– రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన
– పాల్గొన్న డీఎస్పీ సతీష్ కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ రాష్ట్ర డీజీపీ…. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రారంభించిన రాష్ట్రవ్యాప్త ఎర్రైవ్ ఎలైవ్ ప్రచారాన్ని విస్త్రుతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏ ప్రామిస్ టూ అవర్ ఫ్యామిలీస్ నినాదంతో గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు పాల్వంచ డీఎస్పీ ఆర్. సతీష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ కళాశాలలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల,వీకేడీవీఎస్ రాజు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్ధులు నుద్దేశించి డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని, నాలుగు చక్రాల వాహనాల్లో సీటు బెల్ట్ వినియోగం తప్పనిసరి చేయాలని, మద్యం సేవించి వాహనం నడపడం,మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రాణనష్టం,కుటుంబాలపై పడే తీవ్ర ప్రభావాలను గతంలో ఈ ప్రాంతంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలను ఉదాహరణగా చూపిస్తూ స్పష్టంగా వివరించారు.రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.
అనంతరం విద్యార్థులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ హాజరై, యువత రోడ్డు నియమాలు పాటించడం ద్వారా మాత్రమే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎం.నిర్మల,ఏరియా హాస్పిటల్ డాక్టర్ బి.విజయ్ కుమార్, అశ్వారావుపేట సీఐ పి. నాగరాజు,ఎస్.ఐ యయాతి రాజు, దమ్మపేట ఎస్‌ఐ బి. సాయి కిషోర్ రెడ్డి, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


