మతోన్మాద వ్యతిరేక శక్తులను కూడగడతాం
సామ్రాజ్యవాద దాహంతో ట్రంప్
కేరళను కాపాడుకుంటాం.. సీపీఐ(ఎం)తో కలిసి పోటీ : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మోడీకి ఈ దేశంలో రైతులు, కార్మికుల గురించి పట్టకపోగా ఆయన ప్రేమంతా సంపన్న వర్గాలపైనేనని, దాంతో దేశంలో అసమానతలు పెరిగి సంక్లిష్ట స్థితిలోకి వెళ్లిపోయిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా అన్నారు. ట్రంప్ సామ్రాజ్యవాద దాహంతో వ్యవహరిస్తున్నా కనీసం ఖండించలేని స్థితిలో భారత ప్రధాని మోడీ ఉన్నారని విమర్శించారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో ఏర్పాటుచేసిన సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజా మాట్లాడారు.
భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయని అన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ప్రదర్శనను, బహిరంగ సభను విజయవంతం చేశారని అన్నారు. ఈ ఉత్సవాలకు వేదికగా నిలిచిన ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఐ శాఖలకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్.. సామ్రాజ్యవాద ధోరణితో వ్యవహరిస్తూ అత్యంత ప్రమాదకారిగా మారుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో వెనిజులాకు తాము మద్దతుగా నిలుస్తున్నామని తెలిపారు. వెనిజులాపై దాడి కేవలం ఆయిల్ సంపద కోసమేనని స్పష్టం చేశారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దని భారత్‌పై ట్రంప్ ఒత్తిడి తీసుకువస్తున్నా మోడీ స్పందించడం లేదని, కనీసం నోరు మెదిపే సాహసం కూడా చేయలేకపోతున్నారని విమర్శించారు. పాలస్తీనా, వెనిజులాకు అంతర్జాతీయ మద్దతు పెరుగుతుందన్నారు.
పెరిగిన అసమానతలు
భారతదేశాన్ని నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మోడీ చెబుతున్నారని, కానీ.. దేశంలో నిరుద్యోగం, సామాజిక, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని రాజా అన్నారు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంతో దేశం విచ్ఛిన్నం దిశగా పయనిస్తున్నదని తెలిపారు. అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ శక్తులు శ్రామిక ప్రజలను దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రయివేట్‌పరం చేస్తున్నారని అన్నారు. విమానశ్రయాలు, ఓడరేవులు, అగ్రికల్చర్, ఎల్‌ఐసీ, అణు విద్యుత్ కేంద్రాలను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
పోరాడి సాధించికున్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి వీబీజీఆర్‌ఏఎమ్‌జీ పథకాన్ని తీసుకొచ్చి పల్లెల్లో ఉపాధి లేకుండా బీజేపీ కుట్ర చేస్తుందని అన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకొచ్చారని.. వీటన్నింటికీ వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు. సంఘ్ పరివార్ శక్తులు కులాన్ని, మతాన్ని అడ్డుపెట్టుకొని సనాతన ధర్మం పేరుతో సామాజిక, ఆర్థిక, లింగ వివక్ష కొనసాగిస్తున్నారని తెలిపారు. మతతత్వ శక్తుల కారణంగా దేశంలో లౌకికవాదం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయని తెలిపారు. అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు స్థానిక ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గవర్నర్ శాసించడం ఏమిటని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యారంగంలోనూ మత ప్రమేయం
నూతన విద్యా విధానం పేరుతో విద్యా రంగంలోనూ మతాన్ని చొప్పిస్తున్నారని, విద్యా వ్యవస్థను వ్యాపార మయంగా మార్చారని రాజా తెలిపారు. పార్లమెంటును నిర్వీర్యం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తున్నారని అన్నారు. బీజేపీ పాలన ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో సాగుతుందని తెలిపారు. దేశంలో లౌకికవాద ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని సమైక్య పోరాటం చేస్తామన్నారు. కేరళను కాపాడుకోవడంతో పాటు త్వరలో ఎన్నికలు జరగనున్న మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కలిసి వచ్చే శక్తులతో కలిసి బలాన్ని పెంచుకుంటామన్నారు.
వందేండ్ల్ల కమ్యూనిస్టు ఉద్యమం అంటే త్యాగాలు, పోరాటాలేనని చెప్పారు. ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలకు, పోరాటాలకు సమాయత్తం అవుతా మని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్య దర్శులు రామకృష్ణ పాండా, పల్లా వెంకటరెడ్డి, కె. రామ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, ఎస్కె సాబీర్ పాషా, ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేష్ తదితరులు పాల్గొన్నారు.



