తండ్రి టీచర్.. భర్త డాక్టర్… జీవితాన్ని హాయిగా గడిపేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ ఆమె మాత్రం మహిళా సమస్యల పరిష్కారం కోసం అడుగు బయటపెట్టారు. ప్రజల కోసం తన గొంతు విప్పారు. నిరంతరం ప్రజలతో మమేకమై పని చేశారు. ఫలితంగా రెండు సార్లు సీపీఐ(ఎం) సర్పంచ్‌గా గెలిచి గ్రామానికి విశేష సేవలందించారు. ఆమే బుగ్గవీటి సరళ. వ్యక్తిగత జీవితంలో ఎన్నో త్యాగాలు చేసి నేటికీ ఉద్యమాల్లో కొనసాగుతున్నారు. జనవరి 25 నుండి 28 వరకు జరగబోతున్న ఐద్వా అఖిల భారత మహాసభల విజయవంతం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ఆమె ఉద్యమ ప్రస్తానం నేటి మానవిలో…
మీది డాక్టర్ కుటుంబం కదా.. ఇలా ఉద్యమాలు చేస్తుంటే ఇబ్బందులేమీ రాలేదా?
ఇప్పుడు నాది డాక్టర్ కుటుంబం కావొచ్చు. అంతకంటే ముందు మాది కమ్యూనిస్టు కుటుంబం. నల్గొండ జిల్లా, నేరెడ్‌చర్ల మండలం, పెంచికల్‌దిన్నె గ్రామంలో పుట్టాను. మా గ్రామంలో తెలంగాణ సాయుధపోరాటంలో అమరులైనవారు ఉన్నారు. మా కుటుంబాలన్నీ కమ్యూనిస్టు పార్టీనే. మా బంధువుల్లో స్వరాజ్యం గారితో పాటు అడవుల్లోకి వెళ్లి తుపాకి పట్టిన వాళ్లు కూడా ఉన్నారు. అందుకే చిన్నతనం నుండి ఎర్రజెండా అన్నా, పార్టీ అన్నా ఎంతో ప్రేమ. మా నాన్న టీచర్. అలాగే చిన్నరైతు. ఒక్కగానొక్క కూతురుని కాబట్టి నన్ను బాగా చదివించి డాక్టర్ నర్సిహారావుకు ఇచ్చి పెండ్లి చేశారు. ఆయనది ఖమ్మం జిల్లా ముందిగొండ మండలం పమ్మి గ్రామం. మా మామగారు 30 ఏండ్లు సీపీఎం గ్రామ సర్పంచ్‌గా చేశారు. కాంగ్రెస్ నుండి చాలా దాడులు ఎదుర్కొన్నారు. ఆయన్ని చంపడానికి కూడా ప్రయత్నించారు. నా భర్త గాంధీ మెడికల్ కాలేజీలో చదువుతూ విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నారు. ఎస్.ఎఫ్.ఐ మొదటి అలిండియా మహాసభలకు డెలిగేట్‌గా కూడా వెళ్లారు. అంతేకాదు చిన్న వయసులోనే ఆయనపై కేసులు ఉన్నాయి. అలా ఆయన వృత్తి రీత్యా డాక్టర్ అయినప్పటికీ కమ్యూనిస్టు. కాబట్టే నేను ఇంత ధైర్యంగా ఉద్యమాల్లో పాల్గొనగలుగుతున్నాను.
ఐద్వాలోకి ఎప్పుడు వచ్చారు?
పెండ్లి తర్వాత కొన్ని రోజులు గల్ఫ్‌లో ఉన్నాము. 1989లో తిరిగి ఖమ్మం వచ్చాము. అప్పటికి మా బాబుకు పదేండ్లు, పాపకు ఐదేండ్లు. నా భర్త హాస్పిటల్ చూసుకునేవారు. పిల్లలు స్కూల్‌కి వెళ్లిన తర్వాత నాకు కాస్త ఖాళీ సమయం దొరికేది. అప్పట్లో అక్షరదీపం ఉద్యమం జరుగుతుంది. అందులో రాసే పని ఏదైనా ఉంటే చేద్దామని ధనమ్మ అనే ఆమెను అడిగాను. అయితే అప్పటికే ఆ ఉద్యమంలో రిటన్ వర్క్ అయిపోయింది. ఆ తర్వాత ఆవిడ సహకారంతోనే జనవిజ్ఞాన వేదిక సమతా జాతాలో పాల్గొన్నాను. ఆ వర్క్‌షాప్‌లో నన్ను కో కన్వినర్‌గా పెట్టారు. అలా అప్పుడు మొదలైన నా ప్రస్తానం నేటికీ కొనసాగుతూనే ఉంది. జనవిజ్ఞాన వేదికలో కొంత కాలం పని చేసిన తర్వాత హైమావతిగారు మా ఇంటికి వచ్చి ఐద్వా క్లాసులకు రమ్మన్నారు. అలా ఐద్వాతో పరిచయం. 1994 నుండి ఐద్వాలో సీరియస్‌గా పని చేయడం మొదలుపెట్టాను. తర్వాత ఐద్వా ఖమ్మం టౌన్ అధ్యక్షురాలిగా బాధ్యతలిచ్చారు. మొదట్లో భయపడ్డా కానీ హైమావతిగారు చాలా ప్రోత్సహించారు. మాట్లాడటం కూడా రాని నాకు అన్నీ నేర్పించారు. ఆమే నా రాజకీయ గురువు. అప్పుడే ఎంపీటీసీ ఎన్నికలు వచ్చాయి. నన్ను పోటీ చేయమని అడిగారు. పిల్లలు చిన్నగా ఉండడంతో ఒప్పుకోలేదు. కానీ పార్టీ నిర్ణయించడంతో తప్పక పోటీ చేశాను. ఈ ఎన్నికల కోసం బాగా పని చేశాను. కానీ అతి తక్కువ ఓట్లతో ఓడిపోయాను. ఓటమి వల్ల అందరూ నేను దూరమైపోతానేమో అని భయపడ్డారు. కానీ ఐద్వాలో మరింత ఉత్సా హంగా పని చేయడం మొదలుపెట్టాను.
అప్పట్లో సర్పంచ్‌గా పోటీ చేశారు.. ఆ అనుభవాలు చెప్తారా?
సర్పంచ్ ఎన్నికలప్పుడు కూడా ఇష్టం లేకుండానే పోటీ చేశాను. ఆ సమయంలో మా బాబు మెడిసెన్కు ప్రిపేర్ అవుతున్నాడు. కానీ మావారితో మాట్లాడి నన్ను ఒప్పించారు. అలాగే హైమావతిగారితో కూడా మాట్లాడించారు. అప్పట్లో ఇంటింటికి వెళ్లి ఐద్వా సభ్యత్వం చేయడం, మహిళల సమస్యలతో పాటు గ్రామంలోని ప్రజలందరి సమస్యల కోసం కృషి చేసేవాళ్లం. అలా ఐద్వాగా మేము చేసిన కృషి ఫలితంగా ఖానాపురం హవేలీ సర్పంచ్‌గా 1996లో మంచి మెజారిటీతో గెలిచాను.
సర్పంచ్‌గా గ్రామాభివృద్ధికి చేసిన కృషి?
సర్పంచ్‌గా గెలిచిన తర్వాత దాదాపు ఇల్లు వదిలేశాను. ఐదేండ్లు గ్రామం కోసం చాలా చేశాము. అప్పట్లో తెలుగు దేశం అధికారంలో ఉండేది. జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజల సమస్యలపై టీడీపీ నాయకులను నిలదీసేవాళ్లం. సీపీఎం నాయకులపై దాడులు చేసేవాళ్లు. ప్రజాప్రతినిధులను అవమానించేవారు. వీటన్నింటిని గ్రామ సర్పంచ్‌గా తీవ్రంగా ఖండిచేదాన్ని. వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, ప్రజలు నాతో ఉండేవారు. ఇలా గ్రామం కోసం సీపీఎం చేసిన కృషి ఫలితంగా ప్రజలందరూ మాకు అండగా నిలబడ్డారు. అలా రెండో సారి కూడా భారీ మెజారిటీతో గెలిచాను. ఈ ఎన్నికల్లో ఫ్లోరైడ్ లేని మంచినీటిని గ్రామానికి తెప్పిస్తామని ప్రజలకు వాగ్దానం చేశాం. దాంతో ఫ్లోరైడ్ సమస్య నుండి గ్రామాన్ని కాపాడుకోవడం కోసం మూడు వేల పోస్టు కార్డులు రాసి సీఎంకు పంపించాము. ధర్నాలు కూడా చేశాము. సమస్య పరిష్కారం కాలేదు. దాంతో చివరకు ప్రజాసంఘాల సహకారంతో నిరవధిక నిరాహార దీక్ష చేసి ఏడు కోట్లు సాధించుకున్నాం. ఇక మూడో సారి ఎస్టీ ఉమెన్‌కి వస్తే కొడెన్ తారా అనే గిరిజన మహిళను గెలిపించుకున్నాం.
ఓ మహిళా సర్పంచ్‌గా ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా?
అప్పటి టీడీపీ నాయకులతో పోరాడే క్రమంలో చాలానే ఎదుర్కొన్నా. అలాగే సర్పంచ్‌గా ఉండి ఇల్లిల్లు తిరిగి ఐద్వా సభ్యత్వం చేస్తుంటే అందరూ చూసి నవ్వుకునేవారు. అలా నవ్విన వారే తర్వాత వాళ్లకు గానీ, వాళ్ల ఇండ్లల్లో పని చేసే వారికి కానీ ఏదైనా సమస్య వస్తే మా దగ్గరకు వచ్చేవారు.
ఎన్నికల్లో మీరు రెండు సార్లు వరుసగా గెలిచారు. ఎలా సాధ్యమైంది?
ఐద్వాగా మేము చేసిన పోరాటాలే దీనికి కారణం. అలాగే మధ్యాన భోజన కార్మికుల సమస్యలపై, డ్వాక్రా మహిళల సమస్యలపై ఖమ్మంలో బాగా పని చేశాం. వీటి ఫలితంగా ప్రజలు ఐద్వాకు బాగా దగ్గరయ్యారు. ఇవన్నీ సర్పంచ్ ఎన్నికల గెలుపుకు బాగా పని చేశాయి. 2006లో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపొయ్యాను. కానీ పోటీ చేయడమే చాలా గొప్పగా భావించాను. తర్వాత ఇండ్ల స్థలాల కోసం పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. నాతో పాటు 70 మంది మహిళలు 15 రోజుల పాటు వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. వాళ్లంతా సాధారణ మహిళలు. మొదటి రోజు బాగా ఏడ్చారు. వాళ్లలో ధైర్యం నింపేందుకు జైల్లో వాళ్లకు ప్రతిరోజు క్లాసులు చెబుతుండేదాన్ని. దాంతో వాళ్లలో చాలా మార్పు వచ్చింది. తర్వాత కాలంలో ఐద్వాలో చాలా చరుగ్గా పని చేయడం మొదలుపెట్టారు.
ఉద్యమాల్లో ఉన్న మహిళలు కుటుంబాన్ని పట్టించుకోరు అని అందరూ అంటారు. దీనిపై మీ అభిప్రాయం?
సమాజం కోసం పని చేసేటప్పుడు కొంత త్యాగం చేయాల్సి వుంటుంది. నా విషయంలో కూడా మొదట్లో పిల్లల నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వాళ్లు స్కూల్ నుండి వచ్చేసరికి నేను ఇంట్లో ఉండేదాన్ని కాదు. దానివల్ల చాలా ఫీలయ్యే వారు. నేనూ కొంత ఇబ్బంది పడేదాన్ని కానీ నా భర్త సహకారంతో ఇవన్నీ ఎదుర్కోగలిగాను. ప్రజలు అనేక సమస్యలతో నా దగ్గరకు వచ్చినప్పు డు వాళ్ల సమస్యల ముందు నా పిల్లల సమస్య చాలా చిన్నగా అనిపించేది. అయితే ఆయన కూడా అప్పుడప్పుడు ఆదివారమైనా మాతో ఉండొచ్చు కదా అనేవారు. ఆయనకు కూడా అర్థం చేయించాల్సి వచ్చేది. తర్వాత కాలంలో వ్యతిరేకిం చిన నా పిల్లలే నన్ను బాగా అర్థం చేసుకున్నారు. అమ్మ ప్రజల కోసం పని చేస్తుందని తెలుసుకు న్నారు. రేపు జరగబోయే ఐద్వా ఆలిండియా మహాసభలకు కూడా ఆర్థిక సహకారం అందిం చారు. కాబట్టి ఉద్యమాల్లో పని చేస్తున్నప్పు డు వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సమాజం కోసం పని చేస్తున్నాము కాబట్టి కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటే వాటిని అధిగమించవచ్చు. అయితే నేను ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు నా భర్త ఆరోగ్య రీత్యా కొంత కాలం ఉద్యమాలకు దూరమయ్యాను. ఆయన 2020లో చనిపోయారు. చాలా మంది ఇక నేను ఉద్యమాల్లోకి రాననుకున్నారు. అయితే ఆయన చనిపోయేముందు ‘నువ్వు ఉద్యమాల్లో ఉండాలి’ అన్నారు. దాంతో మళ్లీ ఉద్యమాల్లోకి రావడం మొదలుపెట్టాను.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ గురించి మీ అభిప్రాయం?
కచ్చితంగా ఉండాలి. స్త్రీ సమస్యల పరిష్కారం రాజకీయాల్లోనే ఉంది. కాబట్టి రాజకీయాల్లో మహిళల సంఖ్య పెరగాలి. మహిళలకు అవకాశాలు కల్పిస్తే సమాజ మార్పులో మరింత చురుగ్గా పాల్గొనగలుతారు. దానికి నేనే ఓ ఉదాహరణ. సర్పంచ్ కాక ముందు మాట్లాడటమే రాని నేను తర్వాత ఎంతో ధైర్యంగా సమస్యలపై పని చేస్తున్నాను. కాబట్టి మహిళలకు అవకాశాలు కల్పించాలి. అప్పుడు తామేంటో నిరూపించుకుంటారు. ముఖ్యంగా చదువుకున్న మహిళలు, యువతులు బయటకు రావాలి. అప్పుడే మహిళా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
– సలీమ



