Tuesday, May 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కేంద్రాల్లో హమాలీల పెత్తనం

ధాన్యం కేంద్రాల్లో హమాలీల పెత్తనం

- Advertisement -


హమాలీల తీరుతో రైతులకు తీవ్ర ఇబ్బందులు…
తూకం ప్రక్రియలో తీవ్ర జాప్యం…
రోజుల తరబడి కేంద్రాల వద్ద రైతుల నిరీక్షణ…
కొంతమందికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు…
ప్రశ్నించిన రైతులకు బెదిరింపులు…
కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత కరువు…
హమాలీల పెత్తనంపై రైతుల అసహనం…
దేవరాంపల్లి కేంద్రంలో అక్రమాలపై విచారణకు డిమాండ్…


నవతెలంగాణ – కాటారం: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులు కుమ్మరి నగేష్, జీముడా రాజసమ్మయ్య, సోదారి సమ్మయ్య, జాడి రామయ్య ఇంకా అనేక మంది రైతులు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. కేంద్రo నిర్వాహకుల అండదండలతో హమాలీలు తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తూకం ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేవరాంపల్లి కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన రైతులు తమ వంతు కోసం నిరీక్షిస్తున్నప్పటికీ సరైన స్పందన లేకపోతోందని వాపోతున్నారు. ముందు వచ్చిన వారికి కాకుండా తరువాత వచ్చిన వారికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ వరి ధాన్యం సంచులను ముందుగా తూకం వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన రైతులను హమాలీలు బెదిరిస్తున్నారని, “మాట్లాడితే మీ ధాన్యాన్ని ఇంకా ఆలస్యం చేస్తాం” అంటూ హెచ్చరిస్తున్నారని రైతులు చెబుతున్నారు.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు కొంతమంది దళారులు, హమాలీల చేతుల్లో అవినీతి కేంద్రాలుగా మారుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. తూకం విషయంలో పారదర్శకత లేకపోవడం, ఎవరికి ముందుగా అవకాశం ఇవ్వాలో స్పష్టమైన విధానం లేకపోవడంతో రైతుల మధ్య అసంతృప్తి నెలకొంది.
ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి దేవరాంపల్లి కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కుమ్మరి నగేష్, చీమల నర్సింములు, సోదారి సమ్మయ్య, జాడి రామయ్య, జీముడా రాజసమ్మయ్య, గంధం రాజేంద్రప్రసాద్, నూకల సారయ్య, సోదారి అంకయ్య, వేడుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -