Thursday, January 22, 2026
E-PAPER
Homeజాతీయంఎన్నికలపై బీజేపీ భారీ ఖర్చు

ఎన్నికలపై బీజేపీ భారీ ఖర్చు

- Advertisement -

కాషాయ-కాంగ్రెస్‌ పార్టీల మధ్య భారీ అంతరం
పదేండ్లలో వేగంగా పెరిగిన వ్యయం
56 శాతం నుంచి 274 శాతానికి దూసుకెళ్లిన వైనం
ఎన్నికల కమిషన్‌ నివేదిక వెల్లడి

కార్పొరేట్‌ విరాళాల అండతో ఎన్నికల రాజకీయాలు డబ్బు మాయలోకి జారుతున్నాయనే వాస్తవాన్ని ఎన్నికల కమిషన్‌ రిపోర్టు బట్టబయలు చేసింది. అభివృద్ధి కంటే మతోన్మాద రాజకీయాలనే ఆయుధంగా చేసుకుంటూ, అపారమైన ఎన్నికల ఖర్చులతో అధికార పీఠాలను కైవసం చేసుకుంటున్న కమలంపార్టీ వ్యయం గత పదేండ్లలో అనూహ్యంగా పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీ ఖర్చుల అంతరం 2014-15లో 56 శాతం ఉండగా, 2024-25 నాటికి అది ఏకంగా 274 శాతానికి చేరడం దేశంలో ‘డబ్బు రాజకీయాల’ భయంకర స్వరూపాన్ని ప్రతిబింబిస్తోంది.

న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో ప్రధాన పార్టీల ఎన్నికల ఖర్చులు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ విపరీతంగా ఖర్చు చేస్తున్నది. పార్లమెంట్‌ నుంచి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పైసలు పంచి..పీఠాలను ఎక్కుతోందనేలా ఎన్నికల కమిషన్‌ రిపోర్టు తేటతెల్లం చేస్తోంది. అయితే ఖర్చుల విషయంలో అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీల మధ్య ఈ అంతరం తీవ్రంగా కనిపిస్తున్నది. పదేండ్ల వ్యవధిలోనే ఈ రెండు పార్టీల మధ్య ఖర్చుల విషయంలో అంతరం భారీగా పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఎన్నికల కమిషన్‌ గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

2014-15 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ ఖర్చు.. కాంగ్రెస్‌ చేసిన ఖర్చుతో పోలిస్తే 56 శాతం అధికంగా ఉంటే.. 2024-25 నాటికి అది 274 శాతానికి పెరిగిపోయింది. ఇది దేశ రాజకీయాల్లో బీజేపీ డబ్బు రాజకీయాన్ని ప్రతిబింబిస్తున్నది. అంతేకాదు.. దేశంలో విపరీతంగా పెరుగుతున్న ఎన్నికల ఖర్చులపై అందరి లోనూ ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎన్నికల కమిషన్‌ డేటా ప్రకారం… 2024-25లో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలపై మొత్తం రూ.896 కోట్లు ఖర్చు చేసింది. ఇదే సమయంలో బీజేపీ రూ.3355 కోట్ల ఖర్చు పెట్టింది. ఈ ఖర్చుల మధ్య తేడా 2014-15, 2019-20 ఎన్నికలతో పోలిస్తే గణనీయంగా పెరిగినట్టు చూపిస్తున్నది.

గత ఎన్నికల్లో ఇలా…
2014 నుంచి ఎన్నికల ఖర్చు విషయంలో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ పార్టీతో పోలిస్తే విపరీతంగా డబ్బులను వెదజల్లింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ రూ.925 కోట్లను ఖర్చు చేసింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ వ్యయం రూ.582 కోట్లుగా ఉన్నది. ఈ సమయంలో ఈ రెండు పార్టీల మధ్య ఎన్నికల వ్యయం అంతరం 56 శాతంగా ఉన్నది. ఇక 2019-20లో బీజేపీ వ్యయం పెరిగింది. ఈ సమయంలో కాషాయపార్టీ రూ.1352 కోట్లను ఎన్నికలపై ఖర్చు చేయగా.. కాంగ్రెస్‌ పార్టీ రూ.864 కోట్లను వెచ్చించింది. 2024-25లో బీజేపీ రూ.3355 కోట్లను వ్యయం చేయగా.. కాంగ్రెస్‌ మాత్రం రూ.896 కోట్లను ఖర్చు చేసింది. దీంతో ఎన్నికల ఖర్చుల విషయంలో ఈ రెండు పార్టీల మధ్య అంతరం 274 శాతానికి పెరిగినట్టయ్యింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ కోట్ల రూపాయలు వెదజల్లినట్టు అర్థమవుతున్నది. పదేండ్లలో బీజేపీ ఖర్చులు వేగంగా పెరిగితే, కాంగ్రెస్‌ పార్టీ ఖర్చుల్లో మాత్రం ఆ స్థాయి పెరుగుదల కనబడలేదు.

మీడియా.. ప్రచారం.. ప్రయాణాలపై భారీ వ్యయం
ఎన్నికల్లో మీడియా పాత్ర చాలా కీలకం. గెలుపోటములను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేయగలవు. అలాగే ప్రచారం, ప్రయాణాలు కూడా ఎన్నికల ఖర్చులో ఉంటాయి. 2024-25లో బీజేపీ ఎలక్ట్రానిక్‌ మీడియాపై రూ.1124 కోట్లు, విమానాలు, హెలికాప్టర్ల కోసం రూ.583 కోట్లు, ప్రకటనల రూపంలో రూ.897 కోట్లను ఖర్చు చేసింది. ఇక అభ్యర్థులకు ఆర్థిక సహాయంగా రూ.312 కోట్లను కాషాయపార్టీ అందజేసింది. ఈ ఖర్చులు 2019-20తో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువగా పెరగటం గమనార్హం.

పార్టీ ఆదాయంలో 602 శాతం వృద్ధి
బీజేపీకి వచ్చిన స్వచ్ఛంద విరాళాలు గత పదేండ్లలో గణనీయంగా పెరిగాయి. 2014-15లో ఇది రూ.872 కోట్లు, 2019-20లో రూ.3427 కోట్లుగా ఉండగా.. అది 2024-25 నాటికి రూ. 6124 కోట్లకు చేరింది. దీంతో మోడీ నేతృత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దశాబ్ద కాలంలోనే స్వచ్ఛంద విరాళాల పెరుగుదల 602 శాతం నమోదు కావటం గమనార్హం.

ఆయా రాష్ట్రాల్లోనూ బీజేపీ అధిక ఖర్చులు
మధ్యప్రదేశ్‌, కర్నాటక, ఛత్తీస్‌గఢ్‌, రాజస్తాన్‌ వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఖర్చు కాంగ్రెస్‌ కంటే చాలా ఎక్కువగా ఉన్నది. పైన పేర్కొన్న వాటిలో ప్రస్తుతం కర్నాటకలో తప్పితే మిగతా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న విషయం విదితమే. ఈ రాష్ట్రాల్లో పోటీ ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీల మధ్య ఉంటుంది. 2018, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పోల్చితే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ఉన్న వ్యయ వ్యత్యాసం స్పష్టమవుతుంది. 2018-19లో బీజేపీ రూ.792 కోట్లు ఖర్చు చేయగా.. కాంగ్రెస్‌ పార్టీ రూ.308 కోట్లను వెచ్చించింది. ఇక 2023-24లో బీజేపీ రూ.1754 కోట్లను ఖర్చు చేయగా.. కాంగ్రెస్‌ పార్టీ రూ.619 కోట్లను మాత్రం వ్యయం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ ట్రెజరర్‌ అజయ్ మాకెన్‌ గతంలో వెల్లడించిన వివరాల ప్రకారం… 2004లో బీజేపీ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ రూ.88 కోట్లు కాగా.. 2024లో అది రూ.10,107 కోట్లకు చేరింది. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ బ్యాలెన్స్‌ రూ.133 కోట్లు మాత్రమే. దీంతో బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య నిధుల నిష్పత్తి 99:1కి చేరిందని మాకెన్‌ అన్నారు. 2024 నాటికి బీజేపీ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కాంగ్రెస్‌ కంటే 75 రెట్లు అధికంగా పెరిగిందని చెప్పారు.

కార్పొరేట్‌ సంస్థలా బీజేపీ వ్యవహారం
దేశంలో మరింత ప్రియంగా మారుతున్న ఎన్నికలపై విశ్లేషకులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఒక కార్పొరేట్‌ సంస్థలా వ్యవహరిస్తున్నదని రాజకీయ విశ్లేషకుడు చంద్రచూర్‌ సింగ్‌ అన్నారు. ఎన్నికల ముందు ఆ పార్టీ వనరులను సమీకరించి భారీ స్థాయిలో ప్రచారం చేస్తోందని చెప్పారు. అధికారం, ధన బలాన్ని ప్రయోగించి బీజేపీ ఎన్నికల్లో గెలిచే ప్రయత్నాలను చేస్తున్నదనీ, గత పదేండ్లలో దేశంలో జరిగిన ఎన్నికల తీరు, గణాంకాలను చూస్తే ఇది అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అన్నారు.

పదేండ్లలో వ్యయం ఇలా…
2024-25లో బీజేపీ ఎన్నికలు, సాధారణ ప్రచారాలపై ఖర్చు చేసిన రూ.3355 కోట్లలో అత్యధికం ఎలక్ట్రానిక్‌ మీడియాకే వెచ్చించింది. ఇందుకు బీజేపీ రూ.1124 కోట్లను ఖర్చు చేయగా.. ఇది 2019-20లో ఖర్చు చేసిన రూ.249 కోట్లతో పోలిస్తే 352 శాతం అధికం కావడం గమనార్హం. ఇక లోక్‌సభ ఎన్నికలు జరిగిన 2024-25లో బీజేపీ విమానాలు, హెలికాప్టర్లపై రూ.583 కోట్లు ఖర్చు చేసింది. ఇది 2019-20లో ఖర్చు చేసిన రూ.250 కోట్ల కంటే రెండింతలకు పైగా ఉండటం గమనార్హం. అభ్యర్థులకు పార్టీ అందించిన ఆర్థిక సహాయం కూడా మూడు రెట్లు పెరిగింది. 2014-15లో రూ.88 కోట్లుగా ఉన్న ఈ వ్యయం.. 2024-25 నాటికి అది అమాంతం పెరిగి రూ.312 కోట్లకు చేరింది. దీంతో పదేండ్లలోనే ఈ వ్యయం 255 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇక ప్రకటనలపై బీజేపీ చేసిన ఖర్చు 2019-20లో రూ.400 కోట్లు కాగా.. 2024-25లో అది రూ.897 కోట్లకు ఎగబాకింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -