Thursday, January 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రారంభోత్సవాల జోరు

ప్రారంభోత్సవాల జోరు

- Advertisement -

కొబ్బరికాయల హోరు
ఎన్నికల వేళ మున్సిపాల్టీల్లో రసవత్తర రాజకీయం
శంకుస్థాపనలు చేసిన వాటికే మళ్లీ మళ్లీ పూజలు
పోటాపోటీగా వచ్చి కొబ్బరికాయలు కొడుతున్న నాయకులు
అవాక్కవుతున్న ప్రజలు

నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
మట్టి రోడ్లు.. రోడ్లపై పారే మురుగు.. చెత్తాచెదారం, పిచ్చిమొక్కలతో నిండిన డ్రయినేజీలు.. కాలనీల్లో ఎక్కడ చూసినా అపరిశుభ్రత. వీటి గురించి పలుమార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడే లేకుండే. బడ్జెట్‌ లేదంటూ రోడ్లు, డ్రయినేజీల పనులు చేపట్టిన దాఖలాలు లేవు. ఇవన్నీ గతం. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఎక్కడ పడితే అక్కడ పనుల ప్రారంభోత్సవాల జోరు సాగుతోంది. గతంలో శంకుస్థాపనలు చేసిన వాటికి.. తాజాగా కొబ్బరికాయలు కొడుతూ వార్డులు, డివిజన్‌ల అభివృద్ధికి తామంటే తాము కృషి చేస్తున్నట్టు నాయకులు జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డివిజన్‌, వార్డులు ఇన్‌చార్జిలుగా కొబ్బరికాయలు కొడుతుంటే.. బీజేపీ నాయకులు.. ఎమ్మెల్యేలను పిలిపించుకుంటూ, ఆయన నిధులంటూ ప్రారంభోత్సవాలు చేపడుతున్నారు. ఎక్కడైతే పనులు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారో అక్కడే కొబ్బరికాయలు కొడుతుండటం గమనార్హం. పనులు ప్రారంభోత్సవాలకే పరిమితమా.. లేకుంటే ముందుకు సాగుతాయా అనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతుంది.

నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్‌, బోధన్‌, భీంగల్‌, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాల్టీలున్నాయి. మున్సిపల్‌ ఎన్నికలు రానున్న నేపథ్యంలో మున్సిపాల్టీల్లో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఒక వైపు పార్టీ నుంచి టికెట్‌ కోసం ప్రయత్నం చేస్తూనే మరో వైపు ఆయా వార్డుల్లో, డివిజన్‌లలో ఓటర్ల దృష్టిలో ఉండేందుకు ఆశావహులు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. దీంట్లో భాగంగా కార్పొరేషన్‌తో పాటు మున్సిపాల్టీలకు తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టీయూఎఫ్‌ఐడీసీ) నుంచి నిధులు మంజూరయ్యాయి. డివిజన్‌, వార్డుకు రూ.1 కోటి చొప్పున నిధులు విడుదలయ్యాయి. ప్యాచ్‌వర్క్‌ మరమ్మతులు, పాత రోడ్లపై రోడ్లు వేయడం కాకుండా.. కచ్చా రోడ్లలో బీటీ రోడ్లు, డ్రయినేజీలు నిర్మించాల్సి ఉంది. వీటికి సంబంధించి టెండర్‌లు పూర్తయ్యి.. రెండు నెలల క్రితమే శంకుస్థాపనలు సైతం అట్టహాసంగా నిర్వహించారు.

ఎన్నికల వేళ.. రంగంలోకి ఆశావహులు
మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించనున్న దరిమిలా.. ఆశావహులు అందివచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు ప్రచారం నిర్వహించుకుంటుండటం గమనార్హం. ప్రధానంగా నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో చూసుకుంటే.. ప్రస్తుతం నుడా(నిజామాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఆధ్వర్యంలో రూ.22 కోట్లతో వివిధ డివిజన్‌లలో పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు టీయూఎఫ్‌ఐడీసీ నిధులు డివిజన్‌కు కోటి రూపాయల చొప్పున రూ.60 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది. ఇది వరకే వీటికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌, అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ శంకుస్థాపన చేశారు.

కాగా ఎన్నికల నేపథ్యంలో ఆయా కాలనీల్లో ఆశావహులు కొబ్బరికాయలు కొడుతూ పనులు ప్రారంభిస్తుండటం గమనార్హం. డివిజన్‌ ఇన్‌చార్జీల హోదాలో కాంగ్రెస్‌ నాయకులు కొబ్బరికాయలు కొడుతుండగా.. ఎమ్మెల్యేను పిలిపించుకుంటూ బీజేపీ నాయకులు సైతం కొబ్బరికాయలు పోటాపోటీగా కొడుతున్నారు. కాగా, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో యూఐడీఎఫ్‌ నిధులు, సీడీఎఫ్‌ నిధులు మంజూరు చేయించినట్టు ప్రచారం చేస్తుండటం గమనార్హం. కానీ యూఐడీఎఫ్‌, సీడీఎఫ్‌ 5 కోట్ల నిధులు ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉన్నట్టు కాంగ్రెస్‌ నాయకులు పేర్కొంటున్నారు. వీటికి అడ్మినిస్ట్రేటీవ్‌ శాంక్షన్‌ వచ్చి టెండర్‌లు ఖరారు చేసి ఏజెన్సీని అలాట్‌ చేసిన తర్వాతే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించుకునే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -