, దాన్ని కాపాడుకుందాం అన్న లక్ష్యంతో ప్రచార జాతా నిర్వహిస్తున్నాం. గ్రామంలో గుడికోసం ప్రజలంతా ఒక్కటవుతారు. ప్రభుత్వ బడిని కాపాడుకోవడానికీ, పిల్లలను చేర్పించడానికి ఒక్కటి కావాలి. గ్రామంలో ఉండేవారంతా ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పిస్తే ఉపాధ్యాయులను కూడా అడిగే అవకాశం ఉంటుంది.
ఉపాధ్యాయులు వేతనాలు, డీఏలు, హక్కుల కోసమే పోరాటం చేస్తారు తప్ప ప్రభుత్వ బడుల గురించి పట్టించుకోరన్న అభిప్రాయం ఉన్నది. దీనిపై ఏమంటారు?
ఉపాధ్యాయులు వేతనాలు, డీఏలు, హక్కులు, సర్వీసు అంశాల కోసమే మాట్లాడతారన్న అభిప్రాయమున్నది. చదువు గురించి, బడుల గురించి పట్టించుకోరన్నది వాస్తవం కాదు. యూటీఎఫ్‌ గతంలో, ఇప్పుడు సామాజిక బాధ్యత కలిగిన ఉపాధ్యాయ సంఘంగా ఉన్నది. అందుకే విద్యార్థుల నమోదును పెంచడం కోసం ప్రచారజాతాను చేపడుతున్నాం. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. ఈ కృషిలో విజయవంతమవుతాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -