Thursday, January 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబడ్జెట్‌పై కసరత్తు షురూ

బడ్జెట్‌పై కసరత్తు షురూ

- Advertisement -

24 నుంచి రాష్ట్ర పద్దుపై సన్నాహక సమావేశాలు
ఉప ముఖ్యమంత్రి భట్టి నేతృత్వంలో ఫిబ్రవరి 5 వరకు నిర్వహణ
సంక్షేమ పథకాల నిధుల కేటాయింపుపై కీలక చర్చ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర బడ్జెట్‌ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కసరత్తు వేగవంతమైంది. బడ్జెట్‌ ప్రతిపాదనలకు సంబంధించిన పనులు గతనెలలోనే ప్రారంభమై విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ అధికారులు ఈ పనిలోనే నిమగమయ్యారు. గతనెల 23 నుంచి ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌లో శాఖల వారీగా ఆన్‌లైన్‌లో బడ్జెట్‌ ప్రతిపాదనలను సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఇప్పుడు భౌతికంగా ఈనెల 24 నుంచి శాఖల వారీగా ఆర్థిక శాఖ సన్నాహక సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ సమావేశాలు సచివాలయంలో జరుగుతాయి. ఆయా శాఖల మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు, ఆయా శాఖల విభాగాధిపతులతో వచ్చేనెల ఐదో తేదీ వరకు ఈ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది.

ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా బుధవారం బడ్జెట్‌ ప్రతిపాదనలకు సంబంధించిన సమావేశాల షెడ్యూల్‌ను విడుదల చేశారు. సంక్షేమ పథకాలకు సంబంధించి నిధుల కేటాయింపుపై కీలకంగా చర్చ జరుగుతుంది. ఏయే సంక్షేమ పథకానికి ఎన్ని నిధులు కేటాయించాలో నిర్ణయం తీసుకునే అవకాశముంటుంది. శాఖల వారీగా ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు, కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు, కొత్త పథకాల ప్రారంభం వంటి వాటిపైనా చర్చించి నిర్ణయం తీసుకుం టారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలను ప్రకటి స్తుంది. ఈనెల 24న మొదటి వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, హ్యాండ్లూమ్‌, టెక్స్‌టైల్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశం ఉంటుంది. అదేరోజు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా,శిశు సంక్షేమ శాఖమంత్రి డి అనసూయ సీతక్కతో సమావేశాన్ని నిర్వహిస్తారు. 27న ఆర్‌ అండ్‌ బీ, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో సమావేశం ఉంటుంది. 28న ఉదయం నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో, మధ్యాహ్నం పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో సమావేశముంటుంది.

29న ఉదయం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో, మధ్యాహ్నం ఎక్సైజ్‌, పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో సమావేశాన్ని నిర్వహిస్తారు. 30న కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి, మధ్యాహ్నం పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో సమావేశం ఉంటుంది. 31న ఉదయం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో, మధ్యాహ్నం మైనార్టీ సంక్షేమం, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖ మంత్రి అజహరుద్దీన్‌తో సమావేశాన్ని నిర్వహిస్తారు. వచ్చేనెల రెండో తేదీన ఉదయం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో, మధ్యాహ్నం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో సమావేశముంటుంది. అదేనెల మూడున ఉదయం విద్యారంగం, మధ్యాహ్నం మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తారు. నాలుగున ఉదయం సాధారణ పరిపాలన శాఖతోపాటు రెవెన్యూ శాఖ, మధ్యాహ్నం హోం, న్యాయ శాఖల అధికారులతో సమావేశం ఉంటుంది. చివరి రోజు వచ్చేనెల ఐదున ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్‌ శాఖలపై సమావేశాన్ని నిర్వహిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -