అందుకోసం కేంద్రంతో కలిసి పని చేస్తాం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరం
మెదక్ పేరు తలచుకుంటే ఇందిరాగాంధీ గుర్తుకొస్తారు
సంగారెడ్డి, జహీరాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
నిమ్జ్ బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు : సీఎం రేవంత్
నవతెలంగాణ-జహీరాబాద్
”ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయి. మిగతా సమయంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తాం. అందుకోసం ప్రధాని మోడీని ఒక్కసారి కాదు 50 సార్లు అయినా కలుస్తాం. దీనిపై ఎవరేం అనుకున్నా మాకు ఇబ్బంది లేదు. అభివృద్ధి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల మధ్య సమన్వయం అవసరం. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధికి కేంద్ర సాయాన్ని కోరతాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, జహీరా బాద్ పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొ న్నారు. జహీరాబాద్ నియోజకవర్గం లో రూ.100 కోట్లతో నిర్మించిన 9 కిలోమీటర్ల గ్రీన్ కారిడార్ నిమ్జ్ రోడ్డు, రూ.100 కోట్లతో జహీరాబాద్ పట్టణంలో నిర్మించిన రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించారు. చిరాగ్‌పల్లి-ఇప్పపల్లి గ్రామాల మధ్య రూ.20 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. మెప్మా పథకం కింద రూ.18 కోట్ల విలువ చేసే చెక్కులను ఆయా సంఘాలకు అందజేశారు. రూ. 126 కోట్ల బ్యాంక్ లింకేజీలను కూడా వివిధ మహిళా సంఘాలకు అందించారు. అనంతరం పస్తాపూర్ వద్ద జరిగిన బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ.. 1984లో ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికైన ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టినట్టు గుర్తు చేశారు. మెదక్ జిల్లా అంటే ఇందిరమ్మ.. ఇందిరమ్మ అంటే మెదక్ జిల్లా.. గుర్తుకు వస్తుందని అన్నారు. ఈ ప్రాంతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందన్నారు. 2014లో నిమ్జ్‌ను తమ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని, రాష్ట్ర విభజన అనంతరం వచ్చిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నేటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు. నిమ్జ్ భూ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నిమ్జ్‌లో మొత్తం 5612 కుటుంబాలు భూములు కోల్పోయాయని, వారందరికీ వారు కోరుకున్న చోట ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆ కుటుంబాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించి, అందరికీ ఇండ్ల పట్టాలు అందించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. అందుకోసం తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలో నాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఇక్రిశాట్ లాంటి పరిశ్రమలు వచ్చాయని, నేడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే నిమ్జ్ వచ్చినట్టు చెప్పారు. ఆటోమొబైల్ ఇండిస్టీలు తీసుకువచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు. నిమ్జ్‌లో హుందారు సంస్థకు 450 ఎకరాలు కేటాయించామని, త్వరలోనే కార్ల ఉత్పత్తిని ప్రారంభిస్తారని అన్నారు. గేట్ వే ఆఫ్ ఇండిస్టీగా జహీరాబాద్ ఉంటుందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజురు చేస్తామన్నారు. నారాయణఖేడ్ అభివృద్ధికి ప్రత్యేక సమావేశం నిర్వహించి అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. సింగూరును ఎకో టూరిజంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
అన్ని వర్గాలకు న్యాయం.. నిండు మనసుతో దీవించండి
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడానికి కృషి చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వాన్ని నిండు మనసుతో దీవించాలని అన్నారు. యువత, నిరుద్యోగులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రయివేటు సంస్థల్లో లక్ష ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. రూ.మూడు లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను తీసుకువచ్చి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్టు చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెంచి, ఆ ఆదాయాన్ని పేదలకు పంచాలన్నదే తమ ఉద్దేశమన్నారు. లక్ష మిలియన్ ఎకనామీ సాధించడం, కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాబోయే రోజుల్లో నిత్యావసర సరుకుల పంపిణీ కూడా మహిళలకే అప్పగించనున్నట్టు తెలిపారు. కుటుంబంలో ఒక మహిళ చదువుకుంటే.. ఆ కుటుంబం మొత్తం విద్యావంతులుగా మారే ఆస్కారం ఉందన్నారు.. హైదరాబాద్‌ను న్యూయార్క్‌లా తీర్చిదిద్దుతామన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, మదన్‌మోహన్, లక్ష్మీకాంత్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర సలహాదారు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సెట్విన్ చైర్మెన్ గిరిధర్ రెడ్డి, టీఎస్ ఐడీసీ చైర్మెన్ నిర్మల జగ్గారెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్ మహమ్మద్ సహిం, మాజీ టీఎస్‌ఐడీసీ చైర్మెన్ మహమ్మద్ తన్వీర్, డీసీఎంఎస్ చైర్మెన్ శివకుమార్, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.
కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించిన సీఎం
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మచ్నూర్ గ్రామ సమీపంలో రూ.26 కోట్లతో నిర్మించిన నూతన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రీయ విద్యాలయ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కరచాలనం చేశారు. విద్యాలయ ఎన్‌సీసీ విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు.
అధికారంలో లేకపోయినా ప్రజల్లోనే..
అధికారంలో ఉన్నప్పుడే కాదు.. అధికారంలో లేకపోయినా ప్రజల్లో ఉండాలి. నేను జెడ్పీటీసీ నుంచి అనేక పదవుల్లో పనిచేశాను. అధికారంలో లేకపోయినా ప్రజల్లోనే ఉన్నాను. మాజీ సీఎం కేసీఆర్ అధికారం పోగానే ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. కేసీఆర్ తన 40 ఏండ్ల రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తే బాగుంటుంది. వారి అనుభవాలను పరిగణనలోకి తీసుకొని మెరుగైన అభివృద్ధికి కృషి చేస్తాం.
– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
అభివృద్ధే మా లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES