సింధు, అన్మోల్ కూడా…
ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ
జకార్తా: ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్.. మహిళల సింగిల్స్‌లో పివి సింధు, అన్మోల్ కర్బ్ ప్రత్యర్ధులపై గెలిచి రెండోరౌండ్‌కు చేరారు. బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో 5వ సీడ్ సింధు 22-20, 21-18తో జపాన్‌కు చెందిన మనమి సుజును చిత్తుచేసింది. ఈ మ్యాచ్ సుమారు 51నిమిషాలసేపు సాగింది. ఇక మాజీ నంబర్‌వన్ ఆటగాడు, 33వ సీడ్ కిదాంబి 21-15, 21-23, 24-22తో గంటా 12నిమిషాల సేపు సాగిన సుదీర్ఘ సమరంలో జపాన్‌కు చెందిన 22వ ర్యాంకర్ వాటనబేను ఓడించాడు. రెండోరౌండ్లో శ్రీకాంత్ 4వ ర్యాంకర్, చైనాకు చెందిన ఛౌ టిన్ చెన్‌తో తలపడనున్నాడు.
తొలిరౌండ్లో ఛౌ టిన్ 21-14, 21-15తో ఐర్లాండ్‌కు చెందిన నుయాన్ను ఓడించాడు. ఇక 7వ సీడ్ లక్ష్యసేన్ 21-13, 16-21, 21-14తో చైనీస్ తైపీకి చెందిన వాంగ్-జు-వురును చిత్తుచేశాడు. 2వ రౌండ్లో లక్ష్యసేన్ హాంకాంగ్‌కు చెందిన జాస్‌తో తలపడనున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌లో మాల్విక బన్సోద్ 21-23, 12-21తో 6వ సీడ్ మిఛెల్లి(కెనడా) చేతిలో, పురుషుల సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి 8-21, 13-21తో 8వ సీడ్ ఫర్హాన్(ఇండోనేషియా) చేతిలో పరాజయాన్ని చవిచూశారు. అన్మోల్ కర్బ్ 21-16, 21-17తో చైనీస్ తైపీకి చెందిన పి-యు-పోను ఓడించి రెండోరౌండ్‌కు చేరారు.



