Saturday, May 24, 2025
Homeరాష్ట్రీయంఫలితాలిస్తున్న సీఎం ఢిల్లీ పర్యటనలు

ఫలితాలిస్తున్న సీఎం ఢిల్లీ పర్యటనలు

- Advertisement -

– సాకరమవుతున్న విజ్ఞప్తులు, సంప్రదింపులు : ముఖ్యమంత్రి కార్యాలయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

”ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనలు ఫలితాలనిస్తున్నాయి. కంటోన్మెంట్‌ భూముల నుంచి మొదలు ఒక్కటొక్కటిగా కేంద్రం నుంచి సాధించుకోవాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులు, సంప్రదింపులు సాకారమవుతున్నాయి… ” అని సీఎంఓ పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఐపీఎస్‌ క్యాడర్‌ సంఖ్య 139 నుంచి 151కి కేంద్ర ప్రభుత్వం పెంచింది. హైదరాబాద్‌కు 2,000 ఎలక్ట్రిక్‌ బస్సులు కేటాయించింది. రాష్ట్ర విభజన అనంతరం కేటాయించిన ఐపీఎస్‌ అధికారులు రాష్ట్ర అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్‌షాలకు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రానికి అదనంగా 29 మంది ఐపీఎస్‌ పోస్టులు కేటాయించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్‌షాలకు పలుమార్లు లేఖలు సమర్పించారు. దేశంలోనే ప్రధాన అయిదు నగరాల్లో హైదరాబాద్‌ ఉండడం, నానాటికీ పెరుగుతున్న డ్రగ్స్‌, సైబర్‌ నేరాలు, పట్టణీకరణ నేపథ్యంలో ఐపీఎస్‌ అధికారుల సేవలు అవసరమని సీఎం వివరించారు. తెలంగాణకు అదనంగా ఐపీఎస్‌ అధికారుల పోస్టులు రాబట్టడంలో పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైంది. ప్రధానమంత్రి, కేంద్ర హౌం శాఖ మంత్రులను కలిసిన ప్రతిసారి ఐపీఎస్‌ క్యాడర్‌ పోస్టుల పెంపుపై ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఐపీఎస్‌ క్యాడర్‌ పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలకు రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘమైన వివరణలు ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి, సమర్పించిన వివరాలతో సంతృప్తి చెందిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణకు అదనంగా 12 ఐపీఎస్‌ క్యాడర్‌ పోస్టులు పెంచుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌ నగర విస్తీర్ణం భారీగా పెరగడం, నానాటికీ కాలుష్యం పెరుగుతున్నందున కాలుష్య నివారణతో పాటు ఆధునిక నగర అవసరాలకు తగినట్లు ఎలక్ట్రిక్‌ వాహనాలు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం పలుమార్లు కోరారు. ఈ ఏడాది జనవరి 16న ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌.డి.కుమారస్వామి, ఆ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మలతో భేటీ అయ్యారు. పీఎం ఈ-డ్రైవ్‌ పథకం కింద హైదరాబాద్‌ నగరానికి ఎలక్ట్రిక్‌ బస్సులు కేటాయించాలని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న డీజిల్‌ బస్సులకు ఎలక్ట్రిక్‌ కిట్‌ అమర్చి రిట్రో ఫిట్మెంట్‌ పద్ధతిలో ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్చేందుకు అవకాశం ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామి దృష్టికి నాటి సమావేశంలో సీఎం తీసుకెళ్లారు. ఎలక్ట్రిక్‌ బస్సులతో ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతినకుండా చూడాలనీ, అందుకోసమే డీజిల్‌ బస్సులను రిట్రో ఫిట్మెంట్‌ పద్ధతిలో ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్చాలని సీఎం సూచించారు. దీంతో వచ్చే ఏడాది మార్చి నాటికి హైదరాబాద్‌ నగరంలో ఎలక్ట్రిక్‌ బస్సులు పరుగులు పెట్టనున్నట్టు సీఎంఓ ఆ ప్రకటనలో తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -