Thursday, January 22, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిట్రంప్‌ ఒక యుద్ధోన్మాది!

ట్రంప్‌ ఒక యుద్ధోన్మాది!

- Advertisement -

ఇతర దేశాలను కొనుగోలు చేయడం, వీలుకాకుంటే ఆక్రమించుకోవడం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. దాని గత చరిత్రను పరిశీలిస్తే ఈ వాస్తవం అవగతమవుతుంది. యాభై రాష్ట్రాల అమెరికాలో అలాస్కా రాష్ట్రం అతి పెద్దది. దాన్ని1867లో రష్యా నుండి కొనుగోలు చేసింది. అమెరికాలో అత్యధిక జనాభా గల రాష్ట్రమైన కాలిఫోర్నియాను, గతంలో మెక్సికోపై దాడి చేసి అమెరికా వశపరచుకుంది. నెవాడా, ఉటా, అరిజోనా, న్యూమెక్సికో వంటి రాష్ట్రాల భూభాగాలు కూడా మెక్సికో నుంచి అమెరికాకు బదిలీ చేయబడ్డాయి. ఇంతే కాకుండా ఫ్రాన్స్‌ నుంచి లూసియానా, స్పెయిన్‌ నుంచి ఫ్లోరిడాను అప్పట్లో అమెరికా మిలియన్ల డాలర్లను వెచ్చించి, కొనుగోలు విషయం విధితమే. తన సార్వభౌమత్వానికి, భద్రతకు సవాలుగా భావించే భూభాగాలను అమెరికా కొనడమో, సైనిక చర్య ద్వారా స్వాధీనం చేసుకోవడమో ఇప్పటి వరకు జరిగిన తతంతం.19వ శతాబ్దంలో కొనసాగించిన రాజ్య విస్తరణ కార్యక్రమాన్ని 21లోనూ కొనసాగించాలని అమెరికా ఉవ్విళ్లూరుతున్నది. గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించాలన్న అమెరికా ఆకాంక్ష అందులో భాగమే.

ఉత్తర అట్లాంటిక్‌ మహా సముద్రంలోని గ్రీన్‌లాండ్‌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దాన్ని స్వాధీనం చేసుకోవాలనే డోనాల్డ్‌ ట్రంప్‌ అనుచిత నిర్ణయమే ఇందుకు కారణం. ప్రపంచంలో అతి తక్కువ జనసాంద్రత ఉన్న గ్రీన్‌లాండ్‌ జనాభా సుమారు 57 వేల వరకు ఉండవచ్చని అంచనా. ఆర్కిటిక్‌, ఉత్తర అట్లాంటిక్‌ మహా సముద్రాల మధ్య ప్రపంచంలో అతి పెద్ద ద్వీపంగా దీని మనుగడ సాగిస్తున్నది. అధిక భాగం ఆర్కిటిక్‌ ప్రాంతంలో ఉంది. ఇది ఉత్తర అమెరికాలో భాగం. డెన్మార్‌ దేశం ఉత్తర యూరప్‌లో ఉంది. ఇందులో ఒక స్వతంత్ర స్వయం ప్రతిపత్తి గల ద్వీపంగా గ్రీన్‌లాండ్‌ కొనసాగుతున్నది. 1953వ సంవత్సరంలో గ్రీన్‌లాండ్‌ డెన్మార్క్‌లో విలీనం చేయబడి, 1979లో స్వయం ప్రతిపత్తి గల ప్రాంతంగా స్వీయపాలన చేసుకుంటున్నది. దాని రక్షణ బాధ్యత డెన్మార్క్‌దే. ఇతర దేశాలకు ఎలాంటి ప్రమేయం లేదు. నాలుగు వందలకు పైగా ద్వీపాలున్న డెన్మార్క్‌లో గ్రీన్‌లాండ్‌కు ప్రత్యేక స్థానముంది. ఇది భూ సరిహద్దులు లేని ద్వీపం. కెనడా, ఐస్‌ లాండ్‌, నార్వేలతో సముద్ర సరిహద్దులను కలిగి ఉంది.

ఆర్కిటిక్‌ వలయంలో గ్రీన్‌లాండ్‌, ఫిన్లాండ్‌, ఐస్లాండ్‌, నార్వే, స్వీడన్‌, అమెరికాలోని అలాస్కా, డెన్మార్క్‌లోని గ్రీన్‌లాండ్‌లు భూభాగాలను కలిగి ఉన్నాయి. రష్యా ఆర్కిటిక్‌ వలయానికి దగ్గర్లో ఉన్న పెద్ద దేశం.అమెరికాతో పాటు ఇక్కడ రష్యాకు కూడా సైనిక స్థావరాలున్నాయి. 32 సభ్య దేశాలు గల నాటోకు, 27 దేశాల యూరోపియన్‌ యూనియన్‌కు ”గ్రీన్‌ లాండ్‌” ఒక వ్యూహాత్మక ప్రాంతం. గ్రీన్‌లాండ్‌ గగనతలం, ఆర్కిటిక్‌ సర్కిల్‌ అమెరికా భవిష్య భద్రతకు అవసరం. ఇక్కడి ఖనిజ సంపద, ఇతర సహజ వనరుల దృష్ట్యా అమెరికా కన్నుపడి, గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకోవాలనే దుర్బుద్ధి కలిగింది. అమెరికాకు నాటో దేశాలు ప్రస్తుతం మిత్ర దేశాలుగా కొనసాగుతున్నప్పటికీ భవిష్యత్తులో గ్రీన్‌లాండ్‌ జలాల్లో నాటో విన్యాసాలు జరపకుండా కేవలం తమ భద్రత దృష్ట్యా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడమే అమెరికా ధ్యేయంగా కనబడుతున్నది. డెన్మార్క్‌ దేశం నాటో, ఈయూలో సభ్యత్వ దేశంగా కొనసాగుతున్నందున అంతర్భాగమైన గ్రీన్‌లాండ్‌ ను కూడా సహజంగా నాటో, యూరోపియన్‌ దేశాల్లోను భాగస్వామిగానే పరిగణించవలసి ఉంటుంది.

గ్రీన్‌ లాండ్‌ను అమ్మకానికి పెట్టాలని లేకపోతే సైనిక చర్య ద్వారా తాము స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించడం ఆందోళనకరంగా మారింది. ఒకవైపు రష్యా వలన గ్రీన్‌ లాండ్‌కు ముప్పు పొంచి ఉందంటూనే, మరోవైపు గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకుంటామని ట్రంప్‌ హెచ్చరించడం అమెరికా ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతున్నది. ఇతర దేశాల భూభాగాలపై బరితెగించి విరుచుకుపడడం అమెరికా తెంపరితనాన్ని, సామ్రాజ్యవాద విస్తరణ వైఖరిని చాటి చెబుతున్నది. గ్రీన్‌లాండ్‌ స్వాధీనానికి సహకరించని దేశాలపై పదిశాతం సుంకాలను విధించడం పట్ల ఈయూ దేశాలు తీవ్రంగా గర్హిస్తున్నాయి. అమెరికా చర్య పట్ల బ్రిటన్‌, ఫ్రాన్స్‌ ప్రధానులు బాహాటంగానే ట్రంప్‌ను విమర్శిస్తున్నారు.

ఇప్పటికే స్వీడన్‌,నార్వే, ఫిన్లాండ్‌, నెదర్లాండ్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌లు తమ బలగాలను గ్రీన్‌లాండ్‌ రక్షణ కోసం అక్కడికి తరలించాయి. అమెరికా లేకపోతే నాటో లేదని ట్రంప్‌ ఇదివరకే స్పష్టం చేసారు. దాన్ని లేకుండా చేయడమే ట్రంప్‌ ధ్యేయంలా కనిపిస్తున్నది. ట్రంప్‌లాంటి వ్యక్తిని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అమెరికా పౌరులే కాదు, స్వయంగా రిపబ్లికన్‌ పార్టీ సభ్యులే పశ్చాత్తాపపడుతున్నారు. అమెరికా గ్రీన్‌లాండ్‌పై సైనిక చర్యకు పాల్పడి, ఆక్రమించుకుంటే ప్రపంచ పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించలేం. నోబెల్‌ శాంతి బహుమతి దక్కలేదనే అక్కసుతో రగిలిపోతున్న ట్రంప్‌ ఇక మీదట శాంతి ప్రయత్నాలు చేయబోనని పేర్కొనడం హాస్యాస్పదం. అడుగడుగునా సామ్రాజ్యవాదం, దురహంకారం వంటి మానసిక ఉద్వేగాలతో ఊగిపోతున్న ట్రంప్‌ శాంతిదూత కాదు, ఒక యుద్ధోన్మాది మాత్రమే.

సుంకవల్లి సత్తిరాజు
9704903463

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -