– అధికారులకే రాకపోవడం పల్లె జనానికి ఆశ్చర్యం
– ప్రాక్టీస్ లేకే పాట తడబాటు – పల్లె జనాల మాట
నవతెలంగాణ – ఉప్పునుంతల
‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని 2003 చివర్లో అందెశ్రీ రచించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఈ పాట పల్లెల్లో, పట్టణాల్లో ప్రజలకు ఊపిరి పోసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2024 జూన్ 2న తెలంగాణ ప్రభుత్వం దీనిని అధికారిక రాష్ట్ర గీతంగా ప్రకటించింది. ఉద్యమ గళంగా నిలిచిన ఈ గీతం, తెలంగాణ ప్రజల గొంతుకగా గుర్తింపు పొందింది.
కానీ ఆగస్టు 15, జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలు వచ్చేసరికి పరిస్థితి తేడాగా కనిపిస్తోంది. మండల కేంద్రంతో పాటు అనేక గ్రామాల్లో జయ జయహే తెలంగాణ పదాలు నోటికి పట్టక, ఇప్పటికీ జనగణమననే ఆలాపిస్తూ జెండా ఎగరవేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించినా.. మండల కేంద్రంలోని వివిధ శాఖల కార్యాలయాల్లో ఇది పూర్తిస్థాయిలో పాడలేని పరిస్థితి ఉంది.
అధికారులకే గీతం పూర్తిగా రాకపోవడం చూసి పల్లె ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం జెండా ఆవిష్కరణకు రెండు మూడు రోజుల ముందే అన్ని శాఖలలో జయ జయహే తెలంగాణ గీతాన్ని ప్రాక్టీస్ చేయించాలని పల్లె పెద్దలు, యువత కోరుతున్నారు.
అలాగే శాఖలలో విధులకు హాజరయ్యే అధికారులు రోజూ విధుల ప్రారంభంలో ఈ గీతాన్ని ఆలాపించి పనులు మొదలుపెడితే, గీతం నోటికి పట్టే అవకాశం ఉంటుందని మండలంలోని విద్యావంతులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర గౌరవం నిలవాలంటే ముందుగా ఈ గీతం ప్రతి తెలంగాణవాసి నోట నాటాలని పల్లె మాటగా వినిపిస్తోంది.



