‘జాతీయ డిమాండ్‌ల దినం, నోయిడా కార్మికుల పోరాట సంఘీభావ’ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల నేతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హక్కుల కోసం గొంతెత్తితే కార్మికులపై నిర్భందాన్ని ప్రయోగించటం పరిపాటిగా మారిందని కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ‘జాతీయ డిమాండ్‌ల దినం, నోయిడా కార్మికుల పోరాట సంఘీభావ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ కార్యదర్శి చంద్రశేఖర్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బాలరాజు, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, టీయూసీఐ కార్యదర్శి ఎస్‌ఎల్ పద్మ, ఐఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్, బీఆర్‌టీయూ అధ్యక్షులు రాంబాబు యాదవ్, తెలంగాణ రైతు సంఘం కోశాధికారి శోభన్‌నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బీ ప్రసాద్ మాట్లాడారు.
ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా, నోయిడాలో కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ అసంఘటిత రంగ కార్మికుల పోరాటాన్ని ప్రభుత్వం అణచే యాలని కుట్ర చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలను రూ.26వేలకు పెంచాలని కార్మికులు చేసిన ఆందోళన, సమ్మెపై పోలీసులు విచక్షణా రహితంగా చేసిన దాడులను గుర్తుచేశారు. కార్మికులను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. గ్రేటర్ నోయిడా, మానెస్సర్, గురుగ్రావ్, ఫరిదాబాద్ ఇతర ప్రాంతాల్లో జరిగిన సమ్మెపై ప్రభుత్వ దాడిని ప్రజాస్వామికవాదులు ఖండించాలని కోరారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు తమ హక్కుల గురించి, వేతనాల పెంపు గురించి మాట్లాడొద్దని హెచ్చరించట మేనన్నారు. ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పోలీసు బలగాలు, పారిశ్రామికవేత్తలకు అండగా నిలబడి కార్మికవర్గాన్ని అణిచేందుకు ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకు పోలీసుల ప్రతాపం విచక్షణారహితంగా కొనసాగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
మూడు నెల్లుగా యూపీలో కార్మికులు తెగించి పోరాడితే, సమ్మెలు చేస్తుంటే, చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం పారిశ్రామిక కార్మికులకు వ్యతిరేకంగా అమాను షంగా వ్యవహరించిందని విమ ర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్‌కోడ్ లతో కార్మిక హక్కులు హరించబడుతున్నా యని చెప్పారు. పనిగంటలను పెంచుతూ, మహిళా కార్మికులను అక్రమంగా, మానసికం గా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నా రన్నారు. పని ప్రదేశంలో రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీకాంత్, నగర కార్యదర్శి కుమారస్వామి, నాయకుడు జి.రాములు, ఏఐటీయూసీ నాయకులు బోస్, టీయూసీఐ నాయకులు ప్రదీప్, ఐఎప్‌టీయూ నాయకులు అనురాధ, అరుణక్క తదితరులు పాల్గొన్నారు.



