Saturday, May 24, 2025
Homeప్రధాన వార్తలురాష్ట్రంలో తొలి కరోనా కేసు

రాష్ట్రంలో తొలి కరోనా కేసు

- Advertisement -

కూకట్‌పల్లిలో డాక్టర్‌కు కోవిడ్‌ పాజిటివ్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో/కూకట్‌పల్లి

రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. మేడ్చల్‌ -మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలోని వివేకా నంద నగర్‌కు చెందిన ఓ వైద్యునికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు అధికా రులు ధ్రువీకరించారు. కూకట్‌పల్లిలోని ఓ ప్రయివేటు హాస్పిటల్‌లో పల్మనాలజిస్ట్‌ (శ్వాసకోస డాక్టర్‌)గా పని చేస్తున్న ఆ డాక్టర్‌ నిత్యం రోగులకు ఓపీ చూస్తుండేవారు. ఈ సమయంలో రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో అనుమానం వచ్చి ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయగా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డార్టర్‌ సి.ఉమాగౌరీ అధికారికంగా ధ్రువీకరించారు. కాగా ఆ వైద్యుడు ఐదు రోజులుగా కోవిడ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేయగా.. ఇప్పటి వరకు వాళ్ల కుటుంబ సభ్యులు, ఇతరుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. ప్రస్తుతం ఆ వైద్యునికి ఎలాంటి లక్షణాలు లేవు. పూర్తిగా కోలుకున్నారు. నియంత్రణా చర్యలు పాటించాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వైద్య అధికారుల పర్యవేక్షణలో ఉన్నారు.
లక్షణాలు కనిపిస్తే వెంటనే తెలపాలి : డీఎంఅండ్‌హెచ్‌ఓ ఉమాగౌరీ
ఎవరికైనా జ్వరం లేదా కోవిడ్‌ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యారోగ్య శాఖకు తెలియజేయాలని మేడ్చల్‌-మల్కాజిగిరి డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ ఉమాగౌరీ సూచించారు. భయపడాల్సిన అవసరం లేదని, పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని తెలిపారు. తమ సిబ్బంది ఏ పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ, పల్లె దవాఖానాలను సంప్రదించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -