దేశంలో నానాటికీ పెరుగుతున్న అసమానతలు
సందిగ్ధంలో ప్రాథమిక హక్కులు- ప్రజాస్వామ్యం
అసమానతల్లేని రాజ్యాంగ పరిరక్షణే కమ్యూనిస్టుల లక్ష్యం : ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొ.కాశీం
ఖమ్మం ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో ‘భారత రాజ్యాంగం ఎదురవుతున్న సవాళ్ల’పై సెమినార్
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
భారత రాజ్యాంగం కులతత్వం, మతతత్వం, కార్పొరేట్ రాజకీయాల పెత్తనం, అవినీతి, లౌకికతత్వం లోపించటం, అణగారిన వర్గాల సమస్యలు, ప్రాథమిక హక్కుల అమలులో అడ్డంకులు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కాశీం ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ లక్ష్యాలైన సామాజిక, ఆర్థిక న్యాయం, సమానత్వం, భిన్నత్వంలో ఏకత్వాన్ని ఇవి దెబ్బతీస్తున్నాయని తెలిపారు. ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో ఖమ్మంలోని మంచికంటి మీటింగ్ హాల్లో బోడపట్ల రవీందర్ అధ్యక్షతన బుధవారం జరిగిన ‘భారత రాజ్యాంగం- ఎదురవుతున్న సవాళ్లు’పై సెమినార్లో కాశీం మాట్లాడారు. భారత రాజ్యాం గానికి జీవధాతువులైన ప్రాథమిక హక్కులు- ప్రజాస్వామ్యం సందిగ్ధంలో పడ్డాయని అన్నారు. అసమానతలు లేని రాజ్యాంగ పరిరక్షణే కమ్యూనిస్టుల లక్ష్యం కావాలని తెలిపారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, లింగ, ప్రాంతం, భాష అసమానతలు లేని రాజ్యాంగాన్ని కోరుతున్నామని అన్నారు.
‘ప్రాథమిక హక్కులు అమలైన చోట ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది’ నెహ్రూ అన్న మాటలకు భిన్నమైన నేటి పరిస్థితులు ఉన్నాయన్నారు. వర్గ అసమానతలు తగ్గించాలని రాజ్యాంగం చెబుతున్నా.. నానాటికీ అవి పెరిగిపోతూనే ఉన్నాయన్నారు. పార్లమెంటరీ విధానమంటే ఓ మనిషికి ఓటు హక్కు ఉండటం అని, ప్రజా స్వామ్యానికి ఓటు అనేది విలువైనదై ఉండాలని చెప్పారు. ప్రతిపక్షాలు బలీయమైన శక్తిగా ఉండాలన్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వ రూపం, సామాజిక వ్యవస్థ రూపమని తెలిపారు.అటువంటి ప్రజాస్వామ్యంలో నియంతృత్వంతో చట్టాలు రూపొందించ కూడదని రాజ్యాంగం చెబుతోందని చెప్పారు. కారల్ మార్క్స్ చెప్పినట్లు వర్గ రహిత సమాజం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నిస్వార్థ పోరాట చరిత్ర కమ్యూనిస్టులకే ఉందని.. నిర్బంధాలు, దాడులు, హత్యలు ఉన్నా కమ్యూనిస్టు సిద్ధాంతానికి చావు లేదని, అదే పెట్టుబడిదారులు, దోపిడీదారుల భయం అని అన్నారు. చలనంలో ఉండే మెదడు సమాజం ప్రగతిదాయకంగా మారాలని ఆశిస్తుందని మార్క్స్ అన్న మాటలను గుర్తు చేశారు.
లౌకిక స్ఫూర్తిని దెబ్బతీస్తున్న కుల, మతతత్వాలు
కుల, మతతత్వం, రాజ్యాంగం.. లౌకికస్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని కాశీం అన్నారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ల నియంత్రణలో రాజకీయాలు ఉండటం, వారి వ్యాపార ప్రయోజనాల కోసం రాజ్యాంగ లక్ష్యాలను పక్కన పెట్టడం ఒక పెద్ద సమస్యగా సూచించారు. అవినీతి, అధికార దుర్వినియోగం.. ప్రజాస్వామ్య సంస్థలను బలహీన పరుస్తూ, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రక్షణలు సరిగ్గా అమలు కావడంలేదన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను తగ్గించకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని అంబేద్కర్ రాజ్యాంగాన్ని సమర్పించే సమయంలో ఉటంకించిన వ్యాఖ్యలు నేటికీ వాస్తవ రూపాలుగానే ఉన్నాయన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ సూత్రాలను కార్పొరేట్ శక్తులు ప్రభావితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వతంత్రతా లోపం
ఎన్నికల ప్రక్రియ, పాలనలో అవినీతి పెరుగుతుందని కాశీం అన్నారు. న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం వంటి సంస్థల స్వతంత్రత లోపిస్తోందన్నారు. పార్లమెంటరీ హక్కులు హరించి వేయబడుతున్నాయని తెలిపారు. మన విద్యలో శాస్త్రీయత లోపిస్తోందన్నారు. రాజ్యాంగపు ప్రాథమిక స్ఫూర్తిని దెబ్బతీసే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. రాజ్యాంగం ఆశయాలను కాపాడటం, ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం అవసరమని అన్నారు. ఈ సెమినార్లో ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక నాయకులు ఎం. సుబ్బారావు, నరేందర్, బాలాజీ సింగ్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.



