Thursday, January 22, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్రభుత్వ రంగం పరిరక్షణ - సవాళ్లు

ప్రభుత్వ రంగం పరిరక్షణ – సవాళ్లు

- Advertisement -

‘ప్రభుత్వ రంగం పుట్టింది చావడానికే….’ ఈ మాటలన్నది ఎవరో కాదు, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోడీ! పట్టువదలని విక్రమార్కుడులాగా, ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోనున్న యూని యన్‌ ప్రభుత్వం అదేపనిలో ఉన్నది. రాష్ట్రంలో ప్రభుత్వరంగ పరిశ్రమలను గమనిస్తే ఈ విషయం స్పష్టంగానే అర్థమవుతుంది. ప్రయివేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, మూసివేతలు లాంటి రకరకాల రూపాలలో ప్రభుత్వరంగ సంస్థలను నీరుగార్చుతున్నారు. మరోవైపు వీటి పరిరక్షణ కోసం, కార్మికుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం పోరాడే అవకాశం లేకుండా కార్మికోద్యమానికి చేతులు కట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

అందులో భాగమే గత నవంబరు 21 నుంచి అమలులోకి వచ్చిన లేబర్‌కోడ్స్‌. ప్రభుత్వ రంగం, ప్రయివేటు, సహకార రంగాలన్న తేడాలేదు. సంఘటిత రంగమూ, అసంఘటిత రంగమూ అన్న దానితో సంబంధం లేదు. అన్ని రంగాల కార్మికుల హక్కులు హరించడమే లేబర్‌కోడ్స్‌ లక్ష్యం. వీటికి సైద్ధాంతిక పదును పెట్టడమే ‘శ్రమశక్తి నీతి -2025’. ఇది కత్తికి తేనె పూయటం లాంటిదే! ప్రభుత్వరంగ సంస్థలను తొలి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆధునిక దేవాలయాలన్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ అంత్యక్రియల గురించి మాట్లాడుతున్నారు. ఈ మార్పు ప్రభావం తీవ్రంగానే ఉన్నది. పాలకుల విధ్వంసకర విధానాల ఫలితంగానే రాష్ట్రంలోని ప్రభుత్వరంగ పరిశ్రమలు కుంగి, కృషించిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో, సామాజిక బాధ్యతలో కీలకపాత్ర పోషించిన సంస్థలు బలహీనపడుతున్నాయి. వీటిస్థానంలో ప్రయివేటు సంస్థలు బలపడ్డాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిస్థితి పూలమ్ముకున్నచోట కట్టెలమ్ముకున్నట్టు తయారవుతున్నది. ఇంతకూ తెలంగాణలో, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏం జరుగుతున్నది? ఇప్పుడేం చేయాలి?

హైదరాబాద్‌ ప్రభుత్వరంగ సంస్థలకు గానీ, సింగరేణి బొగ్గు కార్మికోద్యమానికి గానీ గొప్ప చరిత్ర ఉన్నది. కార్మికవర్గ ప్రయోజనాలకు అంకితమై పనిచేస్తున్న పద్దెనిమిది మంది ప్రభుత్వరంగ కార్మిక నేతలను ఎమర్జెన్సీ కాలంలో నిర్బంధించారు. బీహెచ్‌ఈఎల్‌తో సమానంగా వేతనాల కోసం తొంభయ్యవ దశకం చివరిలో ఎనభైరెండు రోజుల సుదీర్ఘ సమ్మె చేసారు. ప్రభుత్వరంగ సంస్థల కార్మికులందరినీ ఐక్యం చేసే కృషిలో హెచ్‌ఎంటీ కార్మిక సంఘం పాత్ర కీలకమైంది. ఈసీఐఎల్‌ యూనియన్‌ కూడా తర్వాత కాలంలో ముఖ్యపాత్ర పోషించింది. 1990 తర్వాత, సరళీకృత ఆర్థిక విధానాల ప్రభావంతో ప్రభుత్వరంగ కార్మికోద్యమం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఈ విధానాలకు విధానాలకు ఎదురొడ్డి నిలిచే ప్రయత్నంలో క్రమంగా ఎదురుదెబ్బలు తిన్నది.

ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యాలు కార్మికుల హక్కులు గ్యారంటీ చేయటం, సమస్యల పరిష్కారంలో నమూనాగా పనిచేయాలన్నారు తొలి ప్రధాని నెహ్రూ. వీటి ఆదర్శంగా ప్రయివేటు సంస్థలు పనిచేయాలన్నారు. ఇక్కడ సాధించిన విజయాల స్ఫూర్తితో ఇతర రంగాలలో కార్మికోద్యమం సాగేది. ఈ ప్రభుత్వరంగం దేశంలో పారిశ్రామికీకరణకు తోడ్పడ్డది. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల పారిశ్రామికాభివృద్ధి ఇందుకు నిదర్శనం. ఉపాధి అవకాశాలు కల్పించింది. బడుగు బలహీనవర్గాలను ఇముడ్చుకోవటం ద్వారా సామాజిక న్యాయానికి తోడ్పడ్డది. పరిశ్రమలకు, వాణిజ్య సంస్థలకు పెట్టుబడి సమకూర్చింది. ప్రభుత్వాలకు ఆర్థిక వనరుగా ఎదిగింది. ఇప్పుడీ పరిస్థితి తీవ్ర మార్పులకు లోనైంది. ఐడీపీఎల్‌, ప్రొగాటూల్స్‌ మూతపడ్డాయి. హెచ్‌ఎంటీ, ఎచ్‌ఎంటీ బేరింగ్స్‌ లాంఛనంగానే ఉన్నాయి. కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు తొమ్మిదివేల మంది కార్మికులున్న ఈసీఐఎల్‌లో ఇప్పుడు కేవలం 3350 మంది పనిచేస్తున్నారు. హెచ్‌ఎంటీలో ఆరువేల నుంచి నేడు 210కి తగ్గింది. బీహెచ్‌ఈఎల్‌లో పదివేలకు పైగా కార్మికులుండగానేడది 3483కు పడిపోయింది.

కార్మికుల పని పరిస్థితుల్లో కూడా తీవ్ర మార్పులు జరిగాయి. ఒకప్పుడు కార్మికులంటే రెగ్యులర్‌ కార్మికులే. కాంట్రాక్టు కార్మికుల సంఖ్య నామమాత్రం. ఇప్పుడీ పరిస్థితి తారుమారైంది. 3350 మంది ఈసీఐఎల్‌ కార్మికులలో మూడు వేలమంది, 3483 మంది బీహెచ్‌ఈఎల్‌ కార్మికులలో 2300 మంది కాంట్రాక్టు కార్మికులే. సింగరేణి మినహా మిగిలిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలలో 41,800 మంది రెగ్యులర్‌ కార్మికులు ఉండగా, 43,444 మంది కాంట్రాక్టు కార్మికులున్నారు. వీరు కాక, 1008 మంది ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఉద్యోగులుగా, 3682 మంది కన్సాలిడేటెడ్‌ చెల్లింపులు, బదిలీ లేదా ట్రెయినీల పేరుతో పనిచేస్తున్నారు. మొత్తం మీద రెగ్యులర్‌ కార్మికులకన్నా, రెగ్యులర్‌ స్వభావం లేని కార్మికుల సంఖ్య ఎక్కువ. సింగరేణిలో కూడా కాంట్రాక్టు కార్మికుల సంఖ్య 26271కి చేరుకున్నది. రెగ్యులర్‌ కార్మికుల పక్కనే ప్రయివేటు కాంట్రాక్టరు, తన సొంత కార్మికులతో బొగ్గు తవ్వకాలు సాగిస్తున్నారు. అంటే.. బొగ్గు తవ్వకాల మీద ప్రత్యక్ష యాజమాన్యం ప్రయివేటు కాంట్రాక్టర్ల చేతుల్లోకి పోవటమే కదా! దేశవ్యాప్తంగా కూడా కాంట్రాక్టీకరణ వేగంగా అమలు జరుపుతున్నది. ఇపుడు కార్మికవర్గాన్ని ఐక్యం చేయటం, ఉత్పత్తిని స్తంభింపచేయటం 1970, 80వ దశకాలలో చేయగలిగినంత సులభం కాదు. కార్మికోద్యమానికే ఇదొక సవాలు.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇండియన్‌ యూనియన్‌ ప్రభుత్వం దాడి తీవ్రతరం చేసింది. వ్యూహాత్మక రంగాలలో కూడా ప్రభుత్వ రంగం నామమాత్రంగా ఉంటే చాలునని ప్రకటించింది. నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ విధానాన్ని అమలు చేయటంలో యాజమాన్యాలు సహకరించనట్లయితే తీవ్ర చర్యలుంటాయని స్పష్టం చేసింది. సీఎండీతో సహా ఏస్థాయి అధికారినైనా తొలగిస్తామని తెలియజేసింది. అధికారుల్లో కూడా ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాలన్న బలమైన కాంక్ష ఉన్నవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. డా.ఎ.ఎస్‌.రావు లాంటి ప్రముఖుల గురించి మనకు తెలిసిందే కదా! ఇలాంటి నిజమైన దేశభక్తులంటే దేశంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి గిట్టదు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా కార్మికుల ప్రవర్తనా నియమావళిని మరింత కఠినతరం చేసింది. కార్మికుల నిజాయితీ, సామర్థ్యాలను బట్టి చర్యలుంటాయన్నది. కార్మికుల నిజాయితీని ఎవరు నిర్ణయించాలి? అందుకే నేటి పరిస్థితి కార్మికోద్యమానికి కొత్త సవాలు.

కార్మికోద్యమంలో ఈ బలహీనతకు కారణాలు వెతకాలి. ఒకప్పటి పోరాట స్ఫూర్తి మళ్లీ తలెత్తుకొని నిలబడే మార్గం వెతకాలి. ఆర్థిక ప్రయోజనాల కోసం ఐక్యంగా పోరాడిన కార్మికవర్గం ప్రభుత్వరంగ పరిరక్షణ విషయంలో అంతే సృష్టమైన ఐక్య అవగాహనతో ఉన్నదని చెప్పలేము. వీరికి నాయకత్వం వహించిన వారిలో ప్రయివేటీకరణ విధానాలు అమలుచేస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ లాంటి పార్టీల అనుయాయులు కూడా బలమైన స్థానంలోనే ఉన్నారు. ప్రభుత్వరంగం అంటే భవిష్య త్తులో రానున్న సోషలిస్టు వ్యవస్థకు బీజరూపమేనని భ్రమలకు లోనైన వారూ ఉన్నారు. కాంగ్రెస్‌ పాలకులు అభ్యుదయకాముకులనీ, ప్రభుత్వరంగ కార్మికోద్యమం సమరశీలంగా సాగితే ”అభ్యుదయ” పాలకులు బలహీనపడతారని వీరు భయపడ్డారు. ప్రధానంగా ఈ రెండు రకాల శక్తులే ఉద్యమాన్ని ప్రభావితం చేసాయి. ఫలితంగా ఆర్థిక ప్రయోజనాలకు ఇచ్చిన ప్రాధాన్యత, రాజకీయ సైద్ధాంతిక పరిణామాలు, ప్రభుత్వరంగ పరిరక్షణ పట్ల ప్రదర్శించడంలో పరిమితులు ఏర్పడ్డాయి. హైదరాబాద్‌ పబ్లిక్‌ సెక్టార్‌ కోఆర్డినేషన్‌ కమిటీ నిర్మాణంలోనూ, ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించిన హెచ్‌ఎంటీలోనే సమ్మెలను విచ్ఛిన్నం చేసే ధోరణులు కూడా ప్రబలాయి.

హెచ్‌ఎంటీ, ఈసీఐఎల్‌ లాంటి సంస్థలలో యూనియన్‌లలోనూ, కార్మికోద్యమంలోనూ అనైక్యత పెరిగింది. రాజకీయ దృష్టి లోపించిన ఫలితమిది. ఈ అనైక్యతవల్ల సహజం గానే ప్రభుత్వ విధానాలు, అధికారుల అవినీతి మీద పోరాటం సన్నగిల్లింది. ఇది అంతి మంగా హైదరాబాద్‌ పరిసరాల్లోని పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యమాన్ని బలహీనపరచింది. ఐడీపీఎల్‌, హెచ్‌ఎంటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి సాంకేతిక పరిజ్ఞానం దొంగిలించి బయటపడ్డవారు పెద్దపెద్ద పెట్టుబడిదారులుగా మిగిలారు. ఈ పరిణామాల ఫలితంగానే మారుతున్న పరిస్థితులను గమనించి, సకాలంలో తగిన ఎత్తుగడలు కార్మికోద్యమం రూపొందించలేకపోయింది. కాంట్రాక్టీకరణ పెరుగుతున్నప్పటికీ కాంట్రాక్టు కార్మికులను సంఘటితం చేయటం, కార్మికోద్యమంలో అంతర్భాగంగా మలచటంలో వెనుకబడింది. రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థల కాంట్రాక్టు కార్మికులను సంఘటితం చేయటం అంటే.. వారికి సహాయం చేయటంగా భావించారు. కార్మికోద్యమానికి అవసర మన్న వాస్తవం గుర్తించలేదు. దాని ఫలితాలు ఇపుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సింగరేణిలో అన్ని యూనియన్లు కలిసి సమ్మెచేసినా ఉత్పత్తి ఆగదు. కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొనరు.

వారంతా ఉత్పత్తి కొనసాగిస్తారు. సింగరేణి ఉద్యమంలో, గుర్తింపు సంఘాలు కాదన్న పేరుతో కార్మిక సంఘాల ఐక్యతకు విఘాతం కల్గించే ధోరణులున్నాయి. వీటిని యాజమాన్యం చాక చక్యంగా వాడుకుంటున్నది. ప్రయివేటు యాజమాన్యాల ఎత్తుగడలకు ఏ మాత్రం తీసిపోకుండా కుల సంఘాలను ప్రోత్సహించి కార్మిక సంంఘాలకు పోటీగా తయారుచేస్తున్నది. అధికారులే కులసంఘాలకు నాయకత్వం వహిస్తున్నారు. వీటి ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయనే అభిప్రాయం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంత జరిగినా, నిబద్ధతతో, ఐక్యపోరాట లక్ష్యంతో కృషిచేస్తే కార్మికోద్యమానికి మంచి భవిష్యత్తు ఉన్నదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. సింగరేణి కార్మికుల సొంతింటి కల, తాగునీరు లాంటి సమస్యల మీద చేస్తున్న కృషి కార్మికులను పెద్దఎత్తున కదిలిస్తున్నది.

హాస్పిటల్‌, యంత్రాల కొనుగోళ్లు, భవనాల నిర్మాణంలో అవినీతిని ఎండగట్టడంతో కార్మికులు బాగా స్పందిస్తున్నారు. సింగరేణి పరిరక్షణకోసం, లేబర్‌కోడ్‌ల రద్దుకోసం జరుగుతున్న ఆందోళనలతో ఉత్సాహం ప్రదర్శిస్తు న్నారు. ఐక్య ఉద్యమం అవసరమన్న ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. గణనీయమైన భాగం నిబద్ధతగల కార్మికోద్యమం వెలుగులోనే నడుస్తున్నారు. బీహెచ్‌ఈఎల్‌ లాంటి సంస్థలో కూడా తమ సమస్యల పరిష్కారం కోసం ఎవరు నిలబడతారా అని కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఈ ఉద్యమం బలపడ కుండా చూసేం దుకు, ఉన్న ప్రభుత్వ రంగాన్ని పాలకులు లేబర్‌కోడ్‌లను సాధనంగా వాడుకుంటున్నారు. అందుకే లేబర్‌కోడ్‌ల రద్దుకోసం కదలాలి. ప్రభుత్వ రంగం పరిరక్షణ కోసం నిలబడాలి. మరోసారి పబ్లిక్‌ సెక్టార్‌ కార్మికులు ఐక్య పోరాటం వైపు అడుగులు వేయాలి.

ఎస్‌.వీరయ్య

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -