కట్టా గాంధీ ఆశయాల సాధనకు కృషి చేద్దాం : సంస్మరణ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
నవతెలంగాణ-మధిర
దేశంలో ఆర్థిక అసమానతలు, కుల వివక్షత లేని సమాజం కోసం పోరాటం చేసేది కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్ కల్యాణ మండపంలో ఇటీవల మృతిచెందిన సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కట్టా గాంధీ సంస్మరణ సభ డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా కట్టా గాంధీ చిత్రపటానికి జాన్‌వెస్లీ, సుదర్శన్ రావు నివాళులర్పించారు. అనంతరం వెస్లీ మాట్లాడుతూ.. ప్రభుత్వాల ఆర్థిక అవసరాలు, బూర్జువా విధానాలు, దేశ సంపదను కార్పొరేట్ సంస్థల చేతిలో ఉండటం ద్వారానే దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని అన్నారు. తొలి నుంచి తుది వరకూ కమ్యూనిస్టు సిద్ధాంతానికి కట్టుబడి, పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన కట్టా గాంధీ నిర్వహించిన పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శమని తెలిపారు.
పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాలుగా కమ్యూనిస్టు పార్టీకి క్రియాశీలక కార్యకర్తగా ఉంటూ మధిర పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. బంజారా కాలనీ, హనుమాన్ ఎంప్లాయీస్ కాలనీతో పాటు ఎస్సీ కాలనీల్లో సమస్యల పరిష్కారానికి ఆందోళనలు నిర్వహించారని గుర్తుచేశారు. రేషన్ కార్డులు, సంక్షేమ పథకాల అమలుకు ప్రధానంగా మౌలిక వసతుల కల్పన కోసం గాంధీ కృషి చేశారని తెలిపారు. సీపీఐ(ఎం) సిద్ధాంతానికి అనుగుణంగా, పార్టీ పిలుపులో భాగంగా నిర్వహించిన పోరాటాలు మధిర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఈ సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా నాయకులు బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి లింగాల కమల్ రాజ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.



