– వ్యవసాయ విద్యుత్ కు మీటర్ – రైతుకు ఉరే
– ఫిబ్రవరి 12 న తలపెట్టే అఖిలభారత సమ్మె ను జయప్రదం చేయండి
– వ్యవసాయ కార్మిక సంఘ జాతీయ కార్యదర్శి బీ. వెంకట్
నవతెలంగాణ – అశ్వారావుపేట
నరేంద్ర మోడీ నేతృత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని మార్చి తనకు అనుకూలం అయిన పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చి పధకాన్ని, విధివిధానాలను రూపొందించడం పేదలకు నష్టం చేకూర్చే విధంగా వారి ఉపాధి హరణం చేయడం కూలీనాలి రెక్కలు నమ్ముకుని బతికే వారికి మరణం లాంటిదే నని వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు.
ఫిబ్రవరి 12 న రైతు, వ్యవసాయ, సీఐటీయూ లు సంయుక్తంగా తలపెట్టిన జాతీయ సమ్మెను విజయవంతం చేయడానికి నిర్వహించే కార్యక్రమాలు పరిశీలించేందుకు బుధవారం అశ్వారావుపేట వచ్చిన ఆయన స్థానిక సీపీఐ(ఎం), అనుబంధ ప్రజాసంఘాల కార్యాలయంలో విలేఖర్లతో ఆయన మాట్లాడారు.
ఎన్నో పోరాటాలు చేసి రూపొందించుకున్న చట్టాలను, హక్కులను కాల రాసి, కోడ్ లు చేయడం అంటే కార్మికులను పారిశ్రామిక వేత్తలకు బానిసలను చేయడమేనని ఆయన వాపోయారు. బీజేపీ కంటే ముందు ప్రభుత్వాలు పేదలు, కార్మికుల చట్టాలు, హక్కులను కనీసం గుర్తించాయని, కానీ మోడీ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తుందని అన్నారు.
ఉపాధి పధకం మార్పు, సీడ్ చట్టం, విద్యుత్ సవరణలు నేడు దేశ ప్రజానీకానికి సవాల్ గా మారాయి అని అన్నారు. ఉపాధి హామీ పథకంతో ఇప్పటి వరకు రూ. 9 లక్షల 98 వేలు కోట్లతో 4 వేల 7 వందల కోట్ల పనిదినాలు కల్పించి రూ.15 లక్షల కోట్ల ఆస్తులను ప్రజలకు అంకితం చేసారని, నేడు మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడిదారులకు ఉపాధిగా మార్చే పనిలో ఉందని అన్నారు.
నాడు బ్రిటీష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో భారత దేశాన్ని దోచుకుంటే నేడు స్వదేశీ పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు స్వదేశీ పాలకులు సహకారంతో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని అన్నారు. నేడు ఆర్ధిక, పారిశ్రామిక, రాజకీయ నేతలు నయా వలస పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వాన్ని ప్రతిఘటించడం కోసమే తలపెట్టిన ఫిబ్రవరి 12 జాతీయ సమ్మె ను విజయవంతం చేయాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బి.చిరంజీవిలు పాల్గొన్నారు.



