Thursday, January 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌ ఏడాది పాలనపై ప్రజాగ్రహం

ట్రంప్‌ ఏడాది పాలనపై ప్రజాగ్రహం

- Advertisement -

అమెరికా అధ్యక్షుడి విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు
ప్లకార్డులు, దిష్టిబొమ్మలతో ఆందోళనలు
వాషింగ్టన్‌ విధానాలతో నాశనం చేశారంటూ ప్రదర్శనలు
దేశానికి ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఆవేదన

వాషింగ్టన్‌: రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఏడాది పాలనపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. జనవరి 20తో ట్రంప్‌ ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో ఆయన తీసుకొచ్చిన విధానాలను వ్యతిరేకిస్తూ అమెరికా వ్యాప్తంగా వివిధ సంఘాల కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ప్లకార్డులు, ట్రంప్‌ బొమ్మలు, నలుపు రంగు దుస్తులు ధరించి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు దేశానికీ, ప్రపంచానికీ ప్రమాదకరంగా మారాయని తెలిపారు. అంతేకాక అమెరికా అంతర్జాతీయ విశ్వసనీయత పూర్తిగా దెబ్బతిందని ఆరోపించారు.

‘గ్రీన్‌లాండ్‌ పేరుతో ప్రపంచ యుద్ధానికి దారి’
గ్రీన్‌లాండ్‌ స్వాధీనం కోసం ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలను ఓ నిరసనకారుడు విమర్శించాడు. నాటో కూటమిని విచ్ఛిన్నం చేయ డానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. ‘ గతేడాది నుంచి దేశం తీవ్ర దాడికి గురువుతోంది. దీని వల్ల మేం పూర్తిగా దారి తప్పుతున్నాం. వీధుల్లో సైన్యం తిరుగుతోంది. ప్రజలను అపహరించడం, హత్యలు జరగడం చూస్తున్నాం. స్వతంత్ర దేశాల భూ భాగాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ నాటో కూటమిని బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. ఈ పిచ్చి ప్రయత్నాలను ఆపేందుకే మేం రోడ్లపైకి వచ్చాం. దీనికి ముగింపు పలకాలి’ అని పేర్కొన్నాడు.

‘ప్రపంచ దేశాలు నమ్మకం కోల్పోతున్నాయి’
అమెరికాపై ప్రపంచ దేశాలు నమ్మకం కోల్పోతున్నాయని మరో నిరసనకారుడు లీసా ఫిన్‌ చెప్పాడు. ‘దశాబ్దాలుగా మేం ప్రపంచవ్యాప్తంగా మిత్ర దేశాలను సంపాదించాం. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు ఆ నమ్మకం పూర్తిగా క్షీణిస్తోంది. ఇతర దేశాలు ఇక అమెరికాను నమ్మలేని పరిస్థితి వచ్చింది. దీని ప్రభావం రానున్న దశాబ్దాల్లో ప్రపంచ రాజకీయ వ్యవస్థపై పడుతుంది’ అని అన్నాడు.

ఏడాది పాలనపై ట్రంప్‌ ప్రశంసలు
ఇదిలా ఉండగా ట్రంప్‌ మాత్రం ఏ ప్రభుత్వం చేయనంత పనిని తాను చేసినట్టు తన ఏడాది పాలనపై ప్రశంసలు కురిపించారు. ‘ఇది జనవరి 20. నా రెండో పదవీకాలానికి మొదటి వార్షికోత్సవం. ఇది అద్భుతమైన కాలం. మా ప్రభుత్వం సాధించిన విజయాలు నేను వారం రోజుల పాటు చదివినా పూర్తవవు. సైన్యం పరంగా, యుద్ధాలను ముగించడంలో మా ప్రభుత్వం చేసినంత పని ఎవరూ చేయలేదు’ అని ట్రంప్‌ అన్నారు.

టారిఫ్‌ బెదిరింపుల నుంచి ఐఈసీ దాడుల వరకూ..
ఈ ఏడాది కాలంలో ట్రంప్‌ ప్రభుత్వ పాలన, విధానాలపై పలు విమర్శలున్నాయి. అందులో ముఖ్యంగా ఇతర దేశాలను టారిఫ్‌లతో బెదిరించడం. అలాగే అక్రమ వలసదారులపై ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐఈసీ)ని విపరీతంగా వినియోగించుకోవడం వంటివి ఉన్నాయి. అంతేకాకుండా డబ్ల్యూటీఓ, ఐక్యరాజ్యసమితి, నాటో వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికాను దూరం చేయడం వంటి విధానాలపై తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంది.

టారిఫ్‌ అత్యంత దుర్మార్గమైన విధానం
ట్రంప్‌ టారిఫ్‌ విధానాలను మరో ఆందోళన కారుడు తీవ్రంగా విమర్శించాడు. ‘టారిఫ్స్‌ అనేవి అత్యంత దుర్మార్గమైన విధానాలు. గత 50 ఏండ్లుగా ఉన్న మిత్రదేశాలకు ఈ ప్రభుత్వం ద్రోహం చేస్తోంది. ఇది అమెరికాను తీవ్రమైన ప్రమాదంలోకి నెడుతోంది. అమెరికన్‌ ప్రజలు, ప్రపంచం గురించి ట్రంప్‌ పట్టించుకోరు’ అని అన్నాడు. అమెరికా ఇప్పుడు ప్రపంచానికి ఒక పరాయిలా మారిందని మరో నిరసకారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -