Saturday, May 24, 2025
Homeప్రధాన వార్తలుకాళేశ్వరంలో అక్రమాలు

కాళేశ్వరంలో అక్రమాలు

- Advertisement -

– తేల్చేందుకే జ్యుడీషియల్‌ కమిషన్‌
– నోటీసులు ఇవ్వగానే ఉలుకెందుకు ? : బీఆర్‌ఎస్‌పై మంత్రి ఉత్తమ్‌ విమర్శ
– వాదనలు చెప్పుకోవాలని హితవు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

కాళేశ్వరంలో అక్రమాలు తేల్చడానికే గొప్ప పేరున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్ర వారం హైదరాబాద్‌లోని సచివాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏ తప్పు చేయకపోతే నోటీసు ఇవ్వగానే అంత ఉలుకు ఎందుకని మంత్రి ప్రశ్నించారు. న్యాయ విచారణ కమిషన్‌ను తప్పుపడుతూ మాట్లాడటం సరికాదనీ, ఇందిరాగాంధీ లాంటి వాళ్లే కమిషన్‌ ముందు విచారణకు హాజరయ్యారని గుర్తు చేశారు. ప్రాజెక్టులోని అవినీతి, అవకతవకల నిగ్గు తేల్చడానికి, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు జ్యుడీషియల్‌ కమిషన్‌ నియమించామని చెప్పారు. ”బాంబులు వేశారని చెబుతున్నారనీ, అప్పుడు మీరే ప్రభుత్వంలో ఉన్నారు. మేడిగడ్డపై బాంబులు వేస్తే అప్పుడు ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు పేర్కొనలేదు. ఇప్పుడు కమిషన్‌ ముందు కూడా ఆ విషయం చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టును తెల్ల ఏనుగుతో పోల్చుతూ కాగ్‌ నివేదికలో పేర్కొంది. బీఆర్‌ఎస్‌ నేతలు జేబులు నింపుకునేందుకే మేడిగడ్డ ప్రాజెక్టు ప్రాంతాన్ని మార్చారు. డీపీఆర్‌లో పేర్కొన్న ప్రదేశం కాకుండా మరోచోట ప్రాజెక్టు నిర్మించారు. నాలుగురెట్లు ఖర్చును పెంచిన ఈ ప్రాజెక్టులో అదనపు ఆయకట్టు నామమాత్రంగానే పెరిగింది. కాళేశ్వరం తెల్ల ఏనుగుగా మారబోతోందని కేంద్ర సంస్థలు చెప్పాయి. బీఆర్‌ఎస్‌ ఎంపీల మద్దతుతోనే ఎన్డీఎస్‌ఏ చట్టం వచ్చింది. కాళేశ్వరం డీపీఆర్‌, రీడిజైన్‌, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని కూడా ఆ సంస్థే చెప్పింది. ప్రాజెక్టును పున:వినియోగంలోకి తేవడంపై మేం చాలా అధ్యయనం చేస్తున్నాం. ప్రాజెక్టు పునాదుల్లోనే ఎన్నో లోపాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కూలిపోయిన ప్రాజెక్టును అద్భుతమని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. జ్యుడీషియల్‌ కమిషన్‌ ముందు హాజరై వాళ్ల వాదన ఏంటో వినిపించాలి” అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నోటీసులకు బీఆర్‌ఎస్‌ నాయకులు వణికిపోయి వికృత, వికార చేష్టలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు వ్యయం రూ.84 వేల కోట్లతో ప్రారంభించి రూ. 1.20 లక్షల కోట్లకు చేర్చారని కాగ్‌ చెప్పిందని అభిప్రాయపడ్డారు. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని తప్పుడు ప్రచారం చేసి ప్రాజెక్టు ప్రాంతాలను మార్చారని విమర్శించారు. ఎన్డీఎస్‌ఏపై విమర్శలు చేసినందుకు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. రూ. 38 వేల కోట్లతో పూర్తయ్యే తుమ్మిడిహెట్టిని వదిలేసి రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు పెట్టిన డబ్బుతో ఎస్‌ఎల్‌బీసీ, సీతారాంసాగర్‌, దిండి ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు. అసలు ప్రాజెక్టు ఫౌండేషన్‌లో తప్పులు జరిగాయని నిపుణులు చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు. తప్పు చేయకపోతే కమిషన్‌ ముందు హాజరుకావాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -