- Advertisement -
- ప్రపంచశాంతికి పాటుపడటమే
– ఆ కామ్రేడ్‌కు ఇచ్చే అసలైన నివాళి : రఘుపాల్ సంతాపసభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఐప్సో), జాతీయ అడ్వైజర్స్ కమిటీ మెంబర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షవర్గ సభ్యులు, సీపీఐ(ఎం) నాయకులు రఘుపాల్ ఆశయాలను కొనసాగిద్దామంటూ పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఐప్సో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. నాగేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌లో రఘుపాల్ సంతాప సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నాయకులు పుష్పాలతో నివాళి అర్పించారు. మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రఘుపాల్ జీవితమంతా ప్రపంచశాంతి కోసం పరితపించారని గుర్తుచేశారు. శాంతితో కూడిన ప్రపంచాన్ని చూడాలని ఆయన ఆకాంక్షించారని తెలిపారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ రఘుపాల్ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా, స్థానికంగానే శాంతి ఉద్యమ ఆవశ్యకత అవసరం పెరిగిందనీ, ఇలాంటి అత్యవసర సమయంలో రఘుపాల్ లేకపోవడం తీరని లోటని అన్నారు. గాజాలో పిల్లలకు కనీసం తాగు నీళ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ జీవిత పరమార్థమంటే మనిషి పుట్టిన కాలంలో అప్పటి పరిస్థితిని మరింత ఉన్నతంగా మార్చడమేనని మార్క్స్ చెప్పారని గుర్తుచేశారు. రఘుపాల్ తన జీవితంలో దాన్ని నూటికి నూరుశాతం పాటించారని తెలిపారు. సమాజానికి మనం ఎంత చేయగలమో అంత మేరకు చేయాలని కోరారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా మాట్లాడుతూ ఒకవైపు కార్మికుల హక్కుల కోసం పోరాడుతూనే, మరోవైపు శాంతి సంఘం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి రఘుపాల్ అని కొనియాడారు. ఆయన మరణం తర్వాత కూడా సమాజం కోసం ఉపయోగపడేలా తన శరీరాన్ని దానం చేశారని తెలిపారు. రఘుపాల్ మరణం ఉద్యమాలకు, సామాన్య ప్రజలకు తీరని లోటన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ ఏ సమావేశం నిర్వహించినా అందరి కన్నా ముందు వచ్చి అందరి తర్వాత వెళ్లేంతగా లీనమైపోయే వ్యక్తి రఘుపాల్ అని గుర్తుచేశారు. మరణం ఎవరికీ తప్పదనీ, అయితే దానికి ముందు, ఆయన పరిపూర్ణంగా జీవించి ఆదర్శంగా నిలిచారని తెలిపారు.
నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ రఘుపాల్ గొప్ప మానవతావాదనీ, మనిషిని ప్రేమించడం, శాంతి సంఘాన్ని బలోపేతం చేయడం, ఆ సంఘంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు జీవితాంతం పాటుపడ్డారని అన్నారు. శాంతియుత ప్రపంచాన్ని చూడాలని ఆకాంక్షించి చివరి వరకు దాని కోసం పోరాడారని స్మరించుకున్నారు. ఐప్సో జాతీయ నేత, పీస్ అవార్డు గ్రహీత, మాజీ ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి మాట్లాడుతూ సంఘంలోని వారిలో పెద్ద వయస్సు రఘుపాల్ దేననీ, అయితే అందరి కన్నా చురుకైన పాత్ర పోషించింది కూడా ఆయనేనని గుర్తుచేశారు. వయసు పెరిగినా శాంతి కోసం ప్రయాణం ఆపని మార్గదర్శి రఘుపాల్ అని కొనియాడారు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ ఆలోచనల్లో, అభిప్రాయంలో నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డ చరిత్ర రఘుపాల్ కుటుంబానిదని కొనియాడారు. ఆయన ఏ రంగంలో ఉన్నా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి అవిశ్రాంతంగా కృషి చేశారని తెలిపారు. సామ్రాజ్యవాద వ్యతిరేక అభ్యుదయ భావాలు కలిగిన వారినందరిని ఒకే తాటిపైకి తేవడంలో రఘుపాల్ క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పారు. ప్రేం పావనీ (ఏఐటీయూసీ), అరుణోదయ విమల, శాంతి సంఘం నాయకులు పీఎస్‌ఎన్ మూర్తి, వెంకట్రామిరెడ్డి తదితరులు మాట్లాడి నివాళులర్పించారు. అమ్మ నేత్ర, శరీరదాన సంఘం నాయకులు ఈశ్వర లింగం…రఘుపాల్ కుమారుడు డాక్టర్ గోపాల్ రెడ్డిని సన్మానించారు. ఈ సమావేశంలో శాంతి సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కె.వి.ఎల్, నాయకులు జె.కె.శ్రీనివాస్, రామరాజ్, గురుబచన్ సింగ్, శివకుమార్, శ్రీమన్నారాయణ, జహంగీర్ సాగర్, అర్షద్ అహ్మద్, అబ్దుల్ల రజాక్, అనూష తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -